4 గిరిజన మ్యూజియంలు
సాక్షి, హైదరాబాద్: గిరిజనులు, ఆదివాసీ తెగల సంస్కృతి, సంప్రదాయాలను ప్రస్తుత, భవిష్యత్ తరాలకు చాటిచెప్పేందుకు త్వరలో నాలుగు ప్రదర్శన శాలలు(మ్యూజియం) ఏర్పాటు కానున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. మేడారం సమ్మక్క, సారక్క జాతర జరిగే ప్రాంతంలో ఐదెకరాల విస్తీర్ణంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. దీనికి రూ.5 కోట్లు ఖర్చు చేస్తోంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2018 జనవరి నెలాఖరులో జాతర ప్రారంభమయ్యేనాటికి మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మ్యూజియంలో సమ్మక్క, సారక్కల జీవిత విశేషాలు, కోయతెగల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి లైవ్ ప్రెజెంటేషన్స్‌ను ఏర్పాటు చేస్తారు. అరుదైన విగ్రహాలు, బస్తర్ ప్రాంతంతో ఈ తెగకున్న సంబంధాలు, అక్కడి ప్రాచీన అవశేషాలను ప్రదర్శిస్తారు.
నిర్మల్‌లో రాంజీగోండ్ మ్యూజియం
తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడైన రాంజీగోండ్ స్వస్థలంలో మరో మ్యూజియంను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నిర్మల్ సరిహద్దులో దీనికోసం స్థలాన్ని గుర్తించింది. సిపాయిల తిరుగుబాటు సమయంలో దాదాపు వెయ్యి మంది గోండ్‌లను ఏకకాలంలో ఉరితీయడంతో ఒక ఊరి పేరు ఉరిలమర్రిగా మారింది. దీంతో అక్కడి చరిత్రతో పాటు గోండ్ తెగల సంస్కృతిని ప్రతిబింబించేలా శిలలు, విగ్రహాలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియంకు కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా రూ.10 కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనుంది. ఈమేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ప్రధాని కార్యాలయం సానుకూలంగా స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు.
నల్లమల, భద్రాచలంలోనూ..
చెంచుల సంస్కృతి ప్రతిబింబించేలా నల్లమల అటవీ ప్రాంతంలో, కోయ తెగల సంస్కృతిని చాటేలా భద్రాచలం ఐటీడీఏ పరిధిలో మ్యూజియాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని మ్యూజియంకు మరమ్మతులు చేసి ఆధునిక హంగులతో నిర్మించాలని గిరిజన శాఖ నిర్ణయించింది.