Tribal Museum
-
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ తెలంగాణల్లోనూ గిరిజన మ్యూజియాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. సోమవారం మణిపూర్‌లో రాణిగైడిన్లు గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంకు వర్చువల్ ద్వారా అమిత్ షా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన మ్యూజియాలకు రూ.195 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్లకు రూ.110 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. -
గిరిజన మ్యూజియం దేశానికే ఆదర్శం
సాక్షి, చింతపల్లి(విశాఖ) : తాజంగిలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం దేశానికే ఆదర్శంగా నిలవాలని డిప్యూటీ సీఎం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి ఆకాంక్షించారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని శుక్రవారం విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటైన సభలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 21 ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మ్యూజియాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టాయన్నారు. చింతపల్లి ప్రాంతం వేదికగా అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో ఎంతోమంది గిరిజనులు బ్రిటిషు పాలకులపై తిరుగుబాటు చేశారన్నారు. డౌనూరు నుంచి లంబసింగి వరకు ఘాట్‌రోడ్డు నిర్మాణ సమయంలో అల్లూరి సీతారామరాజే స్వయంగా బ్రిటిషు పాలకులపై దాడి చేసేందుకు సిద్ధంకావడం గొప్ప చరిత్ర అన్నారు. సాధారణ విల్లంబులతో చింతపల్లి పోలీసుస్టేషన్‌పై దాడిచేసి తుపాకులు స్వాధీనం చేసుకోవడం బ్రిటీష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించిందన్నారు. ఆయనకు అండగా మల్లుదొర, మర్రి కామయ్యలు ప్రాణత్యాగానికి సిద్ధంకావడం మనం చేసుకున్న అదృష్టంగా భావించాలన్నారు. దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న గిరిజన యోధుల గురించి భావితరాలకు తెలియాలన్నారు. అందుకు మ్యూజియం నిర్మాణం పూర్తయితే లంబసింగి ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని, గిరిజనులకు కూడా ఉపాధి కలుగుతుందని పుష్పశ్రీ వాణి అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల గిరిజనులకు ఆదర్శం అరకు ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లోని గిరిజనులకు ఇక్కడి మ్యూజియం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో ఆంధ్ర కశ్మీర్ అయిన లంబసింగిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు, జీసీసీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, ఐటీడీఏ పీఓ ఆర్. గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి. అభిషేక్, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ రఘువర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల లోగోలను ఆవిష్కరించారు. -
Jodeghat Museum: జోడెన్‌ఘాట్ వీరభూమి
‘కుమ్రుం భీము గిరిజన సంగ్రహాలయం’ ఇది ట్రైబల్ మ్యూజియం. ఆదివాసీల జీవనశైలితోపాటు కుమ్రుం భీము జీవితాన్ని బొమ్మల్లో చూపించే ప్రయత్నం. కొండ అద్దంలో ఇముడుతుందేమో కానీ కుమ్రుం భీము పోరాటం, జీవితాశయ సాధనలను ప్రతిబింబించడానికి ఒక మ్యూజియం సరిపోదు, ఇలాంటి పది మ్యూజియాలు కావాలి. ఈ మ్యూజియం కుమ్రుంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కెరిమెర మండలం, జోడెన్‌ఘాట్ గ్రామంలో ఉంది. జోడెన్‌ఘాట్‌లో కుమ్రుం భీము సమాధి, సమాధి పక్కనే భీము చేత్తో తుపాకీ పట్టుకున్న విగ్రహం ఉన్నాయి. విగ్రహం ఎదురుగా మ్యూజియం ఉంది. ఇందులో ఆదివాసీలు ఉపయోగించే వస్తువులు, పాత్రలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, ఆభరణాల అలంకరణ, పెళ్లి వేడుక చిత్రాలు, వేడుకలు, దేవతాపూజ సన్నివేశాలను కళ్లకు కట్టారు. వీటన్నింటిలో మేటిగా కుమ్రుం భీము జీవితావిష్కరణ కనిపిస్తుంది. మ్యూజియంలోకి ప్రవేశించగానే ఎడమ వైపు ఒక నాయకుడు, పది మంది అనుచరుల శిల్పాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. మధ్యలో ఉన్నది భీము. ద్వారానికి కుడివైపు భీము ఫొటో, విగ్రహంతోపాటు భీము భార్య సోమ్బాయి ఫొటో ఉంది. ఆ పక్కనే భీముతో కలిసి పని చేసిన కుమ్రుం సూరు ఫొటో, వేడమ రాము ఫొటో కూడా. భీము ఆచూకీ కోసం నిజాం మనుషులు గాలిస్తున్న సమయంలో ప్రమాదం ముంచుకు వస్తోందని హెచ్చరించడానికి రాము కాలికొం అనే వాద్యాన్ని ఊది భీమును, భీము బృందాన్ని అప్రమత్తం చేసేవాడు. ఈ మ్యూజియానికి పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాలలో భీము మనుమరాలు సోమ్బాయి ఉంది. ఆ స్కూల్లో చదువుకుంటూ కాదు, పాఠాలు చెప్తూ కూడా కాదు. స్కూలు పిల్లలకు భోజనం వండి పెట్టే ఉద్యోగంలో ఉందామె. భీము గౌరవార్థం సభలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. జిల్లాకు పేరు కూడా పెట్టింది. కానీ అతడి వారసుల ఉపాధి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. అంతేకాదు... భీముకు ఇస్తున్న గౌరవం అతడి పోరాటానికి ఇవ్వడం లేదని తెలిసినప్పుడు కూడా ఆశ్చర్యమేస్తుంది. భూమి కోసం పోరాటం కుమ్రుం భీము పుట్టింది ఆసిఫాబాద్ జిల్లా సంకేపల్లిలో. నిజాం పాలన కాలంలో రెవెన్యూ శాఖ వేధింపులు ఎక్కువగా ఉండేవి. పంటను ఐదు వంతులుగా విభజించి మూడు వంతులు ప్రభుత్వానికి కట్టాల్సి వచ్చేది. పండించిన వాళ్లకు రెండు వంతులు మాత్రమే మిగిలేది. ‘ఇదేం న్యాయం’ అని ప్రశ్నించిన భీము కుటుంబాన్ని స్థానిక పటేదారు వేధించడం మొదలుపెట్టాడు. భీము కుటుంబం ఊరు వదిలి సుర్దాపూర్కి పారిపోయింది. పటేదారు మనుషులు అక్కడికీ వచ్చారు. భీము ఆవేశం పట్టలేక పటేదారును కొట్టడంతో అతడు చనిపోతాడు. అప్పుడు భీము అడవుల్లోకి పారిపోతాడు. అడవుల నుంచి అస్సాంకు వెళ్లి ఆరేడేళ్ల పాటు అక్కడే ఉండి చదవడం, రాయడం నేర్చుకుని తిరిగి సుర్దాపూర్కొస్తాడు. అప్పటి నుంచి ఆదివాసీలకు సాగు చేసుకుంటున్న భూమి మీద సంపూర్ణ హక్కుల కోసం మరింత పటిష్టంగా పోరాడడం మొదలు పెట్టాడు. అనేక దరఖాస్తులు పెట్టాడు. నిజాంను స్వయంగా కలిసి విన్నవించుకోవడానికి పదిహేను మంది ఆదివాసీలతో హైదరాబాద్‌కు వెళ్లాడు. నిజామ్ అనుమతి ఇవ్వకపోవడంతో తన స్వస్థలంలోనే పోరాడాలని నిర్ణయించుకుని వెనక్కి వచ్చేశాడు భీము. అప్పటి నుంచి శిస్తు కట్టమని అడిగిన పటేదార్లను, రెవెన్యూ అధికారులను ధిక్కరించడమే ధ్యేయంగా పోరాటం తీవ్రతరం చేశాడు. వీరి స్థావరం కొండ మీద జోడెన్‌ఘాట్‌కు సమీపంలో ఉన్న భాభేఝరి. ఇక్కడి నుంచి ఉద్యమాన్ని నడిపాడు భీము. చుట్టు పక్కల 14 గ్రామాలను ప్రభావితం చేశాడు. భీము పోరాటాన్ని అణచివేయడానికి నిజాం సైన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. రెండు వందల మందితో కూడిన భీము సైన్యం రెండు నెలల పాటు నిజాం సైన్యాన్ని విజయవంతంగా నిలువరించగలిగింది. భీము అనుచరుల్లో ‘కొద్దు’ అనే వ్యక్తి రోజూ కొండ కిందకు వెళ్లి భీము బృందానికి అవసరమైన ఆయుధాలు, ఆహారాన్ని కొండమీదకు తెచ్చేవాడు. అతడిని వేధించి, ప్రలోభ పెట్టిన నిజాం సేనలు ఎట్టకేలకు భీము కదలికలను పసిగట్టాయి. భీము ఉన్న కొండకు వెనుక వైపు మోవాడ్ ప్రాంతం నుంచి నిజాం సేనలు వచ్చి జోడెన్‌ఘాట్‌లో ఉన్న భీమును తుపాకీతో కాల్చి చంపేశాయి. భీము అక్కడికక్కడే తుది శ్వాస వదిలాడు. ఇది జరిగింది 1940, ఆశ్వయుజ పౌర్ణమి రోజున. అప్పటికి అతడి వయసు 39. నిజాం పాలకులు తుపాకీ తూటాతో భీము ఆశయానికి గండికొట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా నిశ్శబ్దంగా అదే పంథాను కొనసాగిస్తున్నాయి. భీము ఏ ఆశయం కోసం పోరాడాడో ఆ ఆశయం ఇప్పటికీ నెరవేరనే లేదు. స్థానిక ఆదివాసీలు ఇప్పటికీ పోడు భూముల మీద హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆదివాసీలు భీము జీవిత కథను వివరిస్తూ... మా చేతిలో తుపాకీ లేదు, కానీ తుపాకీ పట్టిన భీము స్ఫూర్తి మాలో ఉందని చెబుతున్నారు. ఈ పర్యటనలో తరాలకు కూడా తరగని స్ఫూర్తినిచ్చిన కుమ్రుం భీము జీవితం కళ్ల ముందు మెదలుతుంది. చదవండి: కురువపురం దీవి; కృష్ణమ్మ సిగలో చేమంతి అండర్‌వాటర్‌లో మ్యూజియం.. అదెక్కడంటే? -
4 గిరిజన మ్యూజియంలు
సాక్షి, హైదరాబాద్: గిరిజనులు, ఆదివాసీ తెగల సంస్కృతి, సంప్రదాయాలను ప్రస్తుత, భవిష్యత్ తరాలకు చాటిచెప్పేందుకు త్వరలో నాలుగు ప్రదర్శన శాలలు(మ్యూజియం) ఏర్పాటు కానున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. మేడారం సమ్మక్క, సారక్క జాతర జరిగే ప్రాంతంలో ఐదెకరాల విస్తీర్ణంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. దీనికి రూ.5 కోట్లు ఖర్చు చేస్తోంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2018 జనవరి నెలాఖరులో జాతర ప్రారంభమయ్యేనాటికి మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మ్యూజియంలో సమ్మక్క, సారక్కల జీవిత విశేషాలు, కోయతెగల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి లైవ్ ప్రెజెంటేషన్స్‌ను ఏర్పాటు చేస్తారు. అరుదైన విగ్రహాలు, బస్తర్ ప్రాంతంతో ఈ తెగకున్న సంబంధాలు, అక్కడి ప్రాచీన అవశేషాలను ప్రదర్శిస్తారు. నిర్మల్‌లో రాంజీగోండ్ మ్యూజియం తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడైన రాంజీగోండ్ స్వస్థలంలో మరో మ్యూజియంను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నిర్మల్ సరిహద్దులో దీనికోసం స్థలాన్ని గుర్తించింది. సిపాయిల తిరుగుబాటు సమయంలో దాదాపు వెయ్యి మంది గోండ్లను ఏకకాలంలో ఉరితీయడంతో ఒక ఊరి పేరు ఉరిలమర్రిగా మారింది. దీంతో అక్కడి చరిత్రతో పాటు గోండ్ తెగల సంస్కృతిని ప్రతిబింబించేలా శిలలు, విగ్రహాలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియంకు కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా రూ.10 కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనుంది. ఈమేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ప్రధాని కార్యాలయం సానుకూలంగా స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. నల్లమల, భద్రాచలంలోనూ.. చెంచుల సంస్కృతి ప్రతిబింబించేలా నల్లమల అటవీ ప్రాంతంలో, కోయ తెగల సంస్కృతిని చాటేలా భద్రాచలం ఐటీడీఏ పరిధిలో మ్యూజియాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని మ్యూజియంకు మరమ్మతులు చేసి ఆధునిక హంగులతో నిర్మించాలని గిరిజన శాఖ నిర్ణయించింది. -
మైదానంలా మేడారం!
తగ్గిపోతున్న అటవీ సంపద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు హరితహారంలోనూ దక్కని ప్రాధాన్యం మాటలకే గిరిజన మ్యూజియం పరిమితం హన్మకొండ : ఒకప్పుడు మేడారం జాతర అంటే కంకవనాలతో కూడిన దట్టమైన అడవి గుండా ప్రయాణం చేయాల్సి వచ్చేది. గడిచిన దశాబ్దకాలంగా భక్తుల సంఖ్య పెరగడం.. అందుకనుగుణంగా ఏర్పాట్ల కారణంగా అటవీ విస్తీర్ణం తగ్గిపోరుుంది. వన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం పరిసర ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం పెంచడంలో జిల్లా అధికారుల శ్రద్ధ చూపకపోవడమే ఇందుకు కారణం. మేడారం జాతర-2012 సందర్భంగా అప్పటి జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఇక్కడి అటవీ సంపదను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే జాతర నాటికి మేడారం పరిసర ప్రాంతాల్లో రెండు లక్షల మొక్కలను పెంచుతామన్నారు. కానీ... గత జాతర సందర్భంగా ఈ విషయాన్ని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమంలో మేడా రం యాక్షన్ ప్లాన్‌కు చోటు దక్కలేదు. మరోవైపు ఇక్కడ నిర్మిస్తామని చెప్పిన గిరిజన మ్యూజియం నాలుగేళ్లుగా ప్రకటనలకే పరిమితమైంది.తాడ్వాయి, పస్రా అటవీశాఖ రెంజ్‌ల కిందికి మేడారం అటవీ ప్రాంతం వస్తుంది. తాడ్వాయి రేంజ్లో బొడగూడ బీట్ పరిధిలో 3,360 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. దీని పరిధిలోకి సమ్మక్క, సారలమ్మ గద్దెలు, ఆర్టీసీ బస్‌స్టాండ్, పోలీస్ అవుట్ పోస్టు, చిలకలగుట్ట తదితర ప్రాంతాలు వస్తాయి. జంపన్నవాగు, కన్నెపల్లి, ఊరట్టం, నార్లపూర్, కాల్వపల్లి ప్రాంతాలు పస్రా అటవీశాఖ రేంజ్లో నార్లాపూర్ బీట్ కిందకి వస్తాయి. దీని పరిధిలో 3,330 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. మెత్తంగా మేడారం చుట్టు పక్కల 6,630 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంటే... దీనిలో 2,500 హెక్టార్ల అటవీ ప్రాంతంలో భక్తులు విడిది చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో భక్తుల వసతికి పందిళ్లు, వంట చెరుకు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, దుకాణాలు, షెడ్లు, రోడ్లు తదితర అవసరాలకు నేరుగా అడవులపై ఆధారపడుతున్నారు. ఫలితంగా చెట్లను నరకడం పెరిగింది. దీంతో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. అటవీశాఖ లెక్కల ప్రకారమే మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో 200 హెక్టార్ల అటవీ ప్రాంతం పూర్తి మైదానంగా మారింది. అటవీ విస్తీర్ణం పెంచడంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే మేడారం వనజాతర కాస్త మేడారం-మైదాన జాతరగా మారిపోయే ప్రమాదం ఉంది. మరో ఆర్నెళ్లలో మేడారం జాతర వస్తున్న సందర్భంగా జాతర విశిష్టతలు, ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జాతరకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే కంకవనాల విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. సంస్కృతి ప్రధానంగా మ్యూజియం గిరిజనుల సంస్కృతి సంప్రదాయలు, ఆహారపు అలవాట్లు, వేషభాషలు ప్రతిబింబించేలా మేడారంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతో కాలం నుంచి ఉంది. అయితే మేడారం జాతర-2012 సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మేడారంలో గిరిజన మ్యూజియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2014లో వచ్చే జాతర కల్లా మేడారంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు అందుబాటులోకి వస్తుందన్నారు. మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నట్లు అప్పటి జిల్లా మంత్రి పొన్నాల లక్ష్మయ్య పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ.. 2014 జాతర సమయంలో టెండర్ల ప్రక్రియ జరుగుతోందంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత ఈ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకప్పటితో పోల్చితే మేడారం జాతరకు ఏడాది పొడవునా భక్తులు వస్తున్నారు. ఆదివారం, సెలవు దినాల్లో వనదేవతలను దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య వందల్లో ఉంటోంది. ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులకు మేడారం జాతర విశిష్టతలు, గిరిజన సంప్రదాయాలు తెలుసుకునేందుకు వీలుగా గిరిజన మ్యూజియాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. -
జోడేఘాట్‌లో ప్రపంచస్థాయి మ్యూజియం
-
ఆదిచిత్ర అదరహో
కొండగాలికి ఊగిసలాడే కొమ్మలు.. గిరికోనలో కదలాడే సెలయేళ్లు.. ఆదివాసీలు కొలిచే దేవుళ్లు.. ఇవన్నీ కాన్వాస్‌పై కదలాడాయి. గిరిజనుల కుంచె నుంచి జాలువారిన చిత్రరాజాలు వారి జీవనశైలిని కళ్లముందుంచాయి. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ‘ఆదిచిత్ర’ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ప్రారంభించారు. గోండ్, భిల్, రత్వా, సౌర, వర్లి, మౌరియా గిరిజన తెగలకు చెందిన ఆర్టిస్టుల చేతుల్లో రంగులద్దుకున్న చిత్రాలు వారి సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. వారు ఆరాధించే పక్షులు, జంతువుల చిత్రాలు, పామ్ లీఫ్ పెయింటింగ్‌తో తీర్చిదిద్దిన వినాయకుడి చిత్రం కళాప్రియుల మనసులను దోచుకుంటున్నాయి. ఈ సందర్భంగా ‘నాయక పోడ’ గిరిజనులు తమ నృత్యంతో అలరించారు. ఈ ప్రదర్శన ఈ నెల 21 వరకూ కొనసాగనుంది. - సాక్షి, సిటీప్లస్