ఆదిచిత్ర అదరహో
కొండగాలికి ఊగిసలాడే కొమ్మలు.. గిరికోనలో కదలాడే సెలయేళ్లు.. ఆదివాసీలు కొలిచే దేవుళ్లు.. ఇవన్నీ కాన్వాస్‌పై కదలాడాయి. గిరిజనుల కుంచె నుంచి జాలువారిన చిత్రరాజాలు వారి జీవనశైలిని కళ్లముందుంచాయి. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ‘ఆదిచిత్ర’ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ప్రారంభించారు. గోండ్, భిల్, రత్వా, సౌర, వర్లి, మౌరియా గిరిజన తెగలకు చెందిన ఆర్టిస్టుల చేతుల్లో రంగులద్దుకున్న చిత్రాలు వారి సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. వారు ఆరాధించే పక్షులు, జంతువుల చిత్రాలు, పామ్ లీఫ్ పెయింటింగ్‌తో తీర్చిదిద్దిన వినాయకుడి చిత్రం కళాప్రియుల మనసులను దోచుకుంటున్నాయి. ఈ సందర్భంగా ‘నాయక పోడ’ గిరిజనులు తమ నృత్యంతో అలరించారు. ఈ ప్రదర్శన ఈ నెల 21 వరకూ కొనసాగనుంది.
- సాక్షి, సిటీప్లస్