KV ramanachary
-
ఎన్టీఆర్ పురస్కారానికి ‘నగెన్’ ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ అస్సామీ కథకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, అస్సామీ పత్రికల సంపాదకుడు ‘నగెన్ సైకియా’ను 2019 ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి వెల్లడించారు. ట్రస్ట్ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారితో కలిసి ఆమె గురువారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2006లో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్‌ను స్థాపించామని తెలిపారు. 2007 నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 26 భాషల్లోని ప్రముఖులకు ఏటా పురస్కారాలు అందిస్తున్నామన్నారు. గతంలో ఎస్ఎల్ ఖైరప్ప (కన్నడం), సచ్చిదానందన్ (మలయాళం), అశోక్ మిత్రన్ (తమిళం), మహా శ్వేతాదేవి (బెంగాలీ), మనోజ్ దాస్ (ఒరియా), నేమాడి బాలచందర్ (మరాఠీ), జిలానీ బానో (ఉర్దూ), డాక్టర్ రఘువీర్ చౌదరి (గుజరాతీ) తదితరులను ఎంపిక చేశామని పేర్కొన్నారు. తెలుగుకు సంబంధించి ఆవత్స సోమసుందరం, రవ్వా శ్రీహరి, డాక్టర్ సి.నారాయణరెడ్డి, కాళీపట్నం రామారావు తదితర భాషా సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేశామన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జయంతి రోజైన ఈ నెల 28న నగెన్ సైకియాకు పురస్కారాన్ని ప్రదానం చేస్తామని తెలిపారు. పురస్కారం కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రంతో పాటు, జ్ఞాపికను బహూకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతల సంఘం అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, న్యాయ నిర్ణేతల సంఘం సభ్యులు డాక్టర్ సూర్య ధనుంజయ్, డాక్టర్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రవ్వా శ్రీహరికి ఎన్టీఆర్ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన సతీమణి లక్ష్మీపార్వతి సాహితీ యజ్ఞం చేస్తున్నారని ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా ఇచ్చే జాతీయ సాహితీ పురస్కారాన్ని 2018 ఏడాదికి సంస్కృతాంధ్ర పండితుడు రవ్వా శ్రీహరికి ఇవ్వనున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. రమణాచారి మాట్లాడుతూ... జ్యూరీ కమిటీ మెంబర్లు డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, డాక్టర్ ముక్తేవి భారతి భేటీ అయి ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి శ్రీహరిని ఎంపిక చేశామన్నారు. 2007 నుంచి ఏటా ఈ పురస్కారాన్ని ఇస్తున్నామని లక్ష్మీపార్వతి అన్నారు. పురస్కారంతోపాటు లక్ష నగదు, గోల్డ్ మెడల్, ఎన్టీఆర్ జ్ఞాపికను ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య రానున్నారని తెలిపారు. -
పుష్కరాల సంచిక విడుదల
ఝరాసంగం రూరల్: రాష్ర్ట ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, దత్తగిరి మహరాజ్ ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహరాజ్ చేతులమీదుగా కృష్ణా పుష్కరాల సంచికను విడుదల చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కేవీ రమణాచారి చాంబర్లో కృష్ణా పుష్కరాల ప్రాముఖ్యత, పుష్కరాల సమయాలు, ఘట్టాలు, ఆశ్రమం తరఫున భక్తులకు అందించే సేవలకు సంబంధించిన సంచికను విడుదల చేశారు. పూర్వం నుంచి వేద పండితులు పుష్కరాల ప్రాముఖ్యతను తెలుపుతున్నట్లు అనేక గ్రంథాల్లో ఉన్నదని రమణచారి, పీఠాధిపతి అవధూతగిరి మహరాజ్ తెలిపారు. పుష్కరాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరు పూనీతులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సందేశం నిండిన సినిమా
అవయవ దానం గొప్పతనాన్ని తెలియజేసే కథాంశంతో కరీంనగర్ టాకీస్ సంస్థ ఓ చిత్రం మొదలుపెట్టింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న దర్శక- నిర్మాత అల్లాణి శ్రీధర్ కెమెరా స్విచాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర ప్రధాన సలహాదారు కేవీ రమణాచారి క్లాప్ ఇచ్చారు. దర్శక, నిర్మాత సానా యాదిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘అంతా తెలంగాణ కళాకారులతో ఈ చిత్రం చేస్తున్నాం. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేస్తాం. ఈ చిత్రం ద్వారా మంచి సందేశం ఇస్తున్నాం’’ అని చిత్రదర్శకుడు ఎం.ఎం. రాజ్‌కుమార్ చెప్పారు. మదన్, గాయత్రి నటిస్తున్న జంటగా ఈ చిత్రానికి సంగీతం: వెంకట్, కెమెరా: అనిల్ పల్లా, స్క్రీన్‌ప్లే-మాటలు: ప్రభావ్. -
మతానికి, ధర్మానికి తేడా గుర్తించండి: స్వరూపానంద
మతానికి, ధర్మానికి మధ్య గల తేడాను గుర్తించాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రజలకు చెప్పారు. 'మాండూక్య అద్వైత స్వరూపం వేదాంత గ్రంథరాజం' పుస్తకాన్ని ఆయన చందానగర్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవిష్కరించారు. ధర్మం మతం కంటే పెద్దదని, ఈ పుస్తకం ఆ విషయాన్నే వివరిస్తుందని ఆయన తెలిపారు. ''మాండూక్య అద్వైతం ధర్మం గురించి మాత్రమే చెబుతుంది. ధర్మసూక్ష్మాలను ఈ పుస్తకం ద్వారా ప్రజలకు వివరించి, వాళ్లకు విశదపరిచేందుకు చేసిన ప్రయత్నం సఫలీకృతం అవుతుందనే భావిస్తున్నాను. దైవిక జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకునే వాళ్లకు ఇది ఉపయోగపడుతుంది'' అని స్వామి చెప్పారు. ఈ పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం ఈ పుస్తకరాజాన్ని ఆవిష్కరించారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వివిధ సందర్భాల్లో తన శిష్యులకు చేసిన ప్రబోధాలతో ఈ మహాగ్రంథాన్ని రూపొందించారు. ఈ గ్రంథానికి తుదిరూపు ఇచ్చేందుకు రెండున్నరేళ్ల సమయం పట్టింది. ఈ గ్రంథాన్ని చాగంటి ప్రకాశరావు కూర్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న మతమార్పిడులపై ఈ సందర్భంగా స్వామి స్వరూపానంద ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని అనుసరించడం ద్వారా ఈ మతమార్పిడులను అత్యవసరంగా ఆపాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమానత్వం, సత్యం గురించి మాట్లాడే సనాతనధర్మాన్ని వ్యాప్తి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. జగద్గురు శంకరాచార్య బోధించిన పది ఉపనిషత్తుల్లో అత్యంత ప్రముఖమైనది ఈ మాండూక్యోపనిషత్తు అని స్వరూపానంద తెలిపారు. ఉపనిషత్తులు, వేదాలు కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమని కొందరు అనుకుంటారు గానీ అది తప్పని చెప్పారు. అన్ని మతాలు, అన్ని కులాలకు చెందినవారు తప్పనిసరిగా ఈ మహాగ్రంథాన్ని చదివి, అర్థం చేసుకోవాలని.. ఇది దైవిక ఆలోచనలకు మార్గం చూపుతుందని అన్నారు. ఎవరైనా ముక్తి కావాలనుకుంటే.. ఈ మహాగ్రంథాన్ని చదివితే సరిపోతుందన్నారు. సనాతన ధర్మాన్ని ఒక్కతాటి మీదకు తేవడంలో స్వామి స్వరూపానంద సేవలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ప్రస్తుతించారు. మాండూక్య అద్వైతోపనిషత్తు సారాన్ని పైకి తేవడంలో స్వామి చేసిన ప్రయత్నాలను పలువురు వేద పండితులు తన దృష్టికి తెచ్చారన్నారు. తాను టీటీడీ ఈవోగా ఉన్న సమయంలో స్వామి సూచనలను ఎలా అమలుచేసినదీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గుర్తుచేసుకున్నారు. వేదాలు ధర్మసారాన్ని వివరిస్తాయి కాబట్టి వాటిని అనుసరించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం చెప్పారు. ఈ వేదికపై ఆంధ్రా వేదపండితుడు సుబ్రహ్మణ్య దీక్షితులు, కర్ణాటక వేదపండితుడు అశ్వత్థనారాయణ అవధాని, అఖిలభారత బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌లను స్వామి సన్మానించారు. -
ఆదిచిత్ర అదరహో
కొండగాలికి ఊగిసలాడే కొమ్మలు.. గిరికోనలో కదలాడే సెలయేళ్లు.. ఆదివాసీలు కొలిచే దేవుళ్లు.. ఇవన్నీ కాన్వాస్‌పై కదలాడాయి. గిరిజనుల కుంచె నుంచి జాలువారిన చిత్రరాజాలు వారి జీవనశైలిని కళ్లముందుంచాయి. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ‘ఆదిచిత్ర’ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ప్రారంభించారు. గోండ్, భిల్, రత్వా, సౌర, వర్లి, మౌరియా గిరిజన తెగలకు చెందిన ఆర్టిస్టుల చేతుల్లో రంగులద్దుకున్న చిత్రాలు వారి సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. వారు ఆరాధించే పక్షులు, జంతువుల చిత్రాలు, పామ్ లీఫ్ పెయింటింగ్‌తో తీర్చిదిద్దిన వినాయకుడి చిత్రం కళాప్రియుల మనసులను దోచుకుంటున్నాయి. ఈ సందర్భంగా ‘నాయక పోడ’ గిరిజనులు తమ నృత్యంతో అలరించారు. ఈ ప్రదర్శన ఈ నెల 21 వరకూ కొనసాగనుంది. - సాక్షి, సిటీప్లస్