మైదానంలా మేడారం!
తగ్గిపోతున్న అటవీ సంపద
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు
హరితహారంలోనూ దక్కని ప్రాధాన్యం
మాటలకే గిరిజన మ్యూజియం పరిమితం
హన్మకొండ : ఒకప్పుడు మేడారం జాతర అంటే కంకవనాలతో కూడిన దట్టమైన అడవి గుండా ప్రయాణం చేయాల్సి వచ్చేది. గడిచిన దశాబ్దకాలంగా భక్తుల సంఖ్య పెరగడం.. అందుకనుగుణంగా ఏర్పాట్ల కారణంగా అటవీ విస్తీర్ణం తగ్గిపోరుుంది. వన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం పరిసర ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం పెంచడంలో జిల్లా అధికారుల శ్రద్ధ చూపకపోవడమే ఇందుకు కారణం. మేడారం జాతర-2012 సందర్భంగా అప్పటి జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఇక్కడి అటవీ సంపదను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే జాతర నాటికి మేడారం పరిసర ప్రాంతాల్లో రెండు లక్షల మొక్కలను పెంచుతామన్నారు. కానీ... గత జాతర సందర్భంగా ఈ విషయాన్ని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమంలో మేడా రం యాక్షన్ ప్లాన్‌కు చోటు దక్కలేదు. మరోవైపు ఇక్కడ నిర్మిస్తామని చెప్పిన గిరిజన మ్యూజియం నాలుగేళ్లుగా ప్రకటనలకే పరిమితమైంది.తాడ్వాయి, పస్రా అటవీశాఖ రెంజ్‌ల కిందికి మేడారం అటవీ ప్రాంతం వస్తుంది. తాడ్వాయి రేంజ్‌లో బొడగూడ బీట్ పరిధిలో 3,360 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది.
దీని పరిధిలోకి సమ్మక్క, సారలమ్మ గద్దెలు, ఆర్టీసీ బస్‌స్టాండ్, పోలీస్ అవుట్ పోస్టు, చిలకలగుట్ట తదితర ప్రాంతాలు వస్తాయి. జంపన్నవాగు, కన్నెపల్లి, ఊరట్టం, నార్లపూర్, కాల్వపల్లి ప్రాంతాలు పస్రా అటవీశాఖ రేంజ్‌లో నార్లాపూర్ బీట్ కిందకి వస్తాయి. దీని పరిధిలో 3,330 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. మెత్తంగా మేడారం చుట్టు పక్కల 6,630 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంటే... దీనిలో 2,500 హెక్టార్ల అటవీ ప్రాంతంలో భక్తులు విడిది చేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో భక్తుల వసతికి పందిళ్లు, వంట చెరుకు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, దుకాణాలు, షెడ్లు, రోడ్లు తదితర అవసరాలకు నేరుగా అడవులపై ఆధారపడుతున్నారు. ఫలితంగా చెట్లను నరకడం పెరిగింది. దీంతో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. అటవీశాఖ లెక్కల ప్రకారమే మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో 200 హెక్టార్ల అటవీ ప్రాంతం పూర్తి మైదానంగా మారింది. అటవీ విస్తీర్ణం పెంచడంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే మేడారం వనజాతర కాస్త మేడారం-మైదాన జాతరగా మారిపోయే ప్రమాదం ఉంది. మరో ఆర్నెళ్లలో మేడారం జాతర వస్తున్న సందర్భంగా జాతర విశిష్టతలు, ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జాతరకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే కంకవనాల విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
సంస్కృతి ప్రధానంగా మ్యూజియం
గిరిజనుల సంస్కృతి సంప్రదాయలు, ఆహారపు అలవాట్లు, వేషభాషలు ప్రతిబింబించేలా మేడారంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతో కాలం నుంచి ఉంది. అయితే మేడారం జాతర-2012 సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మేడారంలో గిరిజన మ్యూజియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2014లో వచ్చే జాతర కల్లా మేడారంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు అందుబాటులోకి వస్తుందన్నారు. మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నట్లు అప్పటి జిల్లా మంత్రి పొన్నాల లక్ష్మయ్య పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ.. 2014 జాతర సమయంలో టెండర్ల ప్రక్రియ జరుగుతోందంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత ఈ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకప్పటితో పోల్చితే మేడారం జాతరకు ఏడాది పొడవునా భక్తులు వస్తున్నారు. ఆదివారం, సెలవు దినాల్లో వనదేవతలను దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య వందల్లో ఉంటోంది. ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులకు మేడారం జాతర విశిష్టతలు, గిరిజన సంప్రదాయాలు తెలుసుకునేందుకు వీలుగా గిరిజన మ్యూజియాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది.