
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయం సాధించింది. జిల్లా పరిషత్ స్థానాల్లో 99%, మండల పరిషత్ స్థానా ల్లో 90% సీట్లు సంపాదించి తనకు తిరుగులేదని రుజువు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, పార్లమెంటు ఎన్నికల్లో గానీ ఓట్లు వేసింది ఈ ఓటర్లే. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గుర్తు ప్రాధాన్యం వహించినా, పార్టీలకు అతీతంగా అభ్యర్థి మంచితనం, బలం, పనివిధానం కూడా లెక్కలోకి వస్తాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నా నూటికి తొంభై శాతంపైగా వైసీపీ మీద నమ్మకంతోనే ఓటు వేసినట్టు స్పష్టం. ఇది జగన్ రెండు సంవత్సరాల పైచిలుకు పాలనకు మెజారిటీ ప్రజలు తెలిపిన ఆమోద ముద్ర.
దశాబ్దాలుగా తమ సమస్యలకు పరిష్కారం లభించాలని ఆశిస్తున్న సామాన్య ప్రజలకు జగన్ పాలన అభయహస్తం ఇచ్చిందనే చెప్పవచ్చు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ మీద క్రమంగా వ్యతిరేకత పెరుగుతుంది. ఉపఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రభుత్వంపై సానుకూలత, ప్రతిపక్షంపై వ్యతిరేకత పెరుగుతోంది. బహుళ ప్రజల అనుకూల వైఖరి వల్ల జగన్ ప్రజల హృదయాలను గెలువగలిగారు.
ప్రతిపక్షం పేరుతో చంద్రబాబునాయుడు చేయిస్తున్న అభివృద్ధి నిరోధక ఉద్యమాలు, ఉత్తుత్తి పోరాటాలను ప్రజలు నమ్మడం లేదు. అంతేకాకుండా తెలుగుదేశం పాలనలో ఐదేండ్లూ ఆంధ్రప్రజలు ఏ మార్పునూ చూడకుండా శుష్క వాగ్దానాలను మాత్రమే అనుభవించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోకుండా ప్రజల చిరకాల వాంఛయైన ఇంగ్లిష్ మాధ్యమాన్ని వ్యతిరేకించడం, అభివృద్ధి వికేంద్రీకరణకు తావిచ్చే బహుళ రాజధానులను వ్యతిరేకించే పేరుతో ప్రతీఘాత ఉద్యమాలను చేయడం తప్ప నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖరరెడ్డి గెలిచినప్పుడూ, రెండేళ్ళ క్రితం జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పడూ ఒకే తీరు మాటలన్నారు చంద్రబాబు. తనను ఓడించిన తెలుగు ప్రజలు పశ్చాత్తాప పడాలి అన్నారు. అలా తన వైఫల్యాలను తెలుసుకోకుండా ప్రజలను తప్పు పడుతున్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీని అవసాన దశకు తీసుకొచ్చారు.
వైసీపీకి పడుతున్న ఓట్లు ప్రతిపక్షాలు బలంగా లేకపోవడం వల్ల వస్తున్నవి కాదు. జగన్ గత రెండేళ్లుగా చేస్తున్న పనుల వల్ల అనుకూలంగా పడుతున్న ఓట్లు. ఏ ప్రాపంచిక దృక్పథమూ, అభివృద్ధి నమూనా లేకుండా అధికార పార్టీ వైఫల్యాలతో మాత్రమే గెలవాలనుకునే పార్టీలకు జగన్ గెలుపు చక్కని గుణపాఠం. పాజిటివ్, పర్మనెంట్ ఓటుబ్యాంకును పెంచుకోవడానికి జగన్ అవలంభిస్తున్న విద్య, వైద్య, ఉద్యోగ, వ్యవసాయిక విధానాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
నవరత్నాలు, అమ్మఒడి, జగనన్న దీవెన, ఆరోగ్యశ్రీ, గ్రామ వలంటీర్ల వ్యవస్థ, పార్టీ మార్పిడులను ప్రోత్సహించక పోవడం లాంటి అనేక అంశాలతో విలువలతో కూడిన రాజకీయాలకు తెరలేపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఆధునిక వసతులు సమకూర్చడం, పూర్తి స్టాఫ్‌ను ఇవ్వడం, దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్–19ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి పేదల పాలిట పెన్నిధి పాలకుడిగా జగన్ వార్తల్లోకి ఎక్కారు. రెండేళ్ల స్వల్ప కాలంలోనే గణనీయమైన మార్పులు తెచ్చి ప్రజల హృదయాల్లో స్థానాన్ని స్థిరం చేసుకుంటున్నారు. తనది వాగ్దాన, వాగాడంబర ప్రభుత్వం కాదు; ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని నిరూపిస్తున్నారు కాబట్టే ప్రజల మెప్పు పొందుతున్నారు. బద్వేల్ ఉపఎన్నికలోనూ జగన్ పాలన వైసీపీకి ఘన విజయాన్ని చేకూర్చుతుందన్నది వాస్తవం.
డా.కాలువ మల్లయ్య
వ్యాసకర్త కథా, నవలా రచయిత.
మొబైల్: 91829 18567
Comments
Please login to add a commentAdd a comment