అమరావతి: ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కేసులతో ఎన్నికల రద్దుకోసం ప్రయత్నం చేశాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫలితాల తీరు చూస్తుంటే గతంలో వచ్చిన ఫలితాల కంటే అత్యధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం అయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతోందన్నారు.
ఈ ఫలితాలే సీఎం వైఎస్ జగన్ పాలనకు నిదర్శనమని తెలిపారు. కాగా, తాము ఎన్నికలను బహిష్కరించాం అంటున్న నేతలకు సిగ్గుందా.. అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేసింది. కానీ, ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే తెలిసి పారిపోయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు టీడీపీ వైపు ఎందుకుంటారు? ఆయా వర్గాలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలకు తగినట్టుగా ఫలితాలు వచ్చాయని అన్నారు. ప్రజలంతా వైఎస్ జగన్‌ను గుండెల్లో పెట్టుకుని తీర్పునిస్తున్నారని అన్నారు.
కొందరు నాయకులు హైదరాబాద్‌లో ఉంటేనే మంచిదని.. ఇక్కడ అడుగుపెడితే కుట్రలు చేస్తారని మండిపడ్డారు. మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని కుట్ర చేయాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. మున్సిపాలిటీ, పంచాయతీ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ తిరుగులేని మెజారిటీ సాధించిందని చెప్పారు. చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయని టీడీపీ నేత అచ్చెన్న మాట్లాడుతున్నాడు.. అసలు ఆయా చోట్ల ఆ పార్టీకి ఒక్కరు కూడా నామినేషన్ వేయడానికి దిక్కులేదని ఎద్దేవా చేశారు. ఫలితాలను చూసి చంద్రబాబు అయ్యన్నతో మాట్లాడిస్తున్నట్టుందని మండిపడ్డారు. తమకు చేతకాదా? తాము తిట్టలేమా? కానీ తమకు సంస్కారం ఉందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
చదవండి: బాబు ఇలాకాలో ఫ్యాన్ హవా
Comments
Please login to add a commentAdd a comment