తండ్రి బాటలో తనయుడు | Kaluva Mallaiah Article On AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

తండ్రి బాటలో తనయుడు

Published Wed, Dec 18 2019 12:28 AM | Last Updated on Wed, Dec 18 2019 12:28 AM

Kaluva Mallaiah Article On AP CM YS Jagan - Sakshi

తెలుగు రాష్ట్రాలను స్వాతంత్య్రానంతరం 14 మంది సీఎంలుగా పాలించారు. వీరిలో అత్యుత్తమ పాలన అందించిన సీఎంగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డినే పేర్కొనక తప్పదు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో, వాగ్దానాలను నెరవేర్చడంలో వైఎస్సార్‌దే ప్రథమస్థానం. తెలుగు రాష్ట్రాల్లో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో వైఎస్సార్‌దే అగ్రస్థానం. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తన ప్రాంతీయతను, గ్రామీణతను, దేశీయతను వదిలి నేల విడిచి సాము చేస్తున్నవేళ.. సుదీర్ఘ పాదయాత్రను చేశారు వైఎస్సార్‌. అనంతరం 2004 ఎన్నికల్లో అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టిన వైఎస్సార్‌ అంతవరకు విస్మరణకు గురైన అన్ని రంగాలపై దృష్టి కేంద్రీకరించారు. 

ఉమ్మడి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను వ్యవసాయక్షేత్రాలుగా మార్చడానికి అనేక నీటి పారుదల ప్రాజెక్టులను ప్రారంభించారు. పనికి ఉపాధి పథకం ద్వారా గ్రామీణ పేదలకు ఏడాదికి రెండువందల పై చిలుకు రోజులకు ఆదాయ గ్యారంటీనిచ్చారు. పావలా వడ్డీకి రుణాలిచ్చి రైతులను, వృద్ధాప్య పెన్షన్‌తో వృద్ధులను ఆదుకున్నారు. తెలంగాణలో ప్రతి జిల్లాకు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఏటా డీఎస్సీ పెట్టి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. ఆరోగ్యశ్రీ, 108 సౌకర్యం ద్వారా పేదల ముంగిట్లోకి కార్పొరేట్‌ వైద్యం అందేట్టు చేశారు. ఈ పథకం ద్వారా లక్షలాది ప్రాణాలు నిలబడ్డాయి.ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థుల, రైతుల ఆత్మహత్యలు, ఫ్యాక్షనిజం హత్యలు వైఎస్సార్‌ తీసుకున్న సాహసోపేత చర్యల వల్లనే తగ్గుముఖం పట్టాయి. విద్యా, వైద్య, వ్యవసాయరంగాలలో ఆయన చేసిన సంస్కరణలు, తీసుకున్న చర్యలు అగ్రశ్రేణి నాయకుడిగా నిలబెట్టాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి జన హృదయాలను గెలుచుకున్న వైఎస్సార్‌ అకాల మరణం ప్రజల్ని దుఃఖసాగరంలో ముంచింది. తండ్రి బాటను మరింత విశాలం చేస్తూ వైఎస్‌ జగన్‌ తొమ్మిదేళ్లు మడమతిప్పని పోరాటం చేసి విజయుడయ్యారు.

ఎన్ని కష్టాలొచ్చినా ఒంట రిగానే ఎదుర్కొని రాజకీయ పోరాటం చేశారు. వేల కిలోమీటర్ల పాదయాత్రనూ చేశారు. ఆచరణీయమైన మేనిఫెస్టోతో ఎన్నికల బరిలోకి దిగారు. తాను గెలవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరిం చారు. ఘనవిజయం సాధించాడు. ఈ ఐదారు నెలలుగా జగన్‌ ఏపీ సీఎంగా చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు తన తండ్రి వైఎస్సార్‌ ఆశయాలను మరింత విశాలం చేస్తున్నాయి. గ్రామ వాలంటీర్లను నియమించడం, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయడంతో పాటు ఉద్యోగ కల్పనకు పాల్పడటం వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజోపయోగ పనుల్లో ముఖ్యమైనవి. ఏపీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్య కోసం మెజారిటీ బహుజనులు కోరుకుంటున్న ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేత చర్యల్లో ముఖ్యమైనవి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ, ఆరోగ్యశ్రీలాంటి అద్భుత పథకాలను అందరికీ వర్తింపజేయడంలోనూ, నవరత్నాలను ప్రోత్సహించడంలోనూ జగన్‌ ప్రభుత్వం చూపుతున్న చొరవ అద్వితీయం.

కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఒక సంవత్సరం, కనీసం ఆరు నెలల కాలమైనా ఇవ్వకుండా, వేచిచూడకుండా ప్రభుత్వం ఏర్పడిన తెల్లవారి నుంచే పసలేని విమర్శలు చేస్తూ తాము పలుచబడుతూ వైఎస్‌ జగన్‌ మరింత బలపడటానికి తోడ్పడుతున్నాయి ప్రతిపక్షాలు. ఏదేమైనా తండ్రి బాటను సువిశాలంచేస్తూ, బహుజనులకు అండదండగా ఉంటూ తెలుగుజాతి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని సమున్నతంగా నిలబెడుతున్న యువకిశోరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 


డా. కాలువ మల్లయ్య
వ్యాసకర్త ప్రముఖ సామాజిక రచయిత  మొబైల్‌ : 91829 18567 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement