కాలువ మల్లయ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గత 9 నెలలుగా రాష్ట్రాభివృద్ధి కోసం సాహసోపేతమైన చర్యలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, శాసన మండలి రద్దు, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం, బహుళ రాజధానుల ఏర్పాటు లాంటివన్నీ దమ్మున్న చర్యలు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేవే. అధికారంలో ఉన్న పార్టీ ఏది చేసినా దాన్ని వ్యతిరేకించి తీరాలన్న ధ్యేయంతో తెలుగుదేశం పార్టీ, ఏపీ శాసన మండలి రద్దుతోపాటు బహుళ రాజధానులనూ వ్యతిరేకిస్తోంది. అందరి ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ చర్యను వ్యతిరేకిస్తూ తమ బాధను అందరి బాధగా చిత్రిస్తూ నానా యాగీ చేస్తున్నారు. ప్రధానమైన అసెంబ్లీ భవనాలు ఇతరాలు అన్నీ అమరావతిలో ఉంటాయని ప్రభుత్వం చెబుతున్నప్పుడు ప్రభుత్వ విభాగాలు అన్నీ ఒకే చోట ఉండాలనడం స్వార్థం కదా? ఓ బలమైన సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ఆ సమస్యతో సంబంధం లేని చిన్న రైతులను, బహుజనులనూ వాడుకోవడం సరైందేనా? ఇప్పటికే చాలా రంగాల్లో అభివృద్ధి చెందిన వర్గం ప్రబలంగా ఉన్న ఈ ప్రాంతంలోనే రాజధాని మొత్తంగా ఉండాలనడం ఏం న్యాయం?
రాజధాని వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి మూడు ప్రాంతాల బహుజన వర్గాలు బాగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో విశాఖపట్నం, కర్నూలు నగరాలు కూడా మహానగరాలుగా అభివృద్ధి చెంది ఏపీ మూడు మహానగరాలున్న రాష్ట్రంగా అభివృద్ధిని, పేరు ప్రఖ్యాతులను సాధిస్తుంది. ఉత్తరాంధ్రలో ఆదివాసీల జనాభా ఎక్కువ. బహుజన కులాల వెనుకబాటు తనమూ ఉంది. రాయలసీమలోనూ అదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ రాజధానులను ఏర్పరచడం ద్వారా కచ్చితంగా వీటికి ప్రాధాన్యత పెరుగుతుంది. సినిమా పరిశ్రమకు అనువైన స్థలం వైజాగ్. రాజధాని ఇక్కడుంటే భవిష్యత్తులో ఇక్కడికి సినిమా పరిశ్రమ రావడం వల్ల వేలాది మంది లబ్ధి పొందుతారు. క్రమక్రమంగా ఉత్తరాంధ్ర సర్వతోముఖాభివృద్ధి చెందే అవకాశముంది. అలాగే ప్రకృతి శాపంతో నీట కరువు, అనేక చారిత్రక కారణాల వల్ల ఫ్యాక్షనిజం లాంటి వాటితో వెనుకబడున్న రాయలసీమ కూడా న్యాయ రాజధాని కర్నూలుకు రావడంవల్ల అభివృద్ధి చెందుతుంది. న్యాయంగా తనకు రావాల్సిన నిధులు, నీళ్ళు, విద్యాలయాలు, పరిశ్రమలు పొంది ఉపాధి అవకాశాలు మెరుగవడం వల్ల.. రాళ్ళ సీమగా మారిన ‘రాయల సీమ’ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది. ఇక్కడి బహుజనులు వివిధ అవకాశాలు పొంది అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తారు.
తెలుగు రాష్ట్రాలనేలిన పాలకులందరికంటే కూడా మేలయిన రీతిలో బహుజనుల కోసం అనేక పనులు చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి బహుళ రాజధానులను ఏర్పర్చడం ఆంధ్రప్రదేశ్ సమతుల, సర్వతోముఖాభివృద్ధి కోసమే. ఏపీ ప్రజలకు ఒక్క మహానగరమే కావాలో, మూడు మహానగరాలు కావాలో, 29 గ్రామాల బాగోగులే కావాలో, 5 కోట్ల మంది అభివృద్ధి కావాలో, పిడికెడు మంది బిలియనీర్లు కావాలో, కోట్లమంది బహుజనులు మధ్య తరగతికైనా ఎదగాలో ఆలోచించండి. జగత్ ప్రసిద్ధ రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మాణం కానట్లే.. విశాఖపట్టణమైనా, అమరావతైనా, కర్నూలైనా మహానగరాలుగా అభివృద్ధి చెందడానికి ఒకటి, రెండు దశాబ్దాల కాలమైనా పడుతుంది. సత్సంకల్పంతో, బహుజనాభివృద్ధి ధ్యేయంగా ఈ పనిని ఆరంభిం చిన వైఎస్ జగన్‌కు చేయూతనివ్వండి. కాలుపట్టి వెనుకకు లాగితే అది అతిపెద్ద చారిత్రక తప్పిదమే అవుతుంది.
వ్యాసకర్త: డా. కాలువ మల్లయ్య, ప్రముఖ సామాజిక విశ్లేషకులు, మొబైల్ : 91829 18567
Comments
Please login to add a commentAdd a comment