సాధారణంగా పాదయాత్రలు, ఉద్యమాలు ఓ పవిత్రమైన, ప్రజోపయోగకరమైన పనులు కోసం చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లుగా నిరసన యాత్రలు, ఉపవాస యాత్రల పేరు మీద జరుగుతున్న ఉద్యమాలు అర్థం లేనివి. ఆ మధ్య అమరావతి రాజధానిగా ఉండాలని 900 రోజుల ‘దండుగ పండుగ’ను చూస్తే అభివృద్ధి నిరోధక ఉద్యమాలు కూడా ఉంటాయన్న విషయం అతి సామాన్యడికి కూడా అర్థమైంది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులతోపాటు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు, మరి కొందరు ఇతరులూ హాజరయ్యారు. సీపీఐ నారాయణ, రామకృష్ణలతో పాటు సీపీఎం నాయకులు, చుక్కా రామయ్య, నాగేశ్వర్, కోదండరాం లాంటి వాళ్ళంతా హాజరై అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలనడం హాస్యాస్పదంగా ఉంది.
ఇంతకీ అమరావతిలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎందుకుండాలి? రాష్ట్ర సమతుల్య అభివృద్ధి కోసం, మూడు ప్రాంతాల మధ్య సహోదర భావం నెలకొల్పడానికి, భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండటానికి మూడు రాజధానులు ఏర్పరిస్తే నష్టమేంటి? దీన్నెందుకు వ్యతిరేకించాలి? ఏదో మునిగిపోతున్నట్టు ఏండ్ల తరబడి నిరసనలు, అభివృద్ధి నిరోధక ఉద్యమాలు ఎందుకు? ఇలాంటి ప్రతీఘాత ఉద్యమాల నెన్నింటినో ఎదుర్కొని జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తున్నారు. ఈ ఉద్యమం వల్ల రాజధానుల నిర్మాణం మరింత ఆలస్యమవ్వడం తప్ప వేరే ప్రయోజనం లేదు. స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఆంధ్ర ప్రజలు రాజధాని లేనివారిగా మిగిలారు. వారు తమకు రాజధాని నిర్మాణం త్వరగా కావాలని కోరుకోవాలి కానీ నిర్మాణాన్ని అడ్డుకునే ఉద్యమాలు చేయడం సరైనదేనా? ఇంతకీ అమరావతితో పాటు మరో రెండు చోట్ల రాష్ట్ర రాజధాని ఉండటం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది?
అమరావతి ప్రాంతం చుట్టూ ఉన్న పాత కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఓ బలమైన సామాజిక వర్గం రాజకీయంగానూ, ఆర్థికంగానూ మొదటి నుంచి ఈ పెత్తనం సాగిస్తోంది. ఆ పెత్తనానికి భంగం కలుగుతుందన్న అపోహ ఈ ఉద్యమానికి ఒక కారణం. అలాగే అక్కడి భూములతో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే అవకాశం పోతుందన్న కొందరి అక్కసూ దీని వెనుక ఉంది. నిజానికి ఆ ప్రాంత సామాన్య రైతుకు ఏ నష్టమూ లేదు. రాజధాని కొరకు సేకరించిన భూములను అవసరం ఉన్న మేరకు ఉంచుకొని మిగతావి వారికి అప్పజెప్పవచ్చు. లేదా ఆ భూములకు ఒప్పందం ప్రకారం తగిన ధర కట్టి ఇవ్వవచ్చు కదా! ఇక అభ్యంతరమేంటి? ఈ ఉద్యమాన్ని విరమించుకొని మూడు రాజధానుల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటివాటిల్లో ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటే అందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఇలా చేస్తే ఆ సామాజిక వర్గంతో పాటు ఆ యాపార్టీలకు కొంతైనా పరువు దక్కుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో బలంగానూ, తెలంగాణలో నామ మాత్రంగానూ జరుగుతున్న మరో అభివృద్ధి నిరోధక ఉద్యమం తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడితే తెలుగు మృత భాష అవుతుందట! ఇదేం వాదమో అర్థం కాదు. ఇంగ్లీషు మీడియం అయినా... ఒక సబ్జెక్టుగా తెలుగు ఉంటుందని ప్రభుత్వాలు చెబుతున్నా ఆ మాటను పట్టించుకోవడం లేదు వీరు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలంతా గ్రామీణ పేద బహుజన కులాలవారు. వాళ్లు కార్పొరేట్ ఫీజులను భరించలేక ప్రభుత్వ విద్యాలయాల్లో ఇంగ్లీష్ మాధ్యమం కోరుకుంటున్నారు. (క్లిక్: పవన్ కల్యాణ్.. ఉండాలంటాడా? పోవాలంటాడా?)
70 శాతం విద్యార్థులు తెలుగసలే లేకుండా కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదువుతుంటే తెలుగు మృతభాష కాదా! కనీసం ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉంటుందనీ, మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్‌ను ఏర్పాటు చేసి అక్కడికి ప్రతి గ్రామం నుంచి పిల్లలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామనీ ఏపీ ప్రభుత్వం చెబుతూనే ఉంది. నిజంగా తెలుగు మీడియం మాత్రమే చదవాలనుకునేవారు ఆ పాఠశాలల్లో చదువుకోవచ్చు. అయినా ఈ విషయాలనేమీ పట్టించుకోకుండా గుడ్డిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను వ్యతిరేకించడం సరి కాదు. (చదవండి: ‘రాజనీతి’లో రేపటి చూపు!)
- డాక్టర్ కాలువ మల్లయ్య
ప్రముఖ సాహితీవేత్త
Comments
Please login to add a commentAdd a comment