international oil rates
-
తీవ్ర ఒడిదుడుకుల్లో చమురు మార్కెట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అవి స్థిరపడ్డాకే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఈ విషయం గురించి ఎటువంటి చర్చలూ జరపలేదని చెప్పారు. ముడి చమురు రేట్లు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించే అవకాశాలపై స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయంగా రెండు ప్రాంతాల్లో (రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–పాలస్తీనా) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని సవాళ్లేమైనా తలెత్తినా .. లేదా ఆటంకాలేమైనా ఎదురైనా దాని ప్రభావాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. కానీ అలాంటిదేమీ జరగకూడదని కోరుకుందాం. తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న పరిస్థితుల్లో ఇంధన లభ్యత, అందుబాటు ధరలో అది అందేలా చూడటం ప్రాథమిక బాధ్యత. జాగ్రత్తగా దీన్నుంచి బైటపడే ప్రయత్నం చేస్తున్నాం‘ అని పురి వివరించారు. మరోవైపు, చమురు దిగుమతులకు సంబంధించి రష్యాకు చెల్లింపుల విషయంలో ఎలాంటి సమస్యా లేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. -
ఉత్పత్తి కోతలతో చమురు ధరలకు సెగ
ప్యారిస్: చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్‌ప్లస్ .. ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించడం వల్ల ప్రపంచ ఎకానమీకి రిస్కులు పొంచి ఉన్నాయని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అధిక స్థాయుల్లో ఉన్న ఇంధన ధరలు.. దీని వల్ల మరింతగా ఎగిసే అవకాశం ఉందని, భారత్ వంటి దేశాలకు చమురు దిగుమతుల భారం భారీగా పెరిగిపోవచ్చని తెలిపింది. సరఫరా తగ్గిపోయే అవకాశాలు ఉన్నందున 2023 ద్వితీయార్ధంలో అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్లలో కొరత నెలకొనవచ్చని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతిహ్ బిరోల్ పేర్కొన్నారు. ‘ప్రపంచ ఎకానమీ ఇంకా బలహీనంగానే ఉండటంతో పాటు పలు వర్ధమాన దేశాలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో చమురు ఉత్పత్తి కోతల నిర్ణయం వల్ల అంతర్జాతీయ ఎకానమీకి రిస్కులు ఎదురవుతాయని భావిస్తున్నాను‘ అని ఆయన తెలిపారు. ఇన్వెస్టర్ల సమావేశాల కోసం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్‌తో సమావేశం అనంతరం బిరోల్ ఈ విషయాలు వివరించారు. భారత ఎకానమీ పటిష్టంగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత బలంగా మారగలదని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని బిరోల్ చెప్పారు. మరోవైపు, ఉక్రెయిన్ మీద యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షల ప్రభావం గురించి మాట్లాడుతూ ఆ దేశ ఆదాయాలను తగ్గించాలన్న లక్ష్యం సాకారమైందని తెలిపారు. చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే, వినియోగించుకునే దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్ 85 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో ఆయిల్ దిగుమతులపై 118 బిలియన్ డాలర్లు వెచ్చించింది. -
బంకుల్లో విదేశీ పాగా!!
దేశీయంగా ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజ ఆయిల్ కంపెనీలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయి. ఇంధన రిటైలింగ్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పోటీపడుతున్నాయి. ఫ్రాన్స్‌కి చెందిన టోటల్ ఎస్ఏ కొన్నాళ్ల క్రితమే గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్‌తో జట్టు కట్టింది. దేశవ్యాప్తంగా 1,500 పైచిలుకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఔట్లెట్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి (యూఏఈ) చెందిన అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఆడ్‌నాక్) కూడా భారత మార్కెట్లో ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉంది. మరోవైపు బ్రిటన్‌కు చెందిన దిగ్గజం బీపీ.. భారత్‌లో 3,500 పైచిలుకు రిటైల్ ఔట్లెట్స్ ప్రారంభించేందుకు ఇప్పటికే లైసెన్సులు దక్కించుకుంది. అటు రష్యాకి చెందిన రాస్‌నెఫ్ట్ సంస్థ.. ఎస్సార్ ఆయిల్ కొనుగోలు ద్వారా దేశీ మార్కెట్లోకి ప్రవేశించింది. నయారా ఎనర్జీ పేరిట రిటైల్ మార్కెట్లో కార్యకలాపాలు విస్తరిస్తోంది. భారీ మార్కెట్.. విదేశీ దిగ్గజాలు ఇలా భారత ఇంధన రిటైల్ మార్కెట్‌వైపు రావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గత పదేళ్లలో భారత్‌లో పెట్రోల్ అమ్మకాలు 153 శాతం పెరిగాయి. డీజిల్ విక్రయాలు 70 శాతం ఎగిశాయి. ఇక సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విధానాలను సరళతరం చేయడంతో టోటల్ వంటి విదేశీ దిగ్గజాలు కూడా పోటీపడేందుకు వీలవుతోంది. ప్రస్తుతం భారత్‌లో ఏటా పెట్రోల్ వినియోగం 90 బిలియన్ లీటర్లుగా ఉండగా.. ఇది 2030 నాటికి 150 బిలియన్ లీటర్లకు చేరగలదని అంచనా. అలాగే 30 బిలియన్ లీటర్లుగా ఉన్న డీజిల్ వినియోగం 50 బిలియన్ లీటర్లకు చేరవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ దిగ్గజాలు ఉవ్విళ్లూరుతున్నాయి. విస్తరణ బాటలో ప్రభుత్వ రంగ సంస్థలు.. ఇక ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు (ఓఎంసీ) కూడా కార్యకలాపాలు గణనీయంగా విస్తరిస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) కొత్తగా 78,493 సైట్స్‌లో రిటైల్ ఔట్‌లెట్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఇటీవలే బిడ్లను ఆహ్వానించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 64,214 ఔట్లెట్స్ ఉన్నాయి. తాజాగా ఆఫర్ చేస్తున్న ప్రాంతాల్లో 95 శాతం సైట్స్‌కి 4,00,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త ఔట్లెట్స్ కూడా ప్రారంభమైతే వచ్చే రెండు మూడేళ్లలో ఓఎంసీల చేతిలో ఉన్న ఔట్లెట్స్ సంఖ్య ఏకంగా రెట్టింపు కానుంది. ఫిబ్రవరి 21న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి సరిగ్గా కొద్ది రోజుల ముందర 2,579 సైట్స్‌లో బిడ్డర్లకు ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఎల్వోఐ) జారీ చేసింది. అలాగే మరో 31,800 సైట్స్‌కి బిడ్డర్లను ఖరారు చేసినందున వారికి కూడా ఎల్‌వోఐలు జారీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నుంచి అనుమతులు తీసుకోవాల్సిందిగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఓఎంసీలు లేఖ రాశాయి. విధానాల్లో అనిశ్చితి.. దేశీ ఆయిల్ రిటైలింగ్ వ్యాపారానికి సంబంధించి విధానాల్లో అనిశ్చితికి తాజాగా ఓఎంసీల కార్యకలాపాల విస్తరణ నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. 2002 ఏప్రిల్‌లో నిబంధనలను సరళతరం చేయడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్ ఆయిల్, షెల్ వంటి ప్రైవేట్ సంస్థలు తొలిసారిగా ఇంధన రిటైల్ విభాగంలోకి ప్రవేశించాయి. 2005–06 నాటికి ప్రైవేట్ సంస్థలు చెప్పుకోతగ్గ స్థాయిలో 17 శాతం మార్కెట్ వాటాను సాధించుకోగలిగాయి. అయితే, 2006లో అంతర్జాతీయంగా చమురు రేట్లు గణనీయంగా పెరగడంతో .. దేశీయంగా ధరలపై నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. ఓ వైపున అసలు ధర కన్నా తక్కువకి విక్రయించే ఓఎంసీలకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుండగా.. మరోవైపు ఆ వెసులుబాటు లేని ప్రైవేట్ రంగ సంస్థలు ఓఎంసీలను దీటుగా ఎదుర్కొనలేని పరిస్థితి ఏర్పడింది. 2009–10 నాటికి ప్రైవేట్ సంస్థల మార్కెట్ వాటా మరీ దిగజారీ 1 శాతం కన్నా తక్కువకి పడిపోయింది. అయితే, ప్రస్తుతం మార్కెట్ ఆధారిత ధరల విధానాలు అమల్లోకి వచ్చిన దరిమిలా.. అన్ని సంస్థలకు సమాన అవకాశాలు లభించగలవని ప్రైవేట్ చమురు రిటైల్ కంపెనీలు ఆశిస్తున్నాయి. ఓఎంసీల గుత్తాధిపత్యం.. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ ప్రకారం దేశీయంగా 90 శాతం ఇంధన రిటైల్ ఔట్లెట్స్ ఓఎంసీల చేతుల్లోనే ఉన్నాయి. మిగతావి ప్రైవేట్ రంగంలోని నయారా, రిలయన్స్ ఇండస్ట్రీస్, షెల్ మొదలైన సంస్థలకు చెందినవి. నయారా త్వరలో 2,000–3,000 ఔట్లెట్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా, ఇంకో 2,000 దాకా ఔట్లెట్స్ ఏర్పాటు కోసం బీపీ, రిలయన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇవన్నీ ఏర్పాటైనా కూడా ఓఎంసీల ఔట్‌లెట్స్‌తో పోలిస్తే తక్కువే ఉండనున్నాయి. పోగొట్టుకున్న మార్కెట్ వాటాను మరోసారి దక్కించుకునేందుకు ప్రైవేట్ సంస్థలకు ఇప్పుడిప్పుడే అవకాశం లభిస్తుండగా.. ఇప్పటికే గుత్తాధిపత్యం ఉన్న ఓఎంసీలు భారీగా విస్తరిస్తే అవి మళ్లీ వెనకబడిపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. వినూత్న ప్రయోగాలు.. మారే మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లుగా ఇంధన రిటైలింగ్ స్వరూపం కూడా మారుతోంది. కొంగొత్త మార్కెటింగ్ విధానాలు తెరపైకి వస్తున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో హైపర్మార్కెట్లలో కూడా ఇంధనాలను విక్రయిస్తున్నారు. ఈ తరహా విధానాలను భారత్‌లో తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇంధన రిటైల్‌లోకి ప్రవేశించాలంటే కంపెనీలు దేశీ మార్కెట్లో ఇన్ఫ్రాపై కనీసం 2,000 కోట్లైనా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది. అంతకు సమానమైన బ్యాంక్ గ్యారంటీలైనా ఇవ్వాలి. ఇలాంటి నిబంధనలను కిరీట్ పారిఖ్ కమిటీ సవరించవచ్చని భావిస్తున్నారు. -
తగ్గిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: వాహన వినియోగదారులకు శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పతనమవడంతోపాటు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ కాస్త పెరగడంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 2.41 చొప్పున, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.25 చొప్పున ధరలను తగ్గించాయి. వివిధ రాష్ట్రాల్లోని స్థానిక పన్నులు లేదా వ్యాట్‌లో తేడాల కారణంగా ఈ ధరల్లో వ్యత్యాసం ఉండనుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుక్రవారం ప్రకటించింది. సవరించిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరలు మరో 10-15 పైసలు తగ్గాల్సినప్పటికీ పెట్రోల్‌పంప్ డీలర్లకు చెల్లించే కమీషన్‌ను చమురు సంస్థలు ఆ మేరకు పెంచింది. ధరల తాజా తగ్గింపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 66.65 నుంచి రూ. 64.25కి చేరుకుంది. హైదరాబాద్‌లో రూ. 72.83 నుంచి రూ. 70.42కు తగ్గింది. డీజిల్ హైదరాబాద్‌లో రూ. 60.60 నుంచి రూ. 58.35కు చేరుకుంది. ఆగస్టు నుంచి పెట్రోల్ ధరలు తగ్గడం ఇది ఆరోసారి కాగా డీజిల్ ధరలు అక్టోబర్‌లో తగ్గడం రెండోసారి. మొత్తంమీద ఆగస్టు నుంచి పెట్రోల్ ధర లీటర్‌కు దాదాపు రూ. 9.36 చొప్పున తగ్గింది. పెట్రోల్ ధరల తరహాలోనే డీజిల్ ధరలపైనా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 18న నియంత్రణను ఎత్తేసి మార్కెట్ ధరకు అనుగుణంగా డీజిల్‌ను విక్రయించుకునేందుకు చమురు సంస్థలకు స్వేచ్ఛనివ్వడం తెలిసిందే. దీంతో ఐదేళ్ల వ్యవధిలో తొలిసారిగా అక్టోబర్ 18న డీజిల్ ధరను లీటర్‌కు రూ. 3.37 చొప్పున చమురు సంస్థలు తగ్గించాయి. మరోవైపు సబ్సిడీయేతర (ఏడాదికి 12 సిలిండర్ల కోటా దాటాక వినియోగదారులు కొనుగోలు చేసేవి) వంట గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ. 18.50 తగ్గించాయి. దీంతో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 865కి చేరింది. ఆగస్టు నుంచి సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గడం ఇది నాలుగోసారి. కాగా, ఢిల్లీలో సీఎన్జీ ధరను మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కేజీకి రూ. 4.50 చొప్పున పెంచింది. అలాగే డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) ధరను ఎస్సీఎంకు రూ. 2.49 పెంచింది. దీంతో సీఎన్జీ ధర రూ. 43.45కి పెరగగా పీఎన్జీ ధర రూ. 26.58కి పెరిగింది. కాగా, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ఘనత కేంద్రంలోని మోదీ సర్కారుదేనని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్ ధరను ఆరుసార్లు, డీజిల్ ధరను రెండుసార్లు తగ్గించామన్నారు.