బంకుల్లో విదేశీ పాగా!!  | All international oil companies are looking towards India | Sakshi
Sakshi News home page

బంకుల్లో విదేశీ పాగా!! 

Published Fri, Mar 22 2019 11:51 PM | Last Updated on Sat, Mar 23 2019 12:01 AM

All international oil companies are looking towards India - Sakshi

దేశీయంగా ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజ ఆయిల్‌ కంపెనీలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయి. ఇంధన రిటైలింగ్‌ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పోటీపడుతున్నాయి. ఫ్రాన్స్‌కి చెందిన టోటల్‌ ఎస్‌ఏ కొన్నాళ్ల క్రితమే గౌతమ్‌ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్‌తో జట్టు కట్టింది. దేశవ్యాప్తంగా 1,500 పైచిలుకు కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) ఔట్‌లెట్స్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి (యూఏఈ) చెందిన అబుధాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ఆడ్‌నాక్‌) కూడా భారత మార్కెట్లో ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉంది. మరోవైపు బ్రిటన్‌కు చెందిన  దిగ్గజం బీపీ.. భారత్‌లో 3,500 పైచిలుకు రిటైల్‌ ఔట్‌లెట్స్‌ ప్రారంభించేందుకు ఇప్పటికే లైసెన్సులు దక్కించుకుంది. అటు రష్యాకి చెందిన రాస్‌నెఫ్ట్‌ సంస్థ.. ఎస్సార్‌ ఆయిల్‌ కొనుగోలు ద్వారా దేశీ మార్కెట్లోకి ప్రవేశించింది. నయారా ఎనర్జీ పేరిట రిటైల్‌ మార్కెట్లో కార్యకలాపాలు విస్తరిస్తోంది. 

భారీ మార్కెట్‌..
విదేశీ దిగ్గజాలు ఇలా భారత ఇంధన రిటైల్‌ మార్కెట్‌వైపు రావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గత పదేళ్లలో భారత్‌లో పెట్రోల్‌ అమ్మకాలు 153 శాతం పెరిగాయి. డీజిల్‌ విక్రయాలు 70 శాతం ఎగిశాయి. ఇక సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ విధానాలను సరళతరం చేయడంతో టోటల్‌ వంటి విదేశీ దిగ్గజాలు కూడా పోటీపడేందుకు వీలవుతోంది. ప్రస్తుతం భారత్‌లో ఏటా పెట్రోల్‌ వినియోగం 90 బిలియన్‌ లీటర్లుగా ఉండగా.. ఇది 2030 నాటికి 150 బిలియన్‌ లీటర్లకు చేరగలదని అంచనా. అలాగే 30 బిలియన్‌ లీటర్లుగా ఉన్న డీజిల్‌ వినియోగం 50 బిలియన్‌ లీటర్లకు చేరవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ దిగ్గజాలు ఉవ్విళ్లూరుతున్నాయి.

విస్తరణ బాటలో ప్రభుత్వ రంగ సంస్థలు..
ఇక ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ దిగ్గజాలు (ఓఎంసీ) కూడా కార్యకలాపాలు గణనీయంగా విస్తరిస్తున్నాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) కొత్తగా 78,493 సైట్స్‌లో రిటైల్‌ ఔట్‌లెట్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఇటీవలే బిడ్లను ఆహ్వానించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 64,214 ఔట్‌లెట్స్‌ ఉన్నాయి. తాజాగా ఆఫర్‌ చేస్తున్న ప్రాంతాల్లో 95 శాతం సైట్స్‌కి 4,00,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త ఔట్‌లెట్స్‌ కూడా ప్రారంభమైతే వచ్చే రెండు మూడేళ్లలో ఓఎంసీల చేతిలో ఉన్న ఔట్‌లెట్స్‌ సంఖ్య ఏకంగా రెట్టింపు కానుంది.  ఫిబ్రవరి 21న ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి సరిగ్గా కొద్ది రోజుల ముందర 2,579 సైట్స్‌లో బిడ్డర్లకు ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఎల్‌వోఐ) జారీ చేసింది. అలాగే మరో 31,800 సైట్స్‌కి బిడ్డర్లను ఖరారు చేసినందున వారికి కూడా ఎల్‌వోఐలు జారీ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతులు తీసుకోవాల్సిందిగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు
ఓఎంసీలు లేఖ రాశాయి. 

విధానాల్లో అనిశ్చితి..
దేశీ ఆయిల్‌ రిటైలింగ్‌ వ్యాపారానికి సంబంధించి విధానాల్లో అనిశ్చితికి తాజాగా ఓఎంసీల కార్యకలాపాల విస్తరణ నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. 2002 ఏప్రిల్‌లో నిబంధనలను సరళతరం చేయడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎస్సార్‌ ఆయిల్, షెల్‌ వంటి ప్రైవేట్‌ సంస్థలు తొలిసారిగా ఇంధన రిటైల్‌ విభాగంలోకి ప్రవేశించాయి. 2005–06 నాటికి ప్రైవేట్‌ సంస్థలు చెప్పుకోతగ్గ స్థాయిలో 17 శాతం మార్కెట్‌ వాటాను సాధించుకోగలిగాయి. అయితే, 2006లో అంతర్జాతీయంగా చమురు రేట్లు గణనీయంగా పెరగడంతో .. దేశీయంగా ధరలపై నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. ఓ వైపున అసలు ధర కన్నా తక్కువకి విక్రయించే ఓఎంసీలకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుండగా.. మరోవైపు ఆ వెసులుబాటు లేని ప్రైవేట్‌ రంగ సంస్థలు ఓఎంసీలను దీటుగా ఎదుర్కొనలేని పరిస్థితి ఏర్పడింది. 2009–10 నాటికి ప్రైవేట్‌ సంస్థల మార్కెట్‌ వాటా మరీ దిగజారీ 1 శాతం కన్నా తక్కువకి పడిపోయింది. అయితే, ప్రస్తుతం మార్కెట్‌ ఆధారిత ధరల విధానాలు అమల్లోకి వచ్చిన దరిమిలా.. అన్ని సంస్థలకు సమాన అవకాశాలు లభించగలవని ప్రైవేట్‌ చమురు రిటైల్‌ కంపెనీలు ఆశిస్తున్నాయి. 

ఓఎంసీల గుత్తాధిపత్యం..
పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలిసిస్‌ సెల్‌ ప్రకారం దేశీయంగా 90 శాతం ఇంధన రిటైల్‌ ఔట్‌లెట్స్‌ ఓఎంసీల చేతుల్లోనే ఉన్నాయి. మిగతావి ప్రైవేట్‌ రంగంలోని నయారా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, షెల్‌ మొదలైన సంస్థలకు చెందినవి. నయారా త్వరలో 2,000–3,000 ఔట్‌లెట్స్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా, ఇంకో 2,000 దాకా ఔట్‌లెట్స్‌ ఏర్పాటు కోసం బీపీ, రిలయన్స్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇవన్నీ ఏర్పాటైనా కూడా ఓఎంసీల ఔట్‌లెట్స్‌తో పోలిస్తే తక్కువే ఉండనున్నాయి. పోగొట్టుకున్న మార్కెట్‌ వాటాను మరోసారి దక్కించుకునేందుకు ప్రైవేట్‌ సంస్థలకు ఇప్పుడిప్పుడే అవకాశం లభిస్తుండగా.. ఇప్పటికే గుత్తాధిపత్యం ఉన్న ఓఎంసీలు భారీగా విస్తరిస్తే అవి మళ్లీ వెనకబడిపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 

వినూత్న ప్రయోగాలు..
మారే మార్కెట్‌ పరిస్థితులకు తగ్గట్లుగా ఇంధన రిటైలింగ్‌ స్వరూపం కూడా మారుతోంది. కొంగొత్త మార్కెటింగ్‌ విధానాలు తెరపైకి వస్తున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో హైపర్‌మార్కెట్లలో కూడా ఇంధనాలను విక్రయిస్తున్నారు. ఈ తరహా విధానాలను భారత్‌లో తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇంధన రిటైల్‌లోకి ప్రవేశించాలంటే కంపెనీలు దేశీ మార్కెట్‌లో ఇన్‌ఫ్రాపై కనీసం 2,000 కోట్లైనా ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటోంది. అంతకు సమానమైన బ్యాంక్‌ గ్యారంటీలైనా ఇవ్వాలి. ఇలాంటి నిబంధనలను కిరీట్‌ పారిఖ్‌ కమిటీ సవరించవచ్చని భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement