‘గాల్వన్’ ఉద్రిక్తతల దరిమిలా భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్‌పై నిషేధం విధించింది. క్రమంగా చైనా వస్తువులను సైతం నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌లో తమ వస్తువులకు అడ్రస్ గల్లంతయిపోతే, చైనా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం తప్పదు. ఒకరకంగా ఇది భారత ప్రభుత్వం చైనాపై చేస్తున్న ‘విసర్జికల్ స్ట్రైక్’గా చెప్పుకోవచ్చు.
సరి‘హద్దు’ మీరిన చైనా సైనికుల దాడిలో కల్నల్ సంతోష్‌బాబు సహా ఇరవై మంది భారత సైనికుల మృతి ఉభయ దేశాల నడుమ ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా చైనాపై వ్యతిరేకత చెలరేగింది. చైనా వస్తువులను తగులబెట్టి కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే భారత ప్రభుత్వం దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేవిగా ఉన్నాయంటూ చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. నిషేధానికి గురైన యాప్స్‌లో పెద్దసంఖ్యలో యూజర్లు ఉన్న ‘టిక్‌టాక్’తో పాటు చాలామంది తరచుగా ఉపయోగించే ‘హెలో’, ‘షేర్ ఇట్’, ‘యూసీ బ్రౌజర్’, ‘యూ వీడియో’ వంటివి కూడా ఉన్నాయి. మన దేశంలో చైనా ప్రమేయం యాప్స్, మొబైల్‌ఫోన్ల వరకు మాత్రమే పరిమితం కాదు. వివిధ రంగాల్లో చైనా మన మార్కెట్‌ను ముంచెత్తుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో మన ఆర్థికరంగం నుంచి చైనా ప్రమేయాన్ని పూర్తిగా తొలగించి ‘ఆత్మనిర్భరత’ సాధించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మన దేశంలోని పలు కీలక రంగాల్లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఆటోమొబైల్, ఖనిజ లోహాలు, విద్యుత్తు, భవన నిర్మాణ, సేవా రంగాల్లో చైనా పెట్టుబడులు గణనీయమైన స్థాయిలోనే ఉన్నాయి. గడచిన ఐదేళ్ల వ్యవధిలోనే భారత్‌లో చైనా పెట్టుబడులు ఐదురెట్లు పెరిగాయి. చైనా పెట్టుబడులు 2014లో 1.60 బిలియన్ డాలర్లు (రూ.11,973 కోట్లు) ఉంటే, 2019 నాటికి 8 బిలియన్ డాలర్లకు (రూ.59,867 కోట్లు) చేరాయి. చైనా కంపెనీలు కొన్ని మన దేశంలో పనిచేస్తున్నాయి. గడచిన కొన్నేళ్లుగా చైనా వస్తువులు దేశం నలుమూలలకూ పాకాయి. మన దేశంలో చాలామంది ఉపయోగించే మొబైల్ ఫోన్లలో చైనాకు చెందినవే ఎక్కువ. చైనాతో మన దేశానికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. వాటిని ఇప్పటికిప్పుడు రద్దు చేసుకునే పరిస్థితులైతే కనిపించడం లేదు. కొన్ని కీలక రంగాల్లో చైనా పెట్టుబడులు ఏ మేరకు ఉన్నాయంటే...
భారత్–చైనా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 2001 నాటికి 3.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.27 వేల కోట్లు) మాత్రమే అయితే, 2019 నాటికి ఈ విలువ 90 బిలయన్ డాలర్లకు (సుమారు రూ.6.74 లక్షల కోట్లు) పెరిగింది. ఇన్నాళ్లూ భారత్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతూ వచ్చింది. అయితే, సరిహద్దు ఉద్రిక్తతల దరిమిలా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న చైనా కంపెనీలకు భారీస్థాయి ఆర్థికనష్టం తప్పకపోవచ్చు. చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై భారీగా సుంకాలను విధించేందుకు భారత ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందుకోసం కేంద్ర వాణిజ్యశాఖ చైనా దిగుమతి వస్తువుల జాబితాను సిద్ధం చేస్తోంది.
దేశవ్యాప్తంగా పలు వాణిజ్య, వర్తక సంఘాలు కూడా ‘బాయ్‌కాట్ చైనా’ నినాదాన్ని ప్రచారం చేస్తున్నాయి. కొన్నిచోట్ల వర్తక సంఘాలు తమ మార్కెట్లలో చైనా వస్తువులను అమ్మబోమంటూ కూడా ప్రకటించాయి. చైనా వస్తువుల బహిష్కరణ నిర్ణయాన్ని కట్టుదిట్టంగా అమలు చేయగలిగితే దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వస్తువూ దేశంలోనే తయారు కావాలనే భావన ప్రజల్లో ఎక్కువగా ఉన్నా, ఆచరణలో అది సాధ్యమయ్యే అవకాశాలు తక్కువేనని ప్రముఖ ఆర్థికవేత్త యోగేంద్ర కపూర్ అభిప్రాయపడుతున్నారు. చైనా నుంచి మన దేశానికి ప్రధాన దిగుమతులు ఇప్పటికి ఏ స్థాయిలో ఉన్నాయంటే...
నిషేధానికి దారితీసిన పరిణామాలు
‘టిక్‌టాక్’ సహా 59 చైనా యాప్స్‌కు సంబంధించి కంటెంట్ వివాదం పాతదే అయినా, వీటి నిషేధానికి కంటెంట్ ప్రధాన కారణం కాదు. ఇవి దేశభద్రతకు కలిగించే అవకాశాలు ఉన్నాయనే కారణంతోనే భారత ప్రభుత్వం వీటిని నిషేధించింది. అమెరికా, ఆస్ట్రేలియా కూడా భారత్ బాటలోనే చైనా యాప్స్‌పై నిషేధం విధించే అంశంపై కసరత్తులు ప్రారంభించాయి. చైనా యాప్స్‌కు భారత్‌లో కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. యాప్స్‌ను అందిస్తున్న సంస్థల్లో చాలావాటికి భారత్‌లో కార్యాలయాలు ఉన్నాయి. వీటి సర్వర్లు మాత్రం చైనాలో ఉన్నాయి. ఇవి ఇక్కడి నుంచి కోట్లాది మంది భారతీయుల వ్యక్తిగత వివరాలను చైనా సర్వర్లకు చేరవేస్తున్నాయనేదే వీటిపై ప్రధాన అభియోగం. పౌరులకు సంబంధించిన గోప్యమైన వివరాలను దేశం వెలుపలకు పంపడం దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగకరమనే కారణంతోనే భారత ప్రభుత్వం వీటిని నిషేధించింది. గాల్వన్ లోయలో చైనా సైనికుల చొరబాటుకు ముందే, ఈ ఏడాది ఏప్రిల్ 20లోనే ప్రభుత్వం ‘ఈ యాప్స్ ద్వారా చైనా మీ వ్యక్తిగత వివరాలపై కన్నేసి ఉంటుంది’ అని ప్రజలను హెచ్చరించింది. దీనికితోడు సరిహద్దుల వద్ద కూడా చైనా ఆగడాలు శ్రుతి మించడంతో ప్రభుత్వం ఈ యాప్స్‌పై వేటు వేసింది.
చైనా వస్తుబహిష్కరణపై భిన్నస్వరాలు
గాల్వన్ లోయ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో చైనాపై ఆగ్రహావేశాలు చెలరేగాయి. ఆర్థికశక్తిగా అగ్రస్థానానికి ఎదగాలనే చైనా ఆకాంక్షలను ఆర్థికంగానే దెబ్బతీయాలని కొన్ని వాణిజ్య, వర్తక సంస్థలు అభిప్రాయపడ్డాయి. ప్రభుత్వం కూడా ఈ దిశగానే చర్యలకు సమాయత్తమవుతోంది. అయితే, చైనా వస్తువులను నియంత్రించడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. చైనాకు చెందిన వస్తువులేవీ భవిష్యత్తులో ఉపయోగించరాదంటూ ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం సూచించింది. అయితే, వ్యూహాత్మక అంశాలను కార్పొరేట్ నిర్ణయాలతో కలపకుండా ఉంటేనే బాగుంటుందని టెలికం కంపెనీల సంస్థ ‘సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (సీఓఏఐ) ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే, చైనా వస్తువులను ఇప్పటికిప్పుడే బహిష్కరించడం సాధ్యమయ్యే పరిస్థితులు లేవని లార్సన్ అండ్ టర్బో సీఈవో ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఎలాంటి దుందుడుకు నిర్ణయం తీసుకున్నా, తలెత్తబోయే ప్రమాదాలను ఊహించవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దిశగా నిర్ణయం తీసుకునే ముందు సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా బేరీజు వేసుకోవాలని సూచించారు.
‘భారత్‌లో చైనా కంపెనీలు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నాయి. చాలా అంశాల్లో చైనా వస్తువులు నాణ్యమైనవే కాకుండా, తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. చైనాతో మనకు వ్యాపార సమతుల్యత కూడా ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, చైనా వస్తువులను బహిష్కరించడం సాధ్యం కాదు. అలా కాకుండా, దీర్ఘకాలిక దృష్టితో చైనాను శత్రు దేశంగా పరిగణిస్తున్నట్లయితే, మన విధానాలను అందుకు అనుగుణంగా మార్చుకుని, అమలులోకి తేవాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది’ అని సుబ్రహ్మణ్యన్ అన్నారు. ఒకవైపు సుబ్రహ్మణ్యన్ ప్రకటనపై చర్చ సాగుతుండగా, మరోవైపు మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సీ భార్గవ కూడా ఈ అంశంపై గళం విప్పారు. ‘చైనా నుంచి వచ్చే వస్తువులను నిషేధించడం వల్ల దేశంలో వస్తువుల ధరలు పెరుగుతాయి. అంత నాణ్యమైన వస్తువులు అంత తక్కువ ధరకు భారత్‌లో అందుబాటులో లేవు. ఎంతోకాలంగా దిగుమతులపై ఆధారపడ్డ కంపెనీలకు ఇది లాభదాయకం కాదు.
అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. దీనివల్ల కంపెనీల వ్యయం ఇదివరకటి కంటే బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వస్తువులను దిగుమతి చేసుకోవడం మినహా కంపెనీలకు మరో మార్గం లేదు’ అని ఆయన అన్నారు. మరోవైపు, చైనా వస్తువులపై అకస్మాత్తుగా నిషేధం విధిస్తే, అంతిమంగా జనాలపైనే ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, చైనా దిగుమతుల నిషేధానికి వీలుగా ప్రభుత్వం ఎయిర్ కండిషనర్, టీవీల్లో విడి భాగాలు సహా పది పన్నెండు రకాల ఉత్పత్తులపై లైసెన్సింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు సమాయత్తమవుతోందంటూ కథనాలు వస్తున్నాయి. చైనా యాప్స్‌తో మొదలైన నిషేధపర్వం ఇంకెంత దూరం పోతుందో, పర్యవసానాలు ఎలా ఉంటాయోననే అంశంపై పారిశ్రామిక వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
చర్చ అంతా టిక్‌టాక్ పైనే..
టిక్‌టాక్‌ను కలుపుకొని మొత్తం 59 చైనా యాప్స్‌పై ప్రభుత్వం నిషేధం విధించినా, ప్రధానమైన చర్చ టిక్‌టాక్‌పైనే జరుగుతోంది. మారుమూల అనామకంగా ఉన్న చాలామంది ఔత్సాహికులకు తమ నటనా పాటవాన్ని చాటుకునే వేదికగా నిలిచింది ‘టిక్‌టాక్’. ఇలాంటి ఔత్సాహికుల్లో కొందరు ‘టిక్‌టాక్’ ద్వారానే పాపులారిటీ సాధించారు. వీడియో షేరింగ్ యాప్ అయిన ‘టిక్‌టాక్’ స్వల్పకాలంలోనే చాలామందికి వదులుకోలేని వ్యసనంలా మారింది. ప్రభుత్వం ‘టిక్‌టాక్’ను నిషేధించడంతో ఇలాంటి వాళ్ల కలల మేడలు ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లయింది. ‘టిక్‌టాక్’ మైకంలో పడి కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకున్న సంఘటనలు, ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా తరచుగా వార్తలకెక్కాయి. టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత ఇదే తరహాకు చెందిన స్వదేశీ వీడియో షేరింగ్ యాప్స్‌కు గిరాకీ పెరిగింది. ‘చింగారీ’, ‘లిట్‌లాట్’, ‘మిత్రోం’, ‘బోలో ఇండియా’ వంటి యాప్స్‌కు డౌన్‌లోడ్లు బాగా పెరిగాయి. ‘యూజర్ జెనరేటెడ్ కంటెంట్’ (యూజీసీ) షేర్ చేసుకోవడానికి ఉపయోగపడే యాప్స్‌లో ‘టిక్‌టాక్’ ఒక సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. నిషేధానికి గురైన మిగిలిన చైనా యాప్స్‌కు కూడా స్వదేశీ ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ పరిస్థితుల్లో యూజీసీ యాప్స్ నడుపుతున్న సంస్థల నిర్వాహకుల్లో ‘టిక్‌టాక్’ నిషేధం వరమా? శాపమా? అనే చర్చ మొదలైంది. యూజీసీ యాప్స్‌కు పాపులారిటీ పెరుగుతున్న నేపథ్యంలో వీటి ద్వారా వ్యాప్తి చెందుతున్న కంటెంట్ నాణ్యత, నైతికత, భాషా సాంస్కృతిక విలువలపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అశ్లీలత, అసభ్యకరమైన భాష వీటి ద్వారా వ్యాప్తి చెందడమే కాకుండా, వీటి వలలో చిక్కుకుని కుర్రకారు దారితప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా విరివిగా అందుబాటులోకి వచ్చిన పలు సామాజిక మాధ్యమాలు యూజర్లు తమదైన కంటెంట్‌ను ఇతరులతో తేలికగా పంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కోట్లాది మంది యూజర్లు తమ కంటెంట్‌ను క్షణాల్లోనే ప్రపంచానికి చేరవేయగలుగుతున్నారు. కొందరు కంటెంట్‌ను సృష్టించడంలో వైవిధ్యాన్ని, సృజనాత్మకతను చూపుతుంటే, అక్కడక్కడా కొందరు వీటి ద్వారా తమ మనోవికారాలన్నింటినీ బయటపెట్టుకుంటున్నారు.
ఇతరుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను, అశ్లీలమైన చేష్టలు, అసభ్యమైన మాటలతో కూడిన వీడియోలను ప్రసారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యూజర్లు జనాలకు చేరవేసే కంటెంట్‌పై కట్టుదిట్టమైన పరిశీలన, నియంత్రణ తప్పనిసరిగా ఉండాలని, కంటెంట్ షేరింగ్‌కు అవకాశం కల్పిస్తున్న సంస్థలే ఈ బాధ్యతను జాగరూకతతో నిర్వర్తించాల్సి ఉంటుందని ‘మామ్స్‌ప్రెస్సో’ సీఈవో విశాల్ గుప్తా చెబుతున్నారు. ‘మామ్స్‌ప్రెస్సో’ మహిళల కోసం రూపొందిన ఆన్‌లైన్ యూజీసీ వేదిక. ఇది పది భాషల్లో పనిచేస్తోంది. దీనికి యూజర్ల నుంచి వచ్చే కంటెంట్‌లో ప్రతి పీస్‌ను తమ సిబ్బంది నిరంతరాయంగా పరిశీలిస్తూనే ఉంటారని, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండే కంటెంట్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటారని విశాల్ తెలిపారు. సామాజిక మాధ్యమాలను నిర్వహించే సంస్థలు యూజర్ల కంటెంట్‌పై జాగ్రత్తలు తీసుకోక తప్పదని, భారత్ వంటి దేశంలో సాంస్కృతిక విలువలు, వివిధ వర్గాల ప్రజల మనోభావాలు వంటి సున్నితమైన అంశాలపై మరింత అప్రమత్తంగా ఉండటం అవసరమని సిలికాన్ వ్యాలీకి చెందిన వీడియో షేరింగ్ యాప్ ‘ఫైర్‌వర్క్’ సీఈవో సునీల్ నయ్యర్ అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment