వాషింగ్టన్ : భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయ చెలరేగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా చైనా ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలన్న భారత వ్యూహాన్ని ఆ దేశానికి చెందిన 59 మొబైల్ యాప్స్ నిషేధం ద్వారా అమలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్‌పై సైతం భారత ప్రభుత్వం నిషేధం విధించింది. మోదీ సర్కార్ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలోనూ ‘బ్యాన్ టిక్‌టాక్’ అనే నినాదం ఊపందుకుంది. మొబైల్ యాప్స్ ద్వారా పౌరుల సమాచారాన్ని చైనా తస్కరిస్తోందని, దీంతో దేశ సమగ్రతకు, యాజర్స్ వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని పలువురు అమెరికన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (టిక్‌టాక్ బ్యాన్: చైనాకు ఎంత నష్టమో తెలుసా?)
భారత ప్రభుత్వం నిషేధం విధించిన విధంగానే యూఎస్‌లోనూ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్ మాట్లాడుతూ.. టిక్‌టాక్ బ్యాన్ అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలించాలని అన్నారు. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిక్‌టాక్‌లో ఏదైనా పోస్ట్ చేస్తే ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో నాలుగు కోట్లకు పైగా టిక్‌టాక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. ఇక భారత ప్రభుత్వ నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో కూడా సమర్థించారు. అంతకుముందే ఈ చర్యను ఐక్యరాజ్యసమితి మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ సైతం అభినందించారు. ఆమెతో పాటు రిపబ్లిక్ పార్టీకి చెందిన ఓ సెనేటర్ సైతం స్వాగతించారు. చైనా యాప్‌ను నిషేధించాలన్న డిమాండ్‌ను అమెరికా అధ్యక్షుడి వాణిజ్య వ్యవహారాల సలహాదారు పీటర్ నవరో కూడా సమర్థించడం గమనార్హం. దీంతో ‘బ్యాక్ టిక్‌టాక్’ నినాదం అగ్రరాజ్యంలో మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. (చైనాకు షాకిచ్చిన భారత్)
ఇక కరోనా వైరస్ పెట్టిన చిచ్చుతో చైనా విషయంలో ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్‌పై మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో చైనాకు సంబంధించి ట్రంప్ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భారత్‌లో టిక్‌టాక్‌తో పాటు మరికొన్ని యాప్స్ నిషేధంతో చైనా కంపెనీలకు దాదాపు రూ. 45000 కోట్లుకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు ఆ దేశ పత్రిక గ్లోబల్ టైమ్స్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే యాప్‌లపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని భారత ప్రభుత్వం వెనక్క తీసుకోవాలని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీ సర్కార్ వెనక్కి తగ్గే అవకాశం ఏ కోశానా లేదు.
Comments
Please login to add a commentAdd a comment