న్యూఢిల్లీ: గల్వన్ వ్యాలీలో ఈ నెల 15న జరిగిన ఘర్షణల నేపథ్యంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా చైనా చొరబాట్ల విషయంలో బీజేపీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత సోమవారం వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనాతో జరిగిన ఘర్షణల గురించి.. యథాతథ స్థితికి సంబంధించి వాస్తవాలను కప్పిపుచ్చడం కోసం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘తప్పుడు సమాచారం, దారి మళ్లించడం, పరధ్యానం’ అనే క్రూరమైన విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (చైనా సరిహద్దుల్లో భారత్ బలగాల ప్రదర్శన)
రణ్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. ‘జూన్ 15 నాటి సంఘటనకు సంబంధించి అసలు వాస్తవం ఏంటంటే.. చైనా గల్వాన్ వ్యాలీతో సహా పీపీ-14లో కూడా తీవ్రమైన అతిక్రమణలకు పాల్పడింది. దారుణం ఏంటంటే చైనా పీపీ-14ను తిరిగి స్వాధీనం చేసుకోవడమే కాక అక్కడ పెద్ద సంఖ్యలో గుడారాలు ఇతర నిర్మాణాలు చేపట్టింది’ అన్నారు. అంతేకాక ‘పాంగోంగ్ త్సో సరస్సు ప్రాంతంలో ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య భుభాగంలోకి కూడా చైనా దళాలు చొచ్చుకురావడమే కాక అక్కడ భారీ సంఖ్యలో శత్రు నిర్మాణాలు, బంకర్లను నిర్మించాయని తెలిపారు. చైనీస్ చొరబాటు చర్యలు డెప్సాంగ్ మైదానం వరకు విస్తరించాయి’ అన్నారు. ఎల్‌ఏసీ మీదుగా వై-జంక్షన్ వరకు 18 కిలోమీటర్ల మన భూభాగం (ఈ ప్రాంతాన్నే బాటిల్‌నెక్ అంటారు) వరకు చైనా చొరబాట్లు విస్తరించాయని రణ్‌దీప్ సింగ్ అన్నారు. (డ్రాగన్‌కు చెక్ : రంగంలోకి అమెరికా బలగాలు)
లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనాతో ఇటీవల జరిగిన ఘర్షణలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ రోజువారీ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. చైనా, భారత్ దళాల మధ్య హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలు సోషల్ మీడియాలో ‘#SpeakUpForOurJawans’ పేరుతో ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment