బీజింగ్ : గల్వాన్ లోయలో భారత్, చైనాకు మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమైన సంఘటన అని భారత్‌లో చైనా రాయబారి సన్ వెడాంగ్ అన్నారు. ఇదే సమయంలో ఇరుదేశాల మధ్య దైపాక్షిక సంబంధాలకు భంగం కలిగించకుండా రెండు దేశాలు ముందుకు సాగాలని తెలిపారు. శాంతియుత ఒప్పందాలతో విభేదాలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు. 'చైనా భారత్‌ను ఒక ప్రత్యర్థిగా కాకుండా భాగస్వామిగా చూస్తుంది. సంప్రదింపుల ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు చెక్ పెట్టి తిరిగి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాలి. శాంతియుతంగా చర్చలు జరిపి ఇరు దేశాల మద్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలి. (గల్వాన్‌పై చైనాకు హక్కు లేదు: భారత్)
ఏ దేశమూ ప్రపంచం నుంచి వేరు చేయబడదు. సొంతంగా అభివృద్దిని మాత్రమే కోరుకుంటుంది. స్వావలంబనకు కట్టుబడి ఉండటమే కాకుండా ప్రపంచీకరణ ధోరణికి అనుగుణంగా అడుగులు వేయాలి. భారత్, చైనా ఆర్థికంగా బలమైన దేశాలు. చాలా సంవత్సరాలుగా భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా కొనసాగుతుంది. దక్షిణ ఆసియాలో భారత్ కూడా చైనాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక ఒప్పందాలు అయస్కాంతాల వలె ఉండాలని నేను భావిస్తున్నాను' అని ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఇరు దేశాల్లో పురాతన నాగరికతకు సంబంధించి అపారమైన పరిజ్ఞానం ఉందని, చర్చల ద్వారా పరిస్థితులను చక్కదిద్దుకుందామని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. అయితే గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో గత మూడు నెలలుగా ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. (భారత్, చైనా శాంతి మంత్రం)
Comments
Please login to add a commentAdd a comment