ఢిల్లీలో 1.45 లక్షల చైనా సీసీటీవీ కెమెరాలు | Delhi 1 Lakh Forty Thousand Chinese CCTV Cameras Sparks Row | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో దేశ భద్రత: ప్రతిపక్షాలు

Published Thu, Jul 2 2020 9:11 AM | Last Updated on Thu, Jul 2 2020 4:58 PM

Delhi 1 Lakh Forty Thousand Chinese CCTV Cameras Sparks Row - Sakshi

న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన 1.45 లక్షల సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఈ సీసీటీవీ కెమెరాలు చైనాకు చెందినవి కావడంతో విమర్శలు వస్తున్నాయి. గల్వాన్‌ వ్యాలీ ఘర్షణ తర్వాత చైనా వస్తువుల పట్ల దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను బ్యాన్‌ చేసింది. అయితే ఎన్నికల హామీల్లో భాగంగా ఢిల్లీ వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం కేజ్రీవాల్‌ ప్రభుత్వం చైనాకు చెందిన హిక్విజన్‌ కంపెనీ నుంచి వీటిని కొనుగోలు చేసింది. సీసీటీవీ కెమెరాల వల్ల నష్టం లేదు కానీ జనాలు లైవ్‌ ఫీడ్‌ను చూడటం కోసం ఈ కంపెనీ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దీనివల్ల పెద్ద నిఘా ప్రమాదం వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ దీనిపై స్పందిసస్తూ.. కేజ్రీవాల్‌ ప్రభుత్వ తక్షణమే తప్పు దిద్దుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. కానీ కేజ్రీవాల్‌ ప్రభుత్వం మాత్రం ఇదంతా రాజకీయం అంటూ కొట్టిపారేసింది.

నిపుణుల ఆందోళన
‘సీసీటీవీ కెమెరాల వల్ల ఎలాంటి ముప్పు లేదు. కానీ ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో లైవ్ ఫీడ్ చూడటానికి హిక్‌ విజన్ ఐవీఎమ్‌ఎస్‌-4500 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. దాని వల్ల తీవ్రమైన నిఘా ముప్పు ఏర్పడుతుంది’ అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అనుజ్ అగర్వాల్ తెలిపారు. అంతేకాక ‘ఈ యాప్‌ను చైనాకు చెందిన కంపెనీ అధికారి, అక్కడి ప్రభుత్వం, చైనా ఆర్మీ సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఢిల్లీ రోడ్లపై ఏమి జరుగుతుందో వారు చూడగలరు. ఈ కెమెరాలకు ఇటువంటి చొరబాట్లను నిరోధించడానికి అవసరమైన ఎలాంటి భద్రతా లక్షణాలు లేవు. అవి చాలా హాని కలిగిస్తాయి’ అన్నారు. (చైనా ట్విట్టర్‌’ అకౌంట్‌ మూసేసిన ప్రధాని )

సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ మాట్లాడుతూ.. ‘వివిధ కార్పొరేట్ కంపెనీలు‌, ప్రభుత్వ ప్రాంగణాల్లో హిక్విజన్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో లైవ్‌ ఫీడ్‌ పొందడంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ ఫీడ్‌ని మనతో పాటు చైనా, ఆ దేశం సైన్యం కూడా యాక్సెస్‌ చేయగలదు. అది ఆందోళన కలిగించే అంశం. దీనివల్ల దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది’ అన్నారు. 

హిక్విజన్‌పై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు
హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సాధనాలను ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో నిఘా సంస్థలలో ఒకటైన హిక్విజన్ నుంచి ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తులను కొనుగోలు చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిషేధించారు. ఇటీవలి నివేదికల ప్రకారం హిక్విజన్, 19 ఇతర సంస్థలు చైనా మిలిటరీకి చెందినవి లేదా నియంత్రించబడుతున్నట్లు వెల్లడయ్యింది. ఈ కారణంగా హిక్విజన్‌ సంస్థను కొన్ని యూరోపియన్ దేశాలలో కూడా నిషేధించారు. ఢిల్లీలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మార్కెట్ భాగీరథి ప్యాలెస్‌ ఈ చైనా కెమెరాలతో నిండి ఉంది. దీని గురించి సదరు దుకాణ యజమాని మాట్లాడుతూ.. ‘ఈ సీసీటీవీలు ఒక్కొక్క దాని ధర రూ .1,200 నుంచి 3,500 రూపాయల వరకు ఉంటుంది. అందుకే ప్రభుత్వం వీటి కొనుగోలుకు ఆసక్తి చూపింది. కానీ చైనా వస్తువులను బహిష్కరించి దేశీ వస్తువులను వినియోగించేలా ప్రోత్సాహిస్తే బాగుంటుంది’ అన్నారు.

ప్రాజెక్ట్ ఎలా ప్రారంభించబడింది
ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఢిల్లీ అంతటా నివాస, వాణిజ్య సముదాయాలలో 1.5లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని భావించింది. వీటిని కొనుగోలు డిస్పెన్సేషన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యూడీ)ని ఆదేశించింది. 571 కోట్ల రూపాయల ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పోలీస్ స్టేషన్లు, కోర్టు ప్రాంగణాలు, మార్కెట్లు, ఇతర సున్నితమైన ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాక 'నిగేబాన్' అనే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా నగరమంతా మరో 2.45 లక్షల సీసీటీవీలు ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం భావిస్తోంది. 2018లో ఈ 1.45లక్షల సీసీటీవీ కెమెరాల ప్రాజెక్ట్‌కు సంబంధించిన టెండర్‌ను హిక్విజన్‌ గెలుచుకుంది.(టిక్‌టాక్‌ బ్యాన్‌ను స్వాగతించిన అమెరికా)

ప్రతిపక్షాల వ్యతిరేకత
హిక్‌ విజన్‌ సీసీటీవీ కెమెరాలను తొలగించడమే కాకుండా యాప్‌ను బ్యాన్‌ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ‘హిక్‌ విజన్‌ స్వరర్‌ కూడా చైనాలో ఉంది.ఈ కెమెరాల ఫీడ్‌, డాటా ఆధారంగా చైనా మన దేశ రాజధానిలోని ప్రతి ప్రదేశాన్ని చూడగలుగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్‌ను బెల్ ‌(బీఈఎల్‌) కు ఇచ్చినట్లు చెప్తోంది. కానీ చైనాలో తయారు చేసిన కెమరాలను వాడుతుంది. దీనికి ఆప్‌ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేసింది. అలానే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ గత ఏడాదిలోనే వ్యతిరేకత తెలిపింది. కేజ్రీవాల్‌ ప్రభుత్వం హిక్విజన్‌కు కాంట్రాక్ట్‌ ఇవ్వడం ద్వారా జాతీయ భద్రతను ప్రమాదంలో పెట్టిందని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కేజ్రీవాల్‌ ప్రభుత్వం కొట్టి పారేసింది. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement