![Army Chief MM Naravane Warning To China On Army Day - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/16/NARAVANE.jpg.webp?itok=-DFffD6q)
న్యూఢిల్లీ: భారత్ ఓపికను పరీక్షించే సాహసం చేయవద్దని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె శత్రు దేశాలను హెచ్చరించారు. ఉత్తర సరిహద్దులో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే కుట్రను సమర్ధవంతంగా తిప్పికొట్టామని వ్యాఖ్యానించారు. లద్దాఖ్ లో చైనాతో ఉద్రిక్తత కొనసాగుతున్న పరిస్థితుల్లో జనరల్ నరవణె వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, చైనాతో సరిహద్దు సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో శుక్రవారం జరిగిన ఆర్మీ డే పరేడ్ కార్యక్రమంలో జనరల్ నరవణె పాల్గొన్నారు.
గత సంవత్సరం జూన్‌లో లద్దాఖ్‌లో ‘గల్వాన్ హీరోలు’ చేసిన ప్రాణత్యాగం వృధా పోదని, దేశ సమగ్రత, సార్వభౌమత్వం, రక్షణకు ప్రమాదం వాటిల్లనివ్వబోమని స్పష్టం చేశారు. ‘తీవ్రమైన చలి పరిస్థితుల్లోనూ తూర్పు లద్దాఖ్‌ల్లో విధుల్లో ఉన్న భారత సైనికుల నైతిక స్థైర్యం దెబ్బతినలేదు. అక్కడి పర్వతాల కన్నా ఎత్తుగా వారి ధైర్య, సాహసాలున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ‘చర్చలు, రాజకీయ ప్రయత్నాల ద్వారా సమస్యలు పరిష్కారమవ్వాలనే మేం కోరుకుంటాం. అయితే, మా ఓపికను పరీక్షించే తప్పు ఎవరూ చేయవద్దు’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉందని పాకిస్తాన్‌పై ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment