న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో మనం కొత్త తరహా యుద్ధాలను ఎదుర్కోవాల్సి రానుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అభిప్రాయపడ్డారు. వాటి తాలూకు ట్రైలర్లు ఐటీ, ఎకనామిక్, సైబర్ వార్‌ఫేర్ వంటి రూపాల్లో ఇప్పటికే కళ్లముందు కన్పిస్తున్నాయన్నారు. అణుపాటవమున్న పొరుగు దేశాలు, వాటి దన్నుతో ఉగ్ర మూకలు చేస్తున్న పరోక్ష యుద్ధం దేశ భద్రతకు ముందెన్నడూ లేనంతగా సవాళ్లు విసురుతున్నాయని చైనా, పాకిస్తాన్‌లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
‘‘యుద్ధ స్వరూపంలో వస్తున్న ఈ సమూల మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టగలగడం, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనే సన్నద్ధత ముఖ్యం. ఈ దిశగా మన ప్రత్యక్ష, పరోక్ష యుద్ధ పాటవాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి’’ అన్నారు. గురువారం ఇక్కడ సెంటర్ ఫర్ ల్యాండ్ వార్‌ఫేర్ స్టడీస్ (సీఎల్‌ఏడబ్ల్యూఎస్) ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధురి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్‌లతో పాటు నరవణె పాల్గొన్నారు.
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
యుద్ధ రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యం ఎంతగానో పెరిగిందని ఆర్మీ చీఫ్ అన్నారు. ఇటీవల ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే ప్రధాన పాత్ర కావడం, యూఏఈపై యెమన్ హౌతీ రెబెల్స్ డ్రోన్, మిసైల్ దాడులు, వాటిని అమెరికా సాంకేతిక సహకారంతో యూఏఈ అడ్డుకున్న తీరు ఇందుకు తాజా నిదర్శనాలన్నారు. పాక్, చైనా నుంచి జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను లోతుగా ఆయన విశ్లేషించారు. ‘‘విచ్ఛిన్న శక్తులు స్థానిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని తక్కువ ఖర్చుతో భారీ దాడులకు తెగబడతాయి. అధునాతన సామర్థ్యం అందుబాటులో ఉన్నా పూర్తిస్థాయిలో ప్రయోగించలేని పరిస్థితులను కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. అఫ్గానిస్తాన్‌లో నిత్యం జరుగుతున్న మారణహోమమే నిదర్శనం’’ అన్నారు.
పాక్‌ను నిర్దేశించగలుగుతున్నాం
నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గడం, పాక్‌తో కాల్పుల విరమణ పూర్తిస్థాయిలో అమలవుతుండటానికి ప్రధాన కారణం మన సైనిక పాటవమేనని జనరల్ నరవణె అన్నారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడుతూ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులను కట్టిపెట్టేందుకు ఇరు సైన్యాల మధ్య గతంలో అంగీకారం కుదరడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment