Cyber wars
-
భావి యుద్ధాలకు ట్రైలర్లు చూస్తున్నాం
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో మనం కొత్త తరహా యుద్ధాలను ఎదుర్కోవాల్సి రానుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అభిప్రాయపడ్డారు. వాటి తాలూకు ట్రైలర్లు ఐటీ, ఎకనామిక్, సైబర్ వార్ఫేర్ వంటి రూపాల్లో ఇప్పటికే కళ్లముందు కన్పిస్తున్నాయన్నారు. అణుపాటవమున్న పొరుగు దేశాలు, వాటి దన్నుతో ఉగ్ర మూకలు చేస్తున్న పరోక్ష యుద్ధం దేశ భద్రతకు ముందెన్నడూ లేనంతగా సవాళ్లు విసురుతున్నాయని చైనా, పాకిస్తాన్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధ స్వరూపంలో వస్తున్న ఈ సమూల మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టగలగడం, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనే సన్నద్ధత ముఖ్యం. ఈ దిశగా మన ప్రత్యక్ష, పరోక్ష యుద్ధ పాటవాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి’’ అన్నారు. గురువారం ఇక్కడ సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ (సీఎల్‌ఏడబ్ల్యూఎస్) ఏర్పాటు చేసిన సెమినార్లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధురి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్‌లతో పాటు నరవణె పాల్గొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవాలి యుద్ధ రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యం ఎంతగానో పెరిగిందని ఆర్మీ చీఫ్ అన్నారు. ఇటీవల ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే ప్రధాన పాత్ర కావడం, యూఏఈపై యెమన్ హౌతీ రెబెల్స్ డ్రోన్, మిసైల్ దాడులు, వాటిని అమెరికా సాంకేతిక సహకారంతో యూఏఈ అడ్డుకున్న తీరు ఇందుకు తాజా నిదర్శనాలన్నారు. పాక్, చైనా నుంచి జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను లోతుగా ఆయన విశ్లేషించారు. ‘‘విచ్ఛిన్న శక్తులు స్థానిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని తక్కువ ఖర్చుతో భారీ దాడులకు తెగబడతాయి. అధునాతన సామర్థ్యం అందుబాటులో ఉన్నా పూర్తిస్థాయిలో ప్రయోగించలేని పరిస్థితులను కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. అఫ్గానిస్తాన్‌లో నిత్యం జరుగుతున్న మారణహోమమే నిదర్శనం’’ అన్నారు. పాక్‌ను నిర్దేశించగలుగుతున్నాం నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గడం, పాక్‌తో కాల్పుల విరమణ పూర్తిస్థాయిలో అమలవుతుండటానికి ప్రధాన కారణం మన సైనిక పాటవమేనని జనరల్ నరవణె అన్నారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడుతూ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులను కట్టిపెట్టేందుకు ఇరు సైన్యాల మధ్య గతంలో అంగీకారం కుదరడం తెలిసిందే. -
ప్రపంచానికి సైబర్ యుద్ధాల ముప్పు
పరిష్కారాలు కనుగొనడంలో భారత్ కీలక పాత్ర పోషించాలి - డిజిటల్ విప్లవంతో అవినీతికి చెక్ - ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు - డిజిటల్ ఇండియా వీక్ ప్రారంభం సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు ప్రస్తుతం సైబర్ యుద్ధాల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ ‘రక్తపాతరహిత యుద్ధాన్ని’ సమర్థంగా ఎదుర్కొనడాన్ని భారత ఐటీ నిపుణులు సవాలుగా స్వీకరించాలని, పరిష్కార మార్గాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు కావాల్సిన సామర్థ్యం భారత ఐటీ రంగానికి ఉందని మోదీ చెప్పారు. బుధవారం ఇక్కడ డిజిటల్ ఇండియా వీక్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. అవినీతిని అంతమొందించేందుకు, పారదర్శకమైన.. సమర్ధమంతమైన పాలన అందించేందుకు, పేద-ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాలను రూపుమాపేందుకు దేశంలో డిజిటల్ విప్లవం రావాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ-గవర్నెన్స్ నుంచి ఎం-గవర్నెన్స్ దిశగా మళ్లాల్సి ఉంటుందన్నారు. ‘ఎం-గవర్నెన్స్ అంటే మోదీ గవర్నెన్స్ అని కాదు. మొబైల్ గవర్నెన్స్ అని అర్థం’ అంటూ ఆయన వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు. భారత ఐటీ సామర్థ్యాలను కొనియాడిన మోదీ.. స్టార్టప్ సంస్థలు సాధిస్తున్న విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సం దర్భంగా భారత్‌నెట్, డిజిటల్ లాకర్, ఉపకారవేతనాల పోర్టల్, డిజిటల్ ఇండియా పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. అరుణ్ జైట్లీ, రవి శంకర్ ప్రసాద్ తదితర మంత్రులతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదరికాన్ని రూపుమాపే దిశగా భారత్ 8-10 శాతం వృద్ధి రేటు సాధించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సందర్భంగా చెప్పారు. సైబర్ నేరాలపై ఆందోళన.. అంతకంతకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలు ప్రపంచ దేశాలకు ఆందోళనకరంగా మారాయని మోదీ పేర్కొన్నారు. ‘పదో క్లాసో.. పన్నెండో క్లాసు చదువుకున్న వారు.. మనకు వేల కిలో మీటర్ల దూరంలో ఉండి కూడా జస్ట్ ఒక్క క్లిక్‌తో మన బ్యాంకు ఖాతాల్లో డబ్బును స్వాహా చేసేస్తున్నారు’ అని ఆయన చెప్పారు. ‘ప్రపంచంపై సైబర్ యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్నాయి. దీనిపై ప్రపంచం ఆందోళనగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడంలో భారత్ చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అయితే, వినూత్నమైన, విశ్వసనీయమైన పరిష్కార మార్గాలతో ప్రపంచాన్ని కాపాడగలిగే సత్తా భారత్‌కి ఉందా అన్న సందేహాలు ఉండొచ్చు. కానీ పుష్కలంగా టాలెంట్ ఉన్న భారత్ ఈ పని ఎందుకు చేయలేదు? కచ్చితంగా సాధించగలదు. మానవాళి మొత్తం ప్రశాంతంగా ఉండేలా చూసేందుకు మనం ఈ సవాలును ధైర్యంగా స్వీకరించాలి’ అని మోదీ ఉద్బోధించారు. దేశ భద్రతలో సైబర్ సెక్యూరిటీ కూడా భాగం కావాలని ఆయన చెప్పారు. డిజైన్ ఇన్ ఇండియా... దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని ప్రధాని చెప్పారు. స్టార్టప్ సంస్థలకు పూర్తి తోడ్పాటు అందిస్తామని, యువత కొంగొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మేక్ ఇన్ ఇండియా నినాదం ఎంత ముఖ్యమో డిజైన్ ఇన్ ఇండియా కూడా అంతే ముఖ్యమైనదన్నారు. పారిశ్రామిక విప్లవాన్ని భారత్ అందుకోలేకపోయి ఉండొచ్చు గానీ.. ఐటీ విప్లవం విషయంలో వెనుకబడిపోదని మోదీ పేర్కొన్నారు.