ప్రపంచానికి సైబర్ యుద్ధాల ముప్పు
పరిష్కారాలు కనుగొనడంలో భారత్ కీలక పాత్ర పోషించాలి
- డిజిటల్ విప్లవంతో అవినీతికి చెక్
- ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
- డిజిటల్ ఇండియా వీక్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు ప్రస్తుతం సైబర్ యుద్ధాల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ ‘రక్తపాతరహిత యుద్ధాన్ని’ సమర్థంగా ఎదుర్కొనడాన్ని భారత ఐటీ నిపుణులు సవాలుగా స్వీకరించాలని, పరిష్కార మార్గాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇందుకు కావాల్సిన సామర్థ్యం భారత ఐటీ రంగానికి ఉందని మోదీ చెప్పారు. బుధవారం ఇక్కడ డిజిటల్ ఇండియా వీక్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. అవినీతిని అంతమొందించేందుకు, పారదర్శకమైన.. సమర్ధమంతమైన పాలన అందించేందుకు, పేద-ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాలను రూపుమాపేందుకు దేశంలో డిజిటల్ విప్లవం రావాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ-గవర్నెన్స్ నుంచి ఎం-గవర్నెన్స్ దిశగా మళ్లాల్సి ఉంటుందన్నారు. ‘ఎం-గవర్నెన్స్ అంటే మోదీ గవర్నెన్స్ అని కాదు.
మొబైల్ గవర్నెన్స్ అని అర్థం’ అంటూ ఆయన వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు. భారత ఐటీ సామర్థ్యాలను కొనియాడిన మోదీ.. స్టార్టప్ సంస్థలు సాధిస్తున్న విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సం దర్భంగా భారత్‌నెట్, డిజిటల్ లాకర్, ఉపకారవేతనాల పోర్టల్, డిజిటల్ ఇండియా పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. అరుణ్ జైట్లీ, రవి శంకర్ ప్రసాద్ తదితర మంత్రులతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదరికాన్ని రూపుమాపే దిశగా భారత్ 8-10 శాతం వృద్ధి రేటు సాధించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సందర్భంగా చెప్పారు.
సైబర్ నేరాలపై ఆందోళన..
అంతకంతకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలు ప్రపంచ దేశాలకు ఆందోళనకరంగా మారాయని మోదీ పేర్కొన్నారు. ‘పదో క్లాసో.. పన్నెండో క్లాసు చదువుకున్న వారు.. మనకు వేల కిలో మీటర్ల దూరంలో ఉండి కూడా జస్ట్ ఒక్క క్లిక్‌తో మన బ్యాంకు ఖాతాల్లో డబ్బును స్వాహా చేసేస్తున్నారు’ అని ఆయన చెప్పారు. ‘ప్రపంచంపై సైబర్ యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్నాయి. దీనిపై ప్రపంచం ఆందోళనగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడంలో భారత్ చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అయితే, వినూత్నమైన, విశ్వసనీయమైన పరిష్కార మార్గాలతో ప్రపంచాన్ని కాపాడగలిగే సత్తా భారత్‌కి ఉందా అన్న సందేహాలు ఉండొచ్చు. కానీ పుష్కలంగా టాలెంట్ ఉన్న భారత్ ఈ పని ఎందుకు చేయలేదు? కచ్చితంగా సాధించగలదు. మానవాళి మొత్తం ప్రశాంతంగా ఉండేలా చూసేందుకు మనం ఈ సవాలును ధైర్యంగా స్వీకరించాలి’ అని మోదీ ఉద్బోధించారు. దేశ భద్రతలో సైబర్ సెక్యూరిటీ కూడా భాగం కావాలని ఆయన చెప్పారు.
డిజైన్ ఇన్ ఇండియా...
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని ప్రధాని చెప్పారు. స్టార్టప్ సంస్థలకు పూర్తి తోడ్పాటు అందిస్తామని, యువత కొంగొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మేక్ ఇన్ ఇండియా నినాదం ఎంత ముఖ్యమో డిజైన్ ఇన్ ఇండియా కూడా అంతే ముఖ్యమైనదన్నారు. పారిశ్రామిక విప్లవాన్ని భారత్ అందుకోలేకపోయి ఉండొచ్చు గానీ.. ఐటీ విప్లవం విషయంలో వెనుకబడిపోదని మోదీ పేర్కొన్నారు.