పట్టు పట్టు.. ట్రెండే పట్టు కాదేదీ సినిమా కథకు అనర్హం. రకరకాల కథల్ని సినిమాలుగా చూస్తూ వస్తున్నాం. ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతుంది. మారిన ట్రెండ్‌కి తగ్గట్టే.. కథలు రాయాలి.. సినిమాలు తీయాలి. పౌరాణికం, సాంఘికం. ఫ్యాక్షన్. యాక్షన్. ఇలా ట్రెండ్ మారుతూ వచ్చింది. ఆ మధ్య బయోపిక్స్ హవా నడిచింది. ఇప్పుడేమో సమాజంలో జరిగే సంఘటనలతో సినిమాలు తీయడమనే ట్రెండ్ బాగా ఎక్కువైంది. ట్రెండ్‌ని పట్టుకొని కథల్ని అల్లితే ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టొచ్చు.. కలెక్షన్లు రాబట్టవచ్చు. అందుకే ఏదైనా సంచలనాత్మక సంఘటనలు జరగడం ఆలస్యం ‘పట్టు పట్టు ట్రెండే పట్టు’ అంటూ ఆ అంశం మీద సినిమాలు ప్రకటిస్తున్నారు దర్శక–నిర్మాతలు.
ఈ మధ్య కాలంలో ఇలా ప్రకటించిన సినిమాల వివరాలు
గల్వాన్ ఘటన
పాకిస్తాన్ మీద ఇండియా జరిపిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఉడి’. ఈ చిత్రం భారీ హిట్ అవడమే కాకుండా కలెక్షన్స్ దుమ్ము దులిపింది. గతకొన్ని రోజులుగా లడఖ్ సమీపంలో గల్వాన్ లోయలో భారత్ – చైనాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ సంఘటన మీద సినిమా తీస్తున్నట్టు అజయ్ దేవగణ్ ప్రకటించారు. ఇందులో నటించడమే కాకుండా ఈ చిత్రాన్ని అజయ్ దేవగనే నిర్మిస్తున్నారు కూడా. దర్శకుడు, మిగతా నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. (ఈ హీరోయిన్లు.. భ‘లేడీ’ విలన్లు)
అభినందన్ వర్థమాన్
బాల్‌కోట్ ఎయిర్ అటాక్స్ ఆధారంగా మూడు సినిమాలు తెరకెక్కనున్నట్లు బాలీవుడ్ నుంచి ప్రకటన వచ్చింది. ఉగ్రస్థావరాలపై వైమానిక దళం దాడులు, పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్, ఆ తర్వాత ఆయన ఎలా తిరిగి వచ్చారు? అనే కథాంశంతో ఈ సినిమాలు తెరకెక్కనున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. భన్సాలీ అభిషేక్ కపూర్ కూడా ఓ సినిమాను ప్రకటించారు. అలానే ఆభినందన్‌గా నటించాలనుందని జాన్ అబ్రహాం తన మనసులోని మాట బయటపెట్టారు. కాబట్టి పైన పేర్కొన్న సినిమాల్లో జాన్ కనిపిస్తారేమో చూడాలి.
అయోధ్య కథ
అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నం జరిగింది. కృషి ఫలించింది. ఇటీవలే అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సంఘటనను సినిమాగా తీయడానికి బాలీవుడ్‌లో ఓ నిర్మాత సిద్ధమయ్యారు. అయోధ్యలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘అయోధ్యకీ కథ’ అనే సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత, సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు పహ్లాజ్ నిహ్లానీ. వివిధ భాషల్లో తెరకెక్కించే ఈ చిత్రంలో అన్ని భాషలకు సంబంధించిన నటీనటులు నటిస్తారని తెలిసింది. ఈ ఏడాది నవంబర్ 21న ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా విడుదల కానున్నట్టు సమాచారం.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్‌ని ఎంతగా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటన తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజం వివాదం మరింత ముదిరింది. అవుట్ సైడర్స్ – ఇన్ సైడర్స్ డిబేట్ జరుగుతోంది. ఇదే సమయంలో సుశాంత్ పై ఓ సినిమా ప్రకటించారు హిందీ దర్శకుడు షామిక్ మౌలిక్. ‘సూసైడ్ ఆర్ మర్డర్?’ అనే టైటిల్‌తో సుశాంత్ పై ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇది సుశాంత్ బయోపిక్ కాదని కేవలం హీరోగా తన జర్నీ ని చూపించే చిత్రం అని పేర్కొన్నారు. ఈ చిత్రం పోస్టర్స్ ని కూడా విడుదల చేశారు.
ఇలా తాజా సంఘటనలను, దాని తాలూకు క్రేజ్‌ని క్యాష్ చేసుకుందాం అనే ఆలోచనల్లోంచే ఇలా హడావిడిగా సినిమాలను ప్రకటిస్తుంటారు కొందరు. మరి.. ప్రకటించిన సినిమాలన్నీ తెరకొస్తాయా? కేవలం క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనే కాకుండా ఆ సంఘటనలకు న్యాయం చేసే విధంగా ఈ సినిమాలు రూపొందుతాయా?
వేచి చూడాలి.
లాక్‌డౌన్, కరోనా టైటిళ్లతో..
కరోనా వల్ల ఏర్పడ్డ లాక్‌డౌన్ ద్వారా ప్రపంచం స్తంభించిపోయింది. పనులన్నీ ఆగిపోయాయి. వలస కూలీలు పొట్ట చేత పట్టుకొని వందల మైళ్లు ప్రయాణించారు. సామాన్యులు చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో చాలా కథలు కనబడ్డాయి మన దర్శక – నిర్మాతలకు. లాక్‌డౌన్ బ్యాక్‌డ్రాప్ లో పలు సినిమాలను ప్రకటించారు. కన్నడ దర్శకుడు గురు ప్రసాద్ ‘లాక్‌డౌన్’ అనే టైటిల్‌తో ఓ సినిమా ప్రకటించారు. లాక్‌డౌన్ బ్యాక్‌డ్రాప్ లో ఓ క్రైమ్ కామెడీ కథను రెడీ చేస్తున్నారట.
అలాగే ‘కరోనా’ అనే టైటిల్‌ను ఉమేష్ బంకర్ అనే కన్నడ దర్శకుడు రిజిస్టర్ చేసుకున్నారు. కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ‘కరోనా ప్యార్ హై’ (‘కహోనా ప్యార్ హై’కి పేరడీగా) అనే టైటిల్‌ను నమోదు చేసుకున్నారు. ‘డెడ్లీ కరోనా’ అనే టైటిల్ కూడా హిందీలో నమోదు అయినట్టు సమాచారం. మరో వైపు లాక్ డౌన్ వల్ల ఇంటికి వెళ్లలేక చిక్కుకుపోయిన కొంతమంది విద్యార్థుల కథతో ‘21 డేస్’ అనే చిత్రాన్ని ప్రకటించారు తమిళ దర్శకుడు విజయ్ భాస్కర్.
హిందీ వైపు వస్తే... సుధీర్ మిశ్రా, హన్సల్ మెహతా, కేతన్ మెహతా, సుభాష్ కపూర్ లతో కలసి అనుభవ్ సిన్హా ఓ ఆంథాలజీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఐదుగురు దర్శకులు ఐదు కథలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అన్ని కథలు కరోనా బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతాయని, స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని అనుభవ్ సిన్హా తెలిపారు. ఈ సినిమాను ఆయనే నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ గాంధీ ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఈ చిత్రం వైరస్, లాక్ డౌన్ చుట్టూ తిరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment