‘బాయ్ కాట్ చైనా’ సాధ్యమేనా? | Can India really boycott china product in response to Galwan attack | Sakshi
Sakshi News home page

‘బాయ్ కాట్ చైనా’ సాధ్యమేనా?

Published Tue, Jun 23 2020 11:36 AM | Last Updated on Tue, Jun 23 2020 12:14 PM

Can India really boycott china product in response to Galwan attack - Sakshi

న్యూఢిల్లీః ఐదు దశబ్దాల తర్వాత ఇండో– చైనా సరిహద్దుల్లో రాజుకున్న వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వివాదం ఇరువైపులా భారీస్థాయిలో ప్రాణ నష్టాన్ని మిగిల్చి దాదాపు వారం గడుస్తోంది. ఓ వైపు చర్చలంటూనే, చాటుమాటున కుట్ర పన్ని భారత జవాన్లపై చైనా సైన్యం చేసిన దాడిలో 20 మంది అమరులయ్యారు. 76 మంది తీవ్రంగా గాయపడ్డారు. 10 మంది బందీలుగా శత్రువు చేతికి చిక్కారు. భారత భూభాగంలో చైనా టెంట్లు వేయడంతోనే వివాదం రాజుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశం కోసం జవాన్లు చేసిన త్యాగం ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చింది. చైనాను ఆర్థికంగా కుంగదీయాలనే ఆలోచనకు బీజం వేసింది. వెరసి ‘బాయ్ కాట్ చైనా’మరో సత్యాగ్రహంగా రూపుదిద్దుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూడా ‘స్వదేశీ’ వస్తువులను ఆదరించాలని దేశ ప్రజలను కోరింది.

అసలు చైనా వస్తువులను బాయ్ కాట్ సాధ్యమేనా? నిపుణులు మాత్రం బాయ్ కాట్ చైనా ఆలోచన వాస్తవాలకు దూరంగా ఉందని అంటున్నారు. భారత్ కొన్నేళ్లుగా చైనా నుంచి భారీ మొత్తంలో దిగుమతులు చేసుకుంటోందని చెబుతున్నారు. భారత్ చేసుకుంటున్న దిగుమతుల్లో అత్యధికం చైనా నుంచి వచ్చేవే. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఇండియా చైనా నుంచి 5.72 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులు దిగుమతి చేసుకుంది. ఇది భారత్ మొత్తం దిగుమతుల్లో 17 శాతంతో సమానం. ఇదే ఏడాది అమెరికా నుంచి ఇండియా 2.34 లక్షల కోట్ల రూపాయల విలువైన దిగుమతులు చేసుకుంది. భారత్ కు అత్యధికంగా ఎగుమతులు చేసే రెండే దేశం అమెరికానే.(చైనా దూకుడుకు కళ్లెం.. వ్యూహాలకు పదును)

ఇండియా చైనాకూ ఎగుమతులు చేస్తోంది. వీటిలో ముఖ్యంగా ముడి సరుకులు, తక్కువ విలువ కలిగిన ఉత్పత్తులు ఉంటున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ చైర్మన్ రాకేశ్ మోహన్ జోషి తెలిపారు. ఇదే సమయంలో అధిక విలువ కలిగిన ఉత్పత్తులను మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. భారత్ ఎగుమతి చేసే వాటిలో ముఖ్యంగా రత్నాలు, ఆభరణాలు, మినరల్స్, ఓర్, ఆర్గానిక్ కెమికల్స్, సముద్ర ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ మెషినరీ ఉంటున్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిలో అత్యధికంగా ఎలక్ట్రికల్ మెషినరీ, న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ మెషినరీ, ఆర్గానిక్ కెమికల్స్, రత్నాలు, ఆభరణాలు, ఇనుము, స్టీల్ ఉన్నాయి.

అమెరికన్ థింక్ ట్యాంక్ ప్రకారం భారత్ లో ఉన్న ప్రతి నాలుగు పవర్ ప్లాంట్స్ లో మూడు చైనాకు చెందిన ఎలక్ట్రికల్ మెషినరీని వాడుతున్నాయి. చైనా ఎదుగుతోందని చెప్పడానికి నిదర్శనం మాత్రం ఇండియాలో వారి వినియోగ వస్తువులకు మార్కెట్లో ఉన్న డిమాండే. ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను చైనా కంపెనీలు ప్రస్తుతం శాసిస్తున్నాయి. ఇండియాలోని ఐదు టాప్ స్మార్ట్ ఫోన్ అమ్మకందార్లలో నాలుగు చైనాకు చెందిన షావోమి, ఒప్పో, వివో, రియల్ మీ కంపెనీలే కావడం గమనార్హం. 2020 తొలి త్రైమాసికంలో ఇండియాలో అమ్ముడైన ప్రతి నాలుగు స్మార్ట్ ఫోన్లలో మూడు చైనా కంపెనీలకు చెందినవేనని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తేల్చింది.(‘చైనా.. మోదీని ఎందుకు ప్రశంసిస్తుంది’)

ఇండియన్ స్మార్ట్ టీవీ మార్కెట్లో కూడా చైనా హవా నడుస్తోంది. ఇందులో షావోమీ వాటా 27 శాతం. ఇలా ఇండియాకు చెందిన అన్ని పరిశ్రమల్లోనూ చైనా పాతుకుపోయింది. గ్రామీణ భారతం సైతం చైనా వస్తువులపై భారీగానే ఆధారపడుతోంది. దేశంలో పంటలకు వేసే 45 శాతం డై అమ్మోనియం పాస్ఫేట్ ఎరువు, 13 శాతం యూరియా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. వ్యవసాయ రంగంలో చైనా ఉత్పత్తుల్ని బాయ్ కాట్ చేస్తే ధరలు పెరిగి రైతాంగం ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశాలు ఉన్నాయి.  

డొక్లాం ప్రభావం ఏది?
2017లో ఇండియా–చైనా మధ్య చెలరేగిన డొక్లాం వివాదం వల్ల చైనా ఉత్పత్పుల వాడకమేమీ దేశంలో తగ్గిన దాఖలాలు లేవు. 2018 తొలి త్రైమాసికంలో భారత మార్కెట్ లో 55 శాతంగా ఉన్న చైనా మొబైల్ కంపెనీల వాటా, మరుసటి ఏడాది అదే త్రైమాసికానికి 73 శాతానికి పెరిగింది. తక్కువ ధరలో చైనా ఉత్పత్తులు రావడం వల్లే ఇలా జరిగిందని రాకేశ్ మోహన్ పేర్కొన్నారు.

చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలనే రాజకీయ పిలుపుల కంటే ఆ దేశం మన వ్యవస్థలో వేళ్లూనుకున్న విధానం చాలా బలమైనదని ఐఐఎం బెంగుళూరుకు చెందిన ఎకానమిక్స్ ప్రొఫెసర్ రూపా చందా అభిప్రాయపడ్డారు. కేవలం ‘మేక్ ఇన్ ఇండియా’ ట్యాగ్ ఉంటే ఆ వస్తువు పూర్తిగా ఇండియాలో తయారైందని అర్థం కాదన్నారు. నేటి ప్రపంచంలో ఏ వస్తువులోని పార్ట్ ఎక్కడ తయారైందో చెప్పడం కష్టమని తేల్చి చెప్పారు.

చైనాతో వాణిజ్యం ఆగితే ఇండియన్ మాన్యుఫాక్చరింగ్ వ్యవస్థ అతలాకుతలం అవుతుందని బిజినెస్ రీసెర్చ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. ఇండియాకు అవసరమైన 67 శాతం ఎలక్ట్రానిక్ వస్తువులు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయని తెలిపింది. దీని అర్థం మనం ఇండియా వస్తువులనే కొన్నా వాటి లోపల ఎక్కడో ఓ మూలన చైనా వస్తువు ఆనవాళ్లు దాగి ఉంటాయని వెల్లడించింది. చైనా నుంచి దిగుమతులు నిలిపేస్తే భారత ఫార్మా రంగం అసలు మందులనే ఉత్పత్తి చేయలేదని చెప్పింది. ఇండియా దాదాపు 69 శాతం ఫార్మా వస్తువులను చైనా నుంచి తెచ్చుకుంటోంది. వీటిలో యాంటి బయాటిక్స్ శాతమైతే 90కి పైమాటే. చైనా భారత్ కు యాంటి బయాటిక్స్ సరఫరా నిలిపిస్తే దేశంలో ఆరోగ్యపరంగా అత్యవసర స్థితి నెలకొంటుందని జైపూర్ లోని ఐఐహెచ్ఎంఆర్ కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ సందీప్ నరూలా తెలిపారు.

పెట్టుబడులు
కొన్నేళ్లుగా చైనా కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు కూడా పెడుతోందని రూపా చందా చెప్పారు. ఇండియాలో కూడా చైనా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. 2020 మార్చి నాటికి 26 బిలియన్ డాలర్ల మేర చైనా ఇండియాలో పెట్టుబడులు పెట్టినట్లు బ్రూకింగ్స్ పేర్కొంది. అది కూడా భారత సంస్థల్లో వాటాలను చైనా కొనుగోలు చేసిందని తెలిపింది. ఆలీబాబా ద్వారా పేటీఎం కంపెనీలో 40 శాతం వాటాను కొనుగోలు చేసింది. పేటీఎం యాప్ నుంచి అన్నీ ఆలీ బాబా డిజైన్ కు ప్రతిరూపంగానే ఉంటాయి.

భారత మీడియా రంగంలో చైనా పెట్టుబడులు పశ్చిమ దేశాలతో పోల్చితే తక్కువే. కానీ, టిక్ టాక్ లాంటి యాప్స్ తో పరిస్థితి మారుతోంది. లాక్ డౌన్ కాలంలో ఇండియాలో అత్యధికంగా డౌన్ లోడ్ అయిన సోషల్ మీడియా యాప్ టిక్ టాకేనని యానీ యాప్ వెల్లడించింది. 2018లో ఇండియాలో అత్యధికంగా డౌన్ లోడ్ అయిన 100 యాప్స్ లో 44 చైనావే.

ఇలాంటి పరిస్థితుల్లో చైనాతో వాణిజ్యాన్ని ఉపసంహరించుకుంటే ఇండియాకే ప్రమాదమని చందా పేర్కొన్నారు. కోవిడ్–19 వల్ల దేశం పరిస్థితి ఇంకా దిగజారిందని చెప్పారు. హెచ్ఎస్ బీసీ అంచనాల ప్రకారం 2020–21లో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం క్షీణిస్తుందని వెల్లడించింది. గడచిన ఐదేళ్లలో భారత్ ఎగుమతులు తగ్గాయి. ఇదే సమయంలో వియత్నాం, బంగ్లాదేశ్ వాటి ఎగుమతులను పెంచుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా వీటన్నింటినీ ఎలా అధిగమించగలుగుతుందని చందా ప్రశ్నించారు.

ఇటీవల లఢఖ్ ఘటన తర్వాత నిర్వహించిన ఓ సర్వేలో 93 శాతం మంది భారతీయులు బాయ్ కాట్ చైనాకు అనుకూలంగా ఓటు వేశారు. అదే టైంలో అమ్మకానికి వచ్చిన చైనాకు చెందిన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఒక నిమిషంలో అమ్ముడుపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement