చైనాకు చెక్‌ : మరోసారి మోదీ మార్క్‌ | PM Narendra Modi Visit Ladakh | Sakshi
Sakshi News home page

సరిహద్దు నుంచి యుద్ధ సందేశం

Published Fri, Jul 3 2020 1:21 PM | Last Updated on Fri, Jul 3 2020 3:13 PM

PM Narendra Modi Visit Ladakh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్‌ 370 తొలగింపు (కశ్మీర్‌), లాక్‌డౌన్‌ విధింపు వంటి అనుహ్య నిర్ణయాలతో దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అదే పంథాను ఎంచుకున్నారు. భారత్‌-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మూడోకంటికి కూడా తెలియకుండా కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పర్యటించి శుక్రవారం ఉదయం ఊహించని వార్తను దేశ ప్రజలకు వినిపించారు. ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జరనల్‌ ఎంఎమ్‌ నరవణేతో కలిసి మోదీ లేహ్‌ పర్యటనకు శ్రీకారం చుట్టారు. జూన్‌ 15న చోటుచేసుకున్న గల్వాన్‌ లోయ హింసాత్మక ఘటనలో గాయపడిన సైనిక జవాన్లను 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న భారత సైనిక స్థావరం నిములో పరామర్శించారు. అలాగే సరిహద్దు ప్రతిష్టంభనపై చైనా-భారత్‌ కమాండర్‌ స్థాయి సమావేశాల్లో పాల్గొన్న సైనిక అధికారులతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. (లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన)


గల్వాన్‌ హింసాత్మక ఘటనపై స్థానిక జవాన్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలోని తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భగా సరిహద్దులోని పరిస్థితిని సైనికాధికారులు మోదీకి వివరించారు. ఈ పరిణామం చైనాతో పాటు పాకిస్తాన్‌, నేపాల్‌ దేశాలు కొంత కంటగింపు లాంటిదేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. సరిహద్దు నుంచి మోదీ యుద్ధ సందేశాన్ని ఇచ్చారని చెబుతున్నారు. మొదట గల్వాన్‌ లోయలో యుద్ధ వాతావరణం తలపించడం, ఆ తరువాత ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు జరపడం భారత్‌ శాంతి మంత్రాన్ని ప్రతిపాదించినప్పటికీ చైనా పద్దతి మార్చుకోకపోవడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సరిహద్దుల్లో భారతపై దురాక్రమణకు కాలుదువ్వుతున్న డ్రాగన్‌కు మూకుతాడు వేసేందుకు మోదీ ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా వారం కిందటే చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ఎల్‌ఏసీ వెంట నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సైనిక సన్నద్ధతను సమీక్షించడానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ శుక్రవారం లద్దాఖ్‌ పర్యటకు వెళ్లాల్సి ఉంది. ఆయన స్థానంలో హుటాహుటిన మోదీ లద్దాఖ్‌కు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాగా చైనా సరిహద్దుల్లో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌లో ఓసారి పర్యటించారు. సియాచిన్‌కు వెళ్లిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు సైతం నెలకొల్పారు. (చైనా విరాళాలు మన పార్టీలకు ఎందుకు?!)

మరోవైపు ఇరు దేశాల మధ్య ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మోదీ లద్దాఖ్‌కు వెళ్లడం అతిపెద్ద పరిణామామని పలువురు మాజీ సైనికాధికారులు చెబుతున్నారు. చైనాకు బుద్దిచెప్పేందుకు సైనికంగా పూర్తి స్థాయి సన్నద్ధతో ఉన్నామని పొరుగు దేశాలకు చాటిచెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయపడుతున్నారు. మోదీ పర్యటన సరిహద్దు వెంట విధులు నిర్వహిస్తున్న సైనికులు మానసిక బలం, కదనోత్సహం కలుగుతుందని చెబుతున్నారు.  ఇక లద్దాఖ్‌ పర్యటన అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా  చైనాతో ఇటీవల చోటుచుసుకుంటున్న పరిణాల నేపథ్యంలో సైనిక సంపత్తిని బలోపేతం చేసే దిశగా మోదీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. రక్షణ దళాల సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా రూ.38,900 కోట్లతో 33 యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర ఆయుధాల కొనుగోలుకు రక్షణ శాఖ గురువారం అనుమతి ఇచ్చింది. రష్యా నుంచి 21 మిగ్‌–29 ఫైటర్‌ జెట్లు కొనుగోలు చేయనున్నారు. హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నుంచి 12 సుఖోయ్‌–30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమకూర్చుకోనున్నారు. దీనిలో భాగంగానే ఫ్రాన్స్‌ రావాల్సిన రఫెల్‌ యుద్ధ విమానాలను వెంటనే స్వదేశానికి తరలించాలని కోరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement