Lieutenant general
-
ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్లతో సరిహద్దుల్లో సుదీర్ఘ కార్యాచరణ అనుభవమున్న లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 30వ ఆర్మీ చీఫ్‌గా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రిటైరయ్యారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022–2024 సంవత్సరాల మధ్య ఆయన జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ ఆఫ్ నార్తర్న్ కమాండ్‌గా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక స్కూల్ విద్యార్థి అయిన జనరల్ ద్వివేది 1984లో జమ్మూకశీ్మర్ రైఫిల్స్ రెజిమెంట్‌లో చేరారు. పరమ విశిష్ట సేవ, అతి విశిష్ట సేవ పతకాలు పొందారు.ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ క్లాస్మేట్స్ దేశ సైనిక చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆర్మీకి, నేవీకి సారథ్యం వహిస్తున్న ఇద్దరూ క్లాస్మేట్స్ కావడం విశేషం. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్ స్కూల్లో సహాధ్యాయులు. 1970లలో వీరిద్దరూ అక్కడ ఐదో తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. వీరిద్దరి రోల్ నంబర్లు కూడా దగ్గరదగ్గరగా ఉన్నాయి. జనరల్ ద్వివేది రోల్ నంబర్ 931 కాగా, అడ్మిరల్ త్రిపాఠీ నంబర్ 938. పాఠశాల దశలో మొదలైన వీరి స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. వేర్వేరు బాధ్యతల్లో ఉన్నప్పటికీ వీరి మైత్రి చెక్కుచెదరలేదు. రెండు నెలల వ్యవధిలోనే ఈ ఏడాది మేలో అడ్మిరల్ త్రిపాఠీ నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా, తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ అయ్యారు. -
జయహో జోయా
‘ఈ ప్రపంచంలో గొప్ప వృత్తులు ఏమిటి?’ అని చిన్నప్పుడు తండ్రిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం జోయా మీర్జా మనసులో ముద్రించుకుపోయింది. ఆ తరువాత కలగా మారింది. కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పరాజయం పలకరించింది. నిరాశలో రెండడుగులు వెనక్కి వేసినా ఆ తరువాత మాత్రం ఆత్మవిశ్వాసం అనే ఇంధనంతో వేగంగా ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఎంపిక అయింది జోయా మీర్జా. చత్తీస్‌గఢ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది జోయా....కల కన్నప్పుడే విజయానికి దగ్గరవుతాం. ఏ కలా లేనప్పుడు ఏ విజయమూ ఉండదు. ఛత్తిస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన జోయా మీర్జా చిన్నప్పటి నుంచి పెద్ద కలలు కనేది. అయితే అవేమీ ఆకాశానికి నిచ్చెన వేయాలనుకునే కలలు కావు. ‘వైద్యురాలిగా సేవ అందించాలి, సైన్యంలో పనిచేయాలి’... ఇలా ఉండేవి ఆమె కలలు.కన్న కలలు కాలానికి నిలబడతాయనే గట్టి నిబంధన లేదు. అయితే గట్టి పట్టుదల ఉంటే కల నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు అని చెప్పడానికి స్ఫూర్తి... జోయా మీర్జా. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (ఏఎఫ్ఎంసీ)లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మీర్జా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్‌గా నియామకం కావడం ద్వారా తన కలను నిజం చేసుకుంది.అయితే జోయా మీర్జాది నల్లేరు మీద నడకేమీ కాదు. కుటుంబ ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండేది. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా ‘ఇక చదివింది చాలు’ అనే మాట తల్లిదండ్రుల నుంచి ఎప్పుడూ రాలేదు. చదువు విషయంలో కుమార్తెను ఎప్పుడూ ్రపోత్సహించేవారు. జోయాను డాక్టర్‌గా చూడాలనేది అమ్మమ్మ కల.‘నీట్’ పరీక్షలో జోయాను ఫెయిల్యూర్ పలకరించింది. బాధపడుతూ కూర్చోకుండా ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో గ్రాడ్యుయేషన్ చేయడంపై దృష్టి పెట్టింది. ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని రాజస్థాన్‌లోని కోటాలో ‘నీట్’ కోసం కోచింగ్ తీసుకోవడానికి జోయా మీర్జాను తల్లిదండ్రులు ఒప్పించారు. కోచింగ్ కోసం అప్పులు చేశారు. ‘తల్లిదండ్రుల కోరిక మేరకు కోటాకు వెళ్లాను. అయితే ్రపాక్టీస్ ఎగ్జామ్స్‌లో ఇతర విద్యార్థులు నా కంటే మెరుగ్గా ఉన్నారనే విషయం తెలిసినప్పుడు నాలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. నీట్ పరీక్షకు ఇరవై రోజుల ముందు అమ్మమ్మ తీవ్రమైన అనారోగ్య సమస్య వల్ల నేను ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత తిరిగి కోటాకు వచ్చాను. ఒకే ఒక్క ర్యాంకు తేడాతో సీటు సాధించే అవకాశాన్ని కోల్పోయాను’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది మీర్జా.తల్లిదండ్రులు మొదట నిరాశ పడినా ‘మరో ప్రయత్నం’ అంటూ కుమార్తెను కోచింగ్ కోసం భిలాయ్‌కు పంపించారు.‘భిలాయ్ కోచింగ్ సెంటర్లోని ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడంతోపాటు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. అది నాకు ఎంతగానో ఉపకరించింది’ అంటుంది మీర్జా. ఆ ఆత్మబలమే ‘నీట్’లో తగిన మార్కులు సాధించి ‘ఏఎఫ్ఎంసీ’ ఎంచుకునేలా చేసింది. పుణేలోని ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ’లో ఎంబీబీఎస్ చేసింది.‘గొప్ప వృత్తులు ఏమిటి?’ అని చిన్నప్పుడు తండ్రిని అడిగినప్పుడు... ‘సోల్జర్, డాక్టర్’ అని చేప్పేవాడు. లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఆ రెండు గొప్ప వృత్తులలో పనిచేసే అవకాశం తన అదృష్టం అంటుంది జోయా మీర్జా.తన ఫస్ట్ పోస్టింగ్ జమ్మూలో.‘చదువుపై నాకు ఉన్న ఆసక్తిని గమనించి మా అమ్మమ్మ నన్ను డాక్టర్‌గా చూడాలనుకుంది. డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది. దురదృష్టవశాత్తు ఆమె ఏడాది క్రితం చనిపోయింది. నన్ను యూనిఫామ్‌లో చూడలేకపోయింది’ అమ్మమ్మను తలుచుకుంటూ బాధగా అంటుంది మీర్జా.‘పరులకు సహాయం చేయాలనే తత్వం తనది. తన మనస్తత్వానికి సరిగ్గా సరిపోయే వృత్తి ఇది. మీర్జాకు ఎలాంటి సవాలైనా ఎదుర్కొనే శక్తి ఉంది’ అంటున్నాడు జోయా తండ్రి షమీమ్ మీర్జా. -
చీఫ్ సెక్రటరీని తొలగించండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్(ఎల్జీ)ని సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. నరేశ్ కుమార్ తన కుమారుడికి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీకి, ఐఎల్బీ అనే సంస్థతో ఎంవోయూ కుదిరేందుకు అధికార దురి్వనియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ మంత్రి అతీషి ఆరోపించారు. ఈ మేరకు నివేదికను ఇటీవల సీఎం కేజ్రీవాల్‌కు అందజేశారు. ఆ నివే దికను కేజ్రీవాల్ శనివారం లెఫ్టినెంట్ జనరల్ వీకే శుక్లాకు పంపారు. అతీషి సిఫారసుల మేరకు ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తనకుమారుడికి ఎటువంటి కంపెనీతోను, ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఐఎల్‌బీఎస్ సంస్థ కూడా అతీషి చేసిన ఆరోపణలు నిరాధారాలంటూ ఖండించింది. -
మణిపూర్‌ను ఎవరూ రాష్ట్రంగా గుర్తించట్లేదు: ఆర్మీ అధికారి ఆవేదన
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘర్షణలు మొదలయ్యాయి. గత నెల రోజులుగా మైతీలు, కుకీలకు మధ్య చెలరేగిన అల్లర్లు నేటికి కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ క్షీణిస్తుండటంతో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా ఆందోళన కారులు రెచ్చిపోతున్నారు. భారీ సంఖ్యలో గుంపుగా తరలివచ్చి విధ్వంసానికి తెగబడుతున్నారు. స్థానికంగా ఉన్న బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు సహా, స్థానిక ఎమ్మెల్యేలు, పలువురు బీజేపీ నేతల ఇళ్లపై పెట్రో బాంబులతో దాడి చేసి ధ్వంసం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ఆర్మీ విశ్రాంత అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇంఫాల్‌లో నివసిస్తున్న ఆర్మీకి చెందిన విశ్రాంత అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిషికాంత సింగ్ ట్వీట్ చేశారు, ‘‘నేను విశ్రాంత జీవితం గడుపుతోన్న మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఓ సాధారణ భారతీయుడిని. మణిపూర్‌ను ఇప్పుడు ఎవరూ రాష్ట్రంగా గుర్తించట్లేదు. మణిపూర్ స్టేట్ లెస్‌గా మారింది. ఇక్కడ లిబియా, లెబనాన్, నైజీరియా, సిరియా మాదిరిగా ఎప్పుడైనా, ఎవరివల్లైనా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించవచ్చు. ఇదంతా ఎవరైనా వింటున్నారా..?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిషికాంత సింగ్, మాజీ ఆర్మీ చీఫ్ వీపీ మాలిక్ కాగా నిషికాంత్ ట్వీట్‌పై మాజీ ఆర్మీ చీఫ్ వీపీ మాలిక్ స్పందించారు. మణిపూర్ చెందిన ఓ విశ్రాంత అధికారి నుంచి విచారకరమైన పిలుపు వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అత్యున్నత స్థాయిలో తక్షణ చర్యలు అవసరం అంటూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ట్యాగ్ చేశారు. An extraordinary sad call from a retired Lt Gen from Manipur. Law & order situation in Manipur needs urgent attention at highest level. @AmitShah @narendramodi @rajnathsingh https://t.co/VH4EsLkWSU — Ved Malik (@Vedmalik1) June 16, 2023 అసలు ఎందుకీ ఘర్షణలు? మణిపూర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది ఉన్న మైతీలు తమకు షెడ్యూల్డు తెగల హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎస్టీ హోదా కోసం మైతీలు చేస్తున్న డిమాండ్‌పై నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మణిపూర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) పిలుపు మేరకు బుధవారం గిరిజన సంఘీభావ కవాతును నిర్వహించారు. ఈ కవాతు చురాచాంద్‌పూర్ జిల్లాలోని టోర్బుంగ్ ఏరియాలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాగాలు, జోమీలు, కుకీలు పాల్గొన్నారు. అయితే చురాచాంద్‌పూర్ జిల్లాలో బుధవారం జరిగిన గిరిజన కవాతు పలుచోట్ల ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అనంతరం లోయలోని జిల్లాలన్నిటికీ హింసాకాండ విస్తరించింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస జరిగింది. -
బిపిన్ రావత్ తర్వాత సీడీఎస్‌గా అనీల్ చౌహాన్
సాక్షి, న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం సుమారు 9 నెలల తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. బిపిన్ రావత్ తర్వాత సీడీఎస్‌గా లెఫ్టినెట్ జనరల్ అనిల్ చౌహాన్(రిటైర్ట్) పేరును ప్రకటించింది. లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్ 2021, మే నెలలో తూర్పు కమాండ్ చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ చేశారు. సైన్యంలో పలు ఉన్నత పదవులను నిర్వర్తించారు చౌహాన్. జమ్ముకశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో ఉగ్రకార్యకలాపాలను నిలువరించటంలో విస్తృత అనుభవం ఉంది. త్రివిద దళాలను ఏకతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. దేశ తొలి సీడీఎస్‌గా జనరల్ బిపిన్ రావత్ 2020, జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అయితే.. 2021 డిసెంబర్లో తమిళనాడులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మిలిటరీ హెలికాప్టర్లో వెళుతుండగా ప్రమాదం జరిగి రావత్, ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు మరో 11 మంది మరణించారు. అప్పటి నుంచి సీడీఎస్ పోస్ట్ ఖాళీగానే ఉంది. దాదాపు 9 నెలల తర్వాత కొత్త సీడీఎస్‌ను నియమించింది కేంద్రం. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్? -
Agnipath Scheme: దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు
సైన్యంలో అగ్నిపథ్ నియామకాలకు సోమవారం(నేడు) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప చెప్పారు. మొదటి బ్యాచ్‌లో 25,000 మందికి డిసెంబర్ మొదటి, రెండో వారాల్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పొన్నప్ప తెలియజేశారు. రెండో బ్యాచ్ అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దాదాపు 40,000 మందిని నియమించడానికి దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. నేవీలో మొదటి బ్యాచ్‌కు ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ అగ్నిపథ్ కింద నావికా దళంలో త్వరలో చేపట్టనున్న నియామకాల ప్రణాళిక గురించి వైస్ అడ్మిరల్ (పర్సనల్) దినేష్ త్రిపాఠి ప్రకటించారు. ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందన్నారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్లో ఎంపికైన మొదటి బ్యాచ్‌కు ఈ ఏడాది నవంబర్ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని తెలియజేశారు. అగ్నివీరులుగా యువకులను, యువతులను ఎంపిక చేస్తామని దినేష్ త్రిపాఠి ఉద్ఘాటించారు. ఐఏఎఫ్‌లో డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభం భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లో రిక్రూట్మెంట్ల గురించి ఎయిర్ మార్షల్ ఎస్.కె.ఝా వివరించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభమవుతుందని, మొదటి దశ ఆన్లైన్ పరీక్ష ప్రక్రియ జూలై 24 నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. ఐఏఎఫ్‌లో అగ్నిపథ్ కింద మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. -
పరివర్తన దశలో కశ్మీర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల అసహనం పెరుగుతోందని 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్(జీవోసీ) లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే అన్నారు. లోయలో ఉగ్రవాదం ఇదివరకటి ఆకర్షణ కోల్పోయిందనీ, ప్రస్తుతం పరిస్థితులు పరివర్తన దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. కశ్మీర్ యువత, ముఖ్యంగా 20–25 ఏళ్ల వారు హింసతో సాధించేదేమీ లేదన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. దీంతో, తాము చేస్తున్నది తప్పో, ఒప్పో తెలియని 16–19 ఏళ్ల టీనేజర్లను ఉగ్రవాదం ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. కొత్త రిక్రూట్మెంట్లు 2021లో మూడో వంతుకు అంటే, 142కు తగ్గి పోయాయని చెప్పారు. అక్రమ చొరబాట్లు తగ్గాయి. స్థానికుల సహకారంతో నిఘా వ్యవస్థ బలోపేతమైంది. ఫలితంగా గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 330 మంది ఉగ్రవాదులు హతం కావడమో, లొంగిపోవడమో జరిగిందన్నారు. గత 15 ఏళ్లలో ఇదే అత్యధికమని డీపీ పాండే విశ్లేషించారు. లోయలో మిగతా ఉగ్రవాదులకు కూడా సహకారం అందకుండా పోయే రోజు త్వరలోనే వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2021లో 151 మంది స్థానికులు, 20 మంది పాకిస్తానీయులు కలిపి మొత్తం 171 మంది ఉగ్రవాదులు హతం కాగా, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 10 మంది పాకిస్తానీయులతో కలిపి 45 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు గణాంకాలను వెల్లడించారు. గత ఏడాది 87 మంది ఉగ్రవాదులు, లొంగిపోవడమో, పట్టుబడటమో జరగ్గా ఈ ఏడాది 27 మంది పట్టుబడ్డారని లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే అన్నారు. -
ఉత్తరాఖండ్ గవర్నర్‌గా గుర్మీత్ సింగ్ ప్రమాణం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి, కేబినెట్ మంత్రులు సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్, అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ చంద్ అగర్వాల్, డీజీపీ అశోక్ కుమార్ ఇతర అధికారులు హాజరయ్యారు. ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్న బేబి రాణి మౌర్య ఇటీవల రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. గుర్మీత్ సింగ్ గతంలో భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్‌గా పని చేశారు. ప్రమాణ స్వీకార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి సైనికుడిగా సేవలందించాక, ఉత్తరాఖండ్‌కు గవర్నర్‌గా పని చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని అన్నారు. ఉత్తరాఖండ్‌లో దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఓ సైనికుడు ఉన్నాడని, అందుకే రాష్ట్రానికి వీరభూమి అనే పేరుందని అన్నారు. రిటైర్ అయిన సైనికులు, ప్రాణాలు కోల్పోయిన సైనికులు, వారిపై ఆధారపడిన వారికి కుటుంబాలకు సాయం అందించడం తన ప్రాధమ్యమని చెప్పారు. గవర్నర్ కార్యాలయం ద్వారా ప్రజల అంచనాలను పెంచుతానని వ్యాఖ్యానించారు. -
ప్రతి మహిళా ఒక సోల్జర్
నేషనల్ జియోగ్రాఫిక్ వాళ్లు ఢిల్లీలో నిన్న ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ను ప్రదర్శించారు. ఆ షో కి ఎన్.సి.సి. గర్ల్ కెడేట్స్, ఉమెన్ ఆఫీసర్స్ వచ్చారు. చీఫ్ గెస్ట్ లెఫ్టినెంట్ జనరల్ మాధురీ కణిట్కర్! షో అయ్యాక ‘‘హౌ ఈజ్ ది జోష్’’ అని అమ్మాయిల్ని అడిగారు. ‘‘ఓ..’’ అని నోటికి రెండు వైపులా చేతులు అడ్డుపెట్టి ఉత్సాహంగా అరిచారు అమ్మాయిలు. ‘‘మనలో ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ ఉంది. మల్టీ టాస్కింగ్ చేయగలం. ఆర్మీ మిమ్మల్ని ఉమన్‌గా కాదు, ఒక సోల్జర్ గా గుర్తిస్తుంది. అదే మనకు కావలసిన గుర్తింపు’’ అంటూ.. వాళ్ల జోష్ ను మరింతగా పెంచారు కణిట్కర్. మాధురీ కణిట్కర్ ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ జనరల్. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని ఎన్.సి.సి. ఆడిటోరియంలో శుక్రవారంనాడు ఎన్.సి.సి. గర్ల్ కెడెట్లు, ఎన్.సి.సి. ఉమెన్ ఆఫీసర్స్ హాజరైన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ప్రత్యేక అతిథిగా వెళ్లారు. ఆ ప్రత్యేక కార్యక్రమం ఓ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ వాళ్లు ఆర్మీలో చేరాలని అనుకుంటున్న అమ్మాయిల కోసం ఆ చిత్రాన్ని ప్రదర్శించారు. ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ అనే ఆ చిత్రం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మహిళాశక్తికి ఒక పవర్ ప్రెజెంటేషన్‌లా ఉంది. గర్ల్ కెడెట్స్ లీనమైపోయి చూస్తున్నారు. అప్పటికప్పుడు ఆర్మీలో చేరిపోయి తమ సత్తా ఏంటో చూపించాలన్నంతగా వారిని ఆ చిత్రం బందీని చేసింది. మాధురీ కణిట్కర్ కూడా వాళ్లతో కూర్చొని ఆ డాక్యుమెంటరీని చూశారు. చిత్రం పూర్తవగానే గర్ల్ కెడెట్స్ అరుపులు, చప్పట్లు! ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ స్క్రీనింగ్ కార్యక్రమంలో మాధురీ కణిట్కర్ అప్పుడు అడిగారు మాధరి.. ‘హవ్వీజ్ ద జోష్?’ అని! ‘సూపర్బ్‌గా ఉంది మేడమ్’ అన్నారు అమ్మాయిలు. ‘‘కానీ ఆర్మీలో ఉద్యోగం బెడ్ ఆఫ్ రోజెస్ కాదు’’ అన్నారు మాధురి. ఆ మాటకు కొంచెం నిరుత్సాహం. ‘‘అయితే ఆర్మీ మిమ్మల్ని ఒక శక్తిగా మలుస్తుంది’’ అని కూడా అన్నారు మాధురి. నిరుత్సాహం స్థానంలో మళ్లీ ఉత్సాహం! అప్పుడిక ఆమె భారత సైన్యంలో తన ప్రయాణం ఎలా ఆరంభమైందీ చెప్పడం మొదలు పెట్టారు. మాధురి ఆర్మీలోకి వచ్చేటప్పటికి మహిళా అధికారులు సంప్రదాయ వస్త్రధారణ అయిన చీరలో కనిపించారు! క్రమంగా యూనిఫామ్‌లోకి మారిపోయారు. 37 ఏళ్లుగా ఆర్మీలో ఉన్నారు మాధురి. ఆర్మీలోని మెడికల్ విభాగంలో ఆఫీసర్ తను. లెఫ్ట్‌నెంట్‌గా చేరి లెఫ్ట్‌నెంట్ జనరల్ ర్యాంకుకు చేరుకున్నారు. ఆర్మీలో పైనుంచి మూడో ర్యాంకే లెఫ్టినెంట్ జనరల్. (మొదటి ర్యాంక్ ఫీల్డ్ మార్షరల్. రెండో ర్యాక్ జనరల్). ఆర్మీలో తన వైద్య సేవలకు అతి విశిష్ట సేవామెడల్, విశిష్ట సేవామెడల్ కూడా పొందారు. ∙∙ నేషనల్ జియోగ్రాఫిక్ షోకి ఆమె ఆర్మీ దుస్తుల్లోనే వచ్చారు మాధురీ కణిట్కర్. ‘‘ఆర్మీలో చేరాక మీరు స్త్రీనో, పురుషుడో కాదు. ఒక సోల్జర్ మాత్రమే. స్త్రీ అనే గుర్తింపు కన్నా, సోల్జర్ అనే గుర్తింపే మనకు ముఖ్యం. ఆర్మీలో చేరక ముందు కూడా మనం సోల్జరే. స్త్రీలో సహజంగానే సైనిక శక్తి ఉంటుంది కనుక’’ అని మాధురి చెప్పడం కెడెట్ గర్ల్స్‌కి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్.సి.సి.లో కొత్తగా జాయిన్ అయినవాళ్లే వాళ్లంతా. ‘‘సోల్జర్‌కి జెండర్ ఉండదు. అది మన మైండ్‌లో ఉంటుంది. మహిళల జెండర్ వారిలో పవర్ మాత్రమే’’ అని మాధురి చెప్పడం కూడా ఆ పిల్లల్ని బాగా ఆకట్టుకుంది. ఒక ఆర్మీ పర్సన్ మాటలు ఎంతలా పని చేస్తాయంటే.. అది ఆర్మీ గొప్పతనమే అనాలి. ఆర్మీలో చేరిన ప్రతి వ్యక్తినీ అలా తీర్చిదిద్దుతుంది ఆర్మీ. సమాజంలో స్ఫూర్తిని నింపేలా. ‘‘అమ్మాయిలూ మీకొక మాట చెప్తాను వినండి. మనకు అదనంగా ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ ఉంది. అది మన చేత మల్టీ టాస్కింగ్ చేయిస్తుంది. లక్ష్యం కోసం పరుగులు తీయిస్తుంది. కలల్ని నిజం చేసుకుని శక్తిని ఇస్తుంది. ఏ ఉద్యోగంలోనైనా మనకు ఛాలెంజింగ్ ఏమిటంటే.. ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడం. అది సాధ్యమైతే మనకు ఏదైనా సాధ్యమే. ఉద్యోగానికి ఇల్లు, ఇంటికి ఉద్యోగం అడ్డుపడవు. నన్నే చూడండి. నా భర్త కూడా ఆర్మీలోనే చేసేవారు. ఇద్దరం ఆర్మీలోనే ఉన్నా 24 ఏళ్ల పాటు ఒకేచోట లేము. కానీ ఆర్మీ మాకు సపోర్ట్‌గా ఉంది. ఇద్దరం ఒకచోట లేకున్నా ఇద్దరం ఆర్మీలోనే ఉన్నామన్న భావనను ఆర్మీనే మాకు కలిగించింది. మహిళలకు సురక్షితమైన ఉద్యోగరంగం ఆర్మీ అని చెప్పగలను’’ అని మాధురి తన అనుభవాలు కొన్ని చెప్పారు. ‘‘ఉమన్‌లో ఆర్మీ పవర్ ఉంది. ఆర్మీకి ఉమన్ పవర్ అవసరం ఉంది’’ అని చివర్లో మాధురీ కణిట్కర్ అన్నమాట.. అమ్మాయిలకు డాక్యుమెంటరీ ఎంత జోష్ని ఇచ్చిందో అంతే జోష్‌ను ఇచ్చి ఉండాలి. వారంతా నోటికి రెండు చేతులూ అడ్టుపెట్టుకుని కోరస్‌గా మళ్లొకసారి ‘ఓ’ అని ఉల్లాసంగా చప్పట్లు చరిచారు. -
రణరంగంలో డ్రోన్లదే ప్రాధాన్యత
వాస్తవాధీన రేఖవద్ద భారత్, చైనాలు గణనీయ సంఖ్యలో శతఘ్నులను మోహరించాయి. టి–72, టి–90 భారీ ట్యాంకులు వాడుతున్న భారత్, తేలికపాటి టైప్ 15 ట్యాంకులు వాడుతున్న చైనా తమ శతఘ్నులే గొప్పవని ప్రకటించుకుంటూ ఉన్నాయి కానీ ఆధునిక యుద్ధతంత్రంలో శతఘ్నులపై మానవరహిత డ్రోన్లు స్పష్టంగా ఆధిపత్యం చలాయించనున్నాయి. ఈ నేపథ్యంలో సైనిక వ్యూహాలను, ఎత్తుగడలను మార్చుకుని మానవరహిత గగనతల దాడుల వ్యవస్థలను మనం తప్పక పొందగలగాలి. ఆధునిక యుద్ధతంత్రంలో శతఘ్నులపై డ్రోన్ల ఆధిక్యతను గుర్తించి తీరాలి. నేడు యుద్ధరంగం నుంచి శతఘ్నులను పూర్తిగా రద్దు చేయడం ఎలా సాధ్యంకాదో, భారీ యుద్ధ ట్యాంకులు పరస్పరం తలపడే శకం అంతరించిపోనుందనే వాదనకు కూడా తర్కబద్ధత ఉందని గ్రహించాలి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనాలు గణనీయమైన సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించాయి. భారీ పరిమాణంలో ఉండే భారత్‌కు చెందిన టి–72, టి–90 ట్యాంకులు.. చైనాకు చెందిన టైప్ 15 తేలికపాటి ట్యాంకులను ఎదుర్కోనున్నాయి. ఇరుపక్షాలూ తమదే ఆధిక్యత అని చెప్పుకుంటున్నాయి. అయితే ఇవన్నీ ఒక విస్తృతాంశాన్ని పట్టించుకోవడం లేదు. అదేమిటంటే ఈరోజు ఒక యుద్ధ ట్యాంకుకు అసలు ప్రమాదం శత్రు ట్యాంకు వల్ల కాదు.. గగనతలం నుంచి కలుగుతోందని మనం మర్చిపోకూడదు. ప్రత్యేకించి బహిరంగంగా ఉండే వాస్తవాధీన రేఖలోని బంజరు భూముల వల్ల యుద్ధ ట్యాంకులు ప్రమాదంలో పడనున్నాయి. ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య ఇటీవల జరిగిన సమరం భారత మీడియా దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోయింది. కానీ ఆ ఘటన సైనిక వర్గాలను విశేషంగా ఆకట్టుకుంది. వివాదాస్పదమైన నగోర్నో–కరబక్ ప్రాంతంలో యుద్ధం చెలరేగడంతో డ్రోన్లు, కచ్చితంగా లక్ష్యాన్ని కొట్టే ఫిరంగులు దాడుల్లో ధ్వంసమవుతున్న వీడియో ఫుటేజీని ఇరు పక్షాలు ప్రదర్శించాయి. అజర్బైజాన్ సైన్యం అటు నిఘా, ఇటు దాడులు రెండింటినీ నిర్వహించే డ్రోన్లను వరుసగా మోహరించింది. ఆర్మేనియా సైతం కమికేజ్ అని పిలుస్తున్న డ్రోన్లను యుద్ధరంగంలో మోహరించింది. ఇవి యుద్ధ ట్యాంకులు వంటి లక్ష్యాలపై గురిపెట్టి వాటిని ధ్వంసం చేస్తాయి. గత కొన్నేళ్లుగా బాకూ ప్రాంతంలో విస్తృత సంఖ్యలో కనిపించిన ఇజ్రాయెల్, టర్కీ దేశాలకు చెందిన డ్రోన్లను ఈ యుద్ధంలో మోహరించారు. ఈ పోరాటంలో వందలాది యుద్ధ ట్యాంకులు, ఎయిర్ డిఫెన్స్ లాంఛర్లు, ఫిరంగులు, ఇతర సైనిక సామగ్రిని తాము నేలకూల్చామని ఇరుపక్షాలూ ప్రకటించుకున్నాయి. ఈ లెక్కలు ఎంత కచ్చితంగా ఉన్నాయని తేల్చడం కష్టమే కానీ, ఈ యుద్ధంలో డ్రోన్లు కీలకపాత్ర వహించాయనడంలో సందేహమే లేదు. తాము శత్రువుకు చెందిన 107 డ్రోన్లను కూల్చివేశామని ఆర్మేనియా రక్షణ శాఖ మంత్రి ప్రకటించడంబట్టి ఆ పోరాటంలో డ్రోన్లు ఎంత విస్తృతంగా ప్రయోగించారో సూచిస్తుంది. ఈ రెండు దేశాల మధ్య నగోర్నో–కరబక్ ప్రాంతంలో డ్రోన్, యుద్ధట్యాంకుల మధ్య పోరు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరిలో 33 మంది టర్కీ సైనికులు ఉత్తర సిరియాలో సిరియా సైన్యం జరిపిన గగనతల దాడిలో మరణించారు. దీనికి ప్రతీకారంగా టర్కీ ప్రధానంగా డ్రోన్ ప్రయోగించిన క్షిపణులు, అత్యాధునికమైన ఫిరంగులతో ప్రతిదాడులను కొనసాగించింది. మూడు రోజుల పాటు సాగిన ఈ పోరాటంలో 100 సాయుధ శకటాలను నేలకూల్చామని, 2 వేలమంది సైనికులను హతమార్చామని టర్కీ ప్రకటించుకుంది. టర్కీ చేసిన ఎదురుదాడిలో బైరాక్తర్– టిబి, అంకా–ఎస్ డ్రోన్ సిస్టమ్స్ ముందువరుసలో నిలిచి తలపడ్డాయి. ఎమ్‌ఏఎమ్–సి, ఎమ్‌ఏఎమ్–ఎల్ అనే భారీ పేలుడు పదార్థాన్ని, లేజర్ ద్వారా లక్ష్యాలను ఛేదించేలా రూపొందించిన రాకెట్లను ఈ డ్రోన్లు మోసుకుపోయాయి. దీర్ఘశ్రేణి ఫిరంగి, రాకెట్ సిస్టమ్‌ల ద్వారా అత్యంత నిర్దిష్టంగా కదిలే టార్గెట్లను గుర్తించడానికి నిఘా డ్రోన్లు ఉపయోగపడతాయి. యుద్ధరంగానికి అతి దూరం నుంచి జరిగే ఈ యుద్ధానికి కోరల్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ అండదండగా నిలిచింది. ఇవి నిజానికి సిరియా గగనతల రక్షణ రాడార్ నెట్వర్క్ని స్తంభింపజేయడమే కాకుండా, డ్రోన్ లను కూల్చివేయడంలో కూడా అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఈ రెండు ఘర్షణలు యుద్ధతంత్రానికి చెందిన భవిష్యత్ చిత్రపటాన్ని సూచనామాత్రంగా అందించాయి. అంతేకాకుండా నేటి యుద్ధరంగంలో యుద్ధ ట్యాంకుల అవసరం, వాటి సామర్థ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫోర్స్ డిజైన్ 2030 గురించి అమెరికన్ మెరైన్ కార్ప్స్ ఒక కీలక ప్రకటన చేస్తూ తమవద్ద ఉన్న యుద్ధ ట్యాంకులన్నింటినీ క్రమంగా వదులుకుంటామని తెలిపింది. మెరైన్ కార్ప్స్ అనేది ఒక నిర్దిష్ట దండయాత్రలు చేయడానికి ఉద్దేశించబడినది కాబట్టి దాన్ని తక్కువ బలగంతోనే నడపాల్సి ఉంటుంది. కాబట్టి యుద్ధరంగం నుంచి ట్యాంకులను పూర్తిగా రద్దు చేయడం అంటే అపరిపక్వతే అవుతుంది. అయితే ఈ వాదనకు బలమున్నప్పటికీ, భారీ యుద్ధట్యాంకులు పరస్పరం తలపడి విధ్వంసం చేసుకునే శకం అంతరించిపోయిందనే వాదనకు కూడా తగిన ప్రాతిపదిక ఉందనే చెప్పాలి. ఇక భారత్, చైనా యుద్ధ ట్యాంకుల విషయానికి వస్తే ఎల్తైన ప్రాంతాల్లో జరిగే సైనిక చర్యలకు తమ తేలికపాటి యుద్ధ ట్యాంక్ కచ్చితంగా సరిపోతుందని చైనా వాదిస్తోంది. కాగా ఒక మీడియా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ట్యాంకులతో ముడిపడిన యుద్ధంలో.. మన టి–90, టి–72 ట్యాంకుల ధాటికి చైనా తేలికపాటి ట్యాంకులు ఏమాత్రం తట్టుకోలేవని కచ్చితంగా చెప్పగలను’ అని భారతీయ శతఘ్ని దళ కమాండర్ పేర్కొన్నారు. ముందే చెప్పినట్లుగా ఈ రెండు వాదనలు ఒక విస్తృత అంశాన్ని దాటవేస్తున్నాయి. ఈరోజు ఒక శతఘ్నికి మరో శత్రు శతఘ్ని ప్రమాదకరం కాదు. గగనతల దాడితోనే వాటికి అసలు ప్రమాదం ఉంది. ప్రత్యేకించి బహిరంగ స్థలాల్లో, బీడు భూముల్లో, మొక్కలు కూడా పెరగని వాస్తవాధీన రేఖ పొడవునా ఉన్న ప్రాంతాల్లో ఇది మరింతగా వర్తిస్తుంది. చైనా సైన్యం అధునాతనమైన మానవరహిత ఏరియల్ వాహనాలను (యూఏవీ), మానవరహిత కంబాట్ ఏరియల్ వాహనాలను (యూసీఏవీ) పెద్ద సంఖ్యలో కలిగి ఉంది. 2019 చైనా జాతీయ దినోత్సవం పెరేడ్ సందర్భంగా జిజె–11 స్టెల్త్ డ్రోన్‌తో సహా ఎల్తైన ప్రాంతాల్లో దీర్ఘకాలం మనగలిగే మధ్యశ్రేణి యూఏవీలు, యూసీఏవీలను చైనా ప్రదర్శించింది. చైనా ప్రజావిముక్తి సైన్యంకి 20 రకాల సైనిక్ డ్రోన్లు అందుబాటులో ఉన్నాయని అంచనా. అలాగే పీఎల్ఏ ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రంలో కూడా భారీగా పెట్టుబడి పెట్టింది. 2016లో స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్‌కి చెందిన నెట్వర్క్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒకే సంస్థాగత ఛత్రం కింద సైబర్, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాన్ని మిళితం చేసింది. గగనతలాన్ని రక్షించే రాడార్లతోసహా ఫైర్ సపోర్ట్ నెట్వర్క్ కమాండ్, కంట్రోల్‌ని సైబర్, ఎలక్ట్రానిక్ దాడులు నిర్వీర్యం చేస్తాయి. ఈ తరహా యుద్ధపరిస్థితుల్లో, శతఘ్నుల వంటి ఆయుధ వ్యవస్థలు మరింతగా మనగలిగే పద్ధతులకు అలవడాలి. దీనికి ఎత్తుగడల్లో మార్పు, వివిధ సామర్థ్యతా రకాలతో గొప్పగా మిళితం కావడం అవసరం. నేటి యుద్ధ రంగంలో సెన్సర్ల ఉనికి భారీగా ఉండటంతో ఏ ఆయుధ వ్యవస్థను కూడా దాచి ఉంచడం అసాధ్యం. శతఘ్నులు ఇప్పుడు ఎలక్ట్రానికి వార్ఫేర్ విభాగాలతో కూడి నిత్యం స్థానం మార్చుకుంటూ ఉండాలి. అప్పుడే అవి స్వల్పకాలిక గగన తల రక్షణ విభాగాలను, ఏరియల్ ప్లాట్‌ఫామ్‌లను అడ్డుకోగలవు. ఈ తరహా యుద్ధాలలో మనం ఆత్మరక్షణ ధోరణితో పోరాడలేం. కాబట్టే మానవరహిత గగనతల దాడుల వ్యవస్థలను తప్పక పొందగలగాలి. డ్రోన్ లపై దాడిచేయడానికి పరిమితులు, ఈ తరహా వ్యవస్థలకు అయ్యే భారీ వ్యయం గురించి భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇటీవలే ఒక ఇంట ర్వ్యూలో తెలిపారు కూడా. దాదాపు 3 బిలియన్ డాలర్ల వ్యయంతో అమెరికా నుంచి 20 అధునాతన ఎమ్క్యూ–9 యూఏవీల కొనుగోలుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రతి సైనిక సామగ్రికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇప్పుడు సాయుధ వ్యవస్థల సమ్మేళనం కారణంగా ప్రత్యేకించి కొన్ని ఆయుధాల కంటే సైనిక సామగ్రి మొత్తానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఖర్చుకు సంబంధించి చూస్తే మనం తెలివిగా ఎంచుకోవలసి ఉంది. అమెరికా వాయుసేనతో కలిసి ఇప్పుడు క్రాటోస్ ఎక్స్‌క్యూ–58ఎ వల్క్రియే స్టెల్త్ డ్రోన్ అభివృద్ధికి భారత సైన్యం ప్రయత్నిస్తో్తంది. 4 వేల కిలోమీటర్ల దూర శ్రేణిని కలిగి 250 కేజీల వెపన్ పేలోడ్ కలిగిన ఈ వల్క్రియే డ్రోన్‌కు 2 మిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వస్తోంది. అంటే ఒక రఫేల్ యుద్ధవిమానానికి అయ్యే ఖర్చుతో 50 డ్రోన్లను కొనుగోలు చేయవచ్చన్నమాట. గార్నో–కరబాక్ ప్రాంతంలో జరిగిన సైనిక ఘర్షణ తక్కువ విస్తృతి కలిగిందే కావచ్చు కానీ అది భవిష్యత్తు యుద్ధ పౌరాటాలకు సంకేతాలు వెలువరిస్తోంది. గగనతల శక్తి వ్యవస్థలను మోహరించడంలో జర్మనీ సైన్యానికి స్పానిష్ అంతర్యుద్దం (1936–39) అనేక పాఠాలు నేర్పించింది. వీటినే జర్మనీ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రదర్శించింది. భారత సైన్యం ప్రస్తుతానికి సాంప్రదాయిక మైన శతఘ్నులు, విమానాలు వంటి ఆయుధాలపై అధికంగా వెచ్చిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు ఇక అంతరించిపోతాయని నేను చెప్పడం లేదు. కానీ ఇప్పుడు మనకు అత్యాధునిక టెక్నాలజీలను తప్పక స్వీకరించాల్సి ఉంది. లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా వ్యాసకర్త మాజీ నార్తర్న్ ఆర్మీ కమాండర్ రిటైర్డ్ -
చైనా బలగాలు వెనుదిరగాలి
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్, చైనాల మధ్య రెండో విడత లెఫ్ట్‌నెంట్ జనరల్ స్థాయి చర్చలు సోమవారం జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని చూశుల్ సెక్టార్లో చైనా భూభాగంలోని మోల్డో వద్ద ఉదయం 11.30 గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. జూన్ 6న జరిగిన తొలి విడత చర్చల్లో కుదిరిన ఒప్పందాల అమలు సహా ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పెరిగేందుకు చేపట్టాల్సిన పలు చర్యలపై ఈ భేటీలో చర్చించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అలాగే, అన్ని ప్రాంతాల నుంచి మే 4 నాటి యథాతథ స్థితికి చైనా బలగాలు వెనుదిరగాలని భారత్ డిమాండ్ చేసిందని వెల్లడించాయి. ఏ రోజు నాటికి వెనక్కు వెళ్తారో వివరిస్తూ.. టైమ్‌లైన్ కూడా చెప్పాలని భారత్ కోరినట్లు తెలిపాయి. అయితే, ఆ భేటీలో గల్వాన్ ఘర్షణల అంశం చర్చించారా? లేదా అనే విషయంపై స్పష్టత లేదన్నాయి. ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కారŠప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా బృందానికి టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నేతృత్వం వహించారు. దళాల ఉపసంహరణకు విధి విధానాలను రూపొందించే దిశగా చర్చలు జరిగినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గల్వాన్ లోయ సహా అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని జూన్ 6న ఇదే ప్రదేశంలో జరిగిన చర్చల్లో ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే, ఆ తరువాత జూన్ 15న గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల మధ్య తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు జరిగి, భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఆ ఘర్షణల్లో కల్నల్ సహా 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తమ సైనికుల మరణాలపై చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ 35 మంది చైనా సైనికులు చనిపోయారని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. తాజాగా, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ స్థాయి అధికారి ఆ ఘర్షణల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ సమీక్ష మరోవైపు, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న క్షేత్ర స్థాయి పరిస్థితులపై సోమవారం జరిగిన సదస్సులో ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా సైన్యం కదలికలు, భారత సైన్య సన్నద్ధతపై చర్చించారు. రెండు రోజుల పాటు ఈ సదస్స కొనసాగనుంది. ఈ సందర్భంగా లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో సరిహద్దుల వెంట భారత సైన్యం సన్నద్ధతపై సమగ్ర సమీక్ష జరిపారు. ఆ సమాచారం తెలియదు: చైనా గల్వాన్ లోయలో చోటు చేసుకున్న జూన్ 15 నాటి ఘర్షణల్లో భారత సైనికుల చేతిలో 40 మంది చైనా జవాన్లు చనిపోయారని కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు చైనా నిరాకరించింది. ఆ సమాచారం తమ వద్ద లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ సోమవారం మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. భారత్‌లో సరిహద్దు వివాద పరిష్కారానికి దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని మరోసారి చెప్పారు. -
రక్షణ దళానికి త్రీస్టార్ డాక్టర్
డాక్టర్ మాధురీ కణిట్కర్ శనివారం న్యూఢిల్లీలో పదోన్నతిపై లెఫ్ట్‌నెంట్ జనరల్ బాధ్యతలు స్వీకరించగానే ఆమె భుజం మీదకు భారత సైన్యంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు నక్షత్రాల గుర్తు వచ్చి వాలింది. రక్షణ దళాల వైద్య సిబ్బందికి కొత్త డిప్యూటీ చీఫ్ ఇప్పుడు ఆమె! భారత రక్షణ దళాల చరిత్రలో ఇంతవరకు ఇద్దరే మహిళా లెఫ్ట్‌నెంట్ జనరల్స్. మాధురి ఇప్పుడు మూడో జనరల్ కాగా.. మాధురి, ఆమె భర్త త్రీస్టార్ ఉన్న తొలి దంపతులుగా ఇక నుంచీ గుర్తింపు పొందుతారు. మిలటరీ రంగు చీర, జాకెట్, పైన ఆర్మీ క్యాంప్ ధరించి ఉన్న మాధురికి సైనిక దళ వైద్య సేవల (ఎ.ఎఫ్.ఎం.ఎస్) డైరెక్టర్ జనరల్ లెఫ్ట్‌నెంట్ అరూప్ బెనర్జీ భుజకీర్తులను తగిలిస్తున్నప్పుడు, పక్కనే ఉన్న మాధురి భర్త రాజీవ్ కణిక్టర్ కూడా ఆమె‘ఎపలెట్స్’ (భుజంపై ప్రతిష్ట చిహ్నాలు)ని ఎంతో గర్వంగా సవరించారు. ముందు డీజీకి అభివాదం తెలియజేసి, ఆ వెంటనే ‘థ్యాంక్యూ సర్’ అని భర్తతో అన్నారు డాక్టర్ మాధురి. రాజీవ్ కూడా సైనికాధికారే. ‘ఆర్మ్డ్ కోర్స్’ లో లెఫ్ట్‌నెంట్‌గా ఉండి, 2017 లో క్వార్టర్‌మాస్టర్ జనరల్‌గా త్రీ–స్టార్ హోదాలో రిటైర్ అయ్యారు. ఇప్పుడు డాక్టర్ మాధురికి కూడా త్రీస్టార్ రావడంతో భారత రక్షణ దళంలోనే తొలి త్రీస్టార్ కపుల్‌గా ఈ భార్యాభర్తలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇందుకు దక్కవలసిన అభినందనలు పూర్తిగా మాధురికే అయినప్పటికీ, ‘‘ఉద్యోగం కష్టంగా అనిపించిన పరిస్థితుల్లో.. ‘ఇలాంటప్పుడు చేసేదే ఉద్యోగం’ అని ధైర్యం చెప్పి ఆర్మీలోంచి నన్ను బయటికి రానివ్వకుండా ఆపిన నా భర్తదే ఈ క్రెడిట్ అంతా’’ అని నవ్వుతూ అన్నారు డాక్టర్ మాధురి. త్రివిధ దళాల ‘నాడీ’మణి ఎంబీబిఎస్లో గోల్డ్ మెడల్ పెళ్లయిన 36 ఏళ్లలో 12 ఏళ్లు మాత్రమే భార్యాభర్తలుగా ఉన్నారు డాక్టర్ మాధురి, రాజీవ్. మిగతా సమయమంతా భారత సైనికులుగానే ఉన్నారు. రక్షణ దళ ఉద్యోగాల్లో శిక్షణ తీసుకుంటున్నప్పటి నుంచే ఒకరిని మించిన వారొకరిగా ఉన్నారు వీళ్లు! నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి రాష్ట్రపతి గోల్డ్ మెడల్‌తో బయటికి వచ్చారు రాజీవ్. మాధురి కూడా అంతే. పుణెలోని ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్’లో బెస్ట్ ఎం.బి.బి.ఎస్. స్టూడెంట్‌గా రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. తర్వాత అదే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీకి డీన్, డిప్యూటీ కమాండెంట్ అయ్యారు. అలా అయిన తొలి మహిళా అధికారి కూడా ఆమే! శనివారం నాటి పదోన్నతితో రక్షణ దళాల్లోని లెఫ్ట్‌నెంట్ జనరల్ ర్యాంకుకు చేరిన మూడో మహిళా అధికారి అయ్యారు మాధురి. తొలి మహిళ ఎయిర్ మార్షల్ పద్మావతీ బందోపాధ్యాయ్, రెండో మహిళ వైస్ అడ్మిరల్ పునీతా ఆరోరా. వాళ్లిద్దరూ రిటైర్ అయ్యారు. సైన్యంలోని అన్ని విభాగాలలో స్త్రీ పురుష సమానత్వాన్ని కల్పించడానికి ‘పర్మినెంట్ కమిషన్’లోకి మహిళల్ని కూడా అనుమతించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కానీ.. భారత సైన్యంలోని మెడికల్ వింగ్‌లో మొదటి నుంచీ మహిళలకు పర్మినెంట్ కమిషన్‌లో అవకాశం ఉంది. అందువల్లే డాక్టర్ మాధురి విశిష్ట సేవలకు ఇప్పుడీ ఉన్నతస్థాయి హోదా లభించడం సాధ్యమైంది. సైకిల్‌పై షికారు పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మాధురి 1982లో ‘ఆర్మీ మెడికల్ కోర్స్’ (సైనిక వైద్య దళం)లోకి వచ్చారు. ఎం.డి. చేశాక, ఎయిమ్స్‌లో పీడియాట్రిక్ నెఫ్రాలజీ (చిన్నపిల్లల మూత్రపిండ సమస్యలు)లో శిక్షణ పొందారు. ‘ప్రధానమంత్రి శాస్త్ర సాంకేతిక రంగాల వినూత్న ఆవిష్కరణల సలహా మండలి’లో సభ్యులుగా ఉన్నారు. తాజా విధుల్లోకి రాకముందు వరకు ఆర్మీలోని నార్తర్న్ కమాండ్(జమ్మూకశ్మీర్, లఢక్) వైద్యసేవల విభాగానికి అధికారిగా ఉన్నారు. ‘‘అక్కడ పని చేస్తున్నప్పుడు యుద్ధక్షేత్రంలోని ప్రతికూల పరిస్థితుల్లో వైద్య సంరక్షణ ఎంత కీలకమైన బాధ్యతో తెలిసింది. అక్కడ ఏ రోజుకారోజు స్పష్టమైన అత్యున్నతస్థాయి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా పని చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ అనుభవం ఉపయోపడుతుంది’’ అని డాక్టర్ మాధురి అన్నారు. మాధురి కణిట్కర్ కర్ణాటకలోని ధర్వార్లో జన్మించారు. తండ్రి చంద్రకాంత్ గోపాల్రావ్, తల్లి హేమలతా చంద్రకాంత్ ఖోట్. కణిట్కర్ దంపతులకు 1982లో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. నిఖిల్, విభూతి. -
అరుదైన ఘనత సాధించిన మాధురి కనిత్కర్
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు నాలుగు దశాబ్ధాలపాటు ఇండియన్ ఆర్మీలో పనిచేసిన మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ అరుదైన ఘనత సాధించారు. పదోన్నతిలో భాగంగా సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ హోదా పొందిన మూడవ మహిళగా గుర్తింపుపొందారు. అదే సమయంలో ఆర్మీలో రెండవ అత్యున్నత పదవిని సాధించిన మొదటి మహిళా పీడియాట్రిషియన్‌గా ఘనత సాధించారు. మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద నియమించబడ్డారు. ఇది కేటాయించిన బడ్జెట్ వినియోగాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉమ్మడి ప్రణాళిక, సమైక్యత ద్వారా సేవల సేకరణ, శిక్షణ కార్యకలాపాలలో మరింత కృషి చేయనున్నారు. పూణే సాయుధ దళాల మెడికల్ కాలేజీ మాజీ డీన్ మేజర్ జనరల్ మాధురి కనిత్కర్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయానికి పంపారు. మేజర్ జనరల్ మాధురి కనిత్కర్, లెఫ్టినెంట్ జనరల్ అయిన ఆమె భర్త రాజీవ్ సాయుధ దళాలలో ర్యాంకు సాధించిన మొదటి జంటగా గుర్తింపు పొందారు. చదవండి: ‘నమస్తే ట్రంప్; నేను ఎగ్జయిట్ కాలేదు’ -
సీఐఎస్సీగా లెఫ్ట్‌నెంట్ జనరల్ దువా
సర్జికల్ దాడుల వ్యూహంలో కీలక పాత్ర న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో చేపట్టిన సర్జికల్ దాడుల ప్రణాళికలో కీలకపాత్ర పోషించిన లెఫ్ట్‌నెంట్ జనరల్ సతీశ్ దువా చైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీలో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (సీఐఎస్సీ)గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉగ్రవాద నిరోధక నిపుణుడిగా పేరుగాంచిన దువా ఈ సందర్భంగా త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దువా ఈ పదవిలోకి రాకముందు ఆర్మీలో వ్యూహాత్మకమైన చీనార్ కోర్లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.