వాస్తవాధీన రేఖవద్ద భారత్, చైనాలు గణనీయ సంఖ్యలో శతఘ్నులను మోహరించాయి. టి–72, టి–90 భారీ ట్యాంకులు వాడుతున్న భారత్, తేలికపాటి టైప్ 15 ట్యాంకులు వాడుతున్న చైనా తమ శతఘ్నులే గొప్పవని ప్రకటించుకుంటూ ఉన్నాయి కానీ ఆధునిక యుద్ధతంత్రంలో శతఘ్నులపై మానవరహిత డ్రోన్‌లు స్పష్టంగా ఆధిపత్యం చలాయించనున్నాయి. ఈ నేపథ్యంలో సైనిక వ్యూహాలను, ఎత్తుగడలను మార్చుకుని మానవరహిత గగనతల దాడుల వ్యవస్థలను మనం తప్పక పొందగలగాలి. ఆధునిక యుద్ధతంత్రంలో శతఘ్నులపై డ్రోన్‌ల ఆధిక్యతను గుర్తించి తీరాలి. నేడు యుద్ధరంగం నుంచి శతఘ్నులను పూర్తిగా రద్దు చేయడం ఎలా సాధ్యంకాదో, భారీ యుద్ధ ట్యాంకులు పరస్పరం తలపడే శకం అంతరించిపోనుందనే వాదనకు కూడా తర్కబద్ధత ఉందని గ్రహించాలి.
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనాలు గణనీయమైన సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించాయి. భారీ పరిమాణంలో ఉండే భారత్‌కు చెందిన టి–72, టి–90 ట్యాంకులు.. చైనాకు చెందిన టైప్ 15 తేలికపాటి ట్యాంకులను ఎదుర్కోనున్నాయి. ఇరుపక్షాలూ తమదే ఆధిక్యత అని చెప్పుకుంటున్నాయి. అయితే ఇవన్నీ ఒక విస్తృతాంశాన్ని పట్టించుకోవడం లేదు. అదేమిటంటే ఈరోజు ఒక యుద్ధ ట్యాంకుకు అసలు ప్రమాదం శత్రు ట్యాంకు వల్ల కాదు.. గగనతలం నుంచి కలుగుతోందని మనం మర్చిపోకూడదు. ప్రత్యేకించి బహిరంగంగా ఉండే వాస్తవాధీన రేఖలోని బంజరు భూముల వల్ల యుద్ధ ట్యాంకులు ప్రమాదంలో పడనున్నాయి.
ఆర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య ఇటీవల జరిగిన సమరం భారత మీడియా దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోయింది. కానీ ఆ ఘటన సైనిక వర్గాలను విశేషంగా ఆకట్టుకుంది. వివాదాస్పదమైన నగోర్నో–కరబక్ ప్రాంతంలో యుద్ధం చెలరేగడంతో డ్రోన్‌లు, కచ్చితంగా లక్ష్యాన్ని కొట్టే ఫిరంగులు దాడుల్లో ధ్వంసమవుతున్న వీడియో ఫుటేజీని ఇరు పక్షాలు ప్రదర్శించాయి. అజర్‌బైజాన్ సైన్యం అటు నిఘా, ఇటు దాడులు రెండింటినీ నిర్వహించే డ్రోన్‌లను వరుసగా మోహరించింది. ఆర్మేనియా సైతం కమికేజ్ అని పిలుస్తున్న డ్రోన్‌లను యుద్ధరంగంలో మోహరించింది. ఇవి యుద్ధ ట్యాంకులు వంటి లక్ష్యాలపై గురిపెట్టి వాటిని ధ్వంసం చేస్తాయి. గత కొన్నేళ్లుగా బాకూ ప్రాంతంలో విస్తృత సంఖ్యలో కనిపించిన ఇజ్రాయెల్, టర్కీ దేశాలకు చెందిన డ్రోన్‌లను ఈ యుద్ధంలో మోహరించారు.
ఈ పోరాటంలో వందలాది యుద్ధ ట్యాంకులు, ఎయిర్ డిఫెన్స్ లాంఛర్లు, ఫిరంగులు, ఇతర సైనిక సామగ్రిని తాము నేలకూల్చామని ఇరుపక్షాలూ ప్రకటించుకున్నాయి. ఈ లెక్కలు ఎంత కచ్చితంగా ఉన్నాయని తేల్చడం కష్టమే కానీ, ఈ యుద్ధంలో డ్రోన్‌లు కీలకపాత్ర వహించాయనడంలో సందేహమే లేదు. తాము శత్రువుకు చెందిన 107 డ్రోన్‌లను కూల్చివేశామని ఆర్మేనియా రక్షణ శాఖ మంత్రి ప్రకటించడంబట్టి ఆ పోరాటంలో డ్రోన్‌లు ఎంత విస్తృతంగా ప్రయోగించారో సూచిస్తుంది. ఈ రెండు దేశాల మధ్య నగోర్నో–కరబక్ ప్రాంతంలో డ్రోన్, యుద్ధట్యాంకుల మధ్య పోరు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరిలో 33 మంది టర్కీ సైనికులు ఉత్తర సిరియాలో సిరియా సైన్యం జరిపిన గగనతల దాడిలో మరణించారు. దీనికి ప్రతీకారంగా టర్కీ ప్రధానంగా డ్రోన్ ప్రయోగించిన క్షిపణులు, అత్యాధునికమైన ఫిరంగులతో ప్రతిదాడులను కొనసాగించింది. మూడు రోజుల పాటు సాగిన ఈ పోరాటంలో 100 సాయుధ శకటాలను నేలకూల్చామని, 2 వేలమంది సైనికులను హతమార్చామని టర్కీ ప్రకటించుకుంది.
టర్కీ చేసిన ఎదురుదాడిలో బైరాక్తర్– టిబి, అంకా–ఎస్ డ్రోన్ సిస్టమ్స్ ముందువరుసలో నిలిచి తలపడ్డాయి. ఎమ్‌ఏఎమ్–సి, ఎమ్‌ఏఎమ్–ఎల్ అనే భారీ పేలుడు పదార్థాన్ని, లేజర్ ద్వారా లక్ష్యాలను ఛేదించేలా రూపొందించిన రాకెట్లను ఈ డ్రోన్‌లు మోసుకుపోయాయి. దీర్ఘశ్రేణి ఫిరంగి, రాకెట్ సిస్టమ్‌ల ద్వారా అత్యంత నిర్దిష్టంగా కదిలే టార్గెట్లను గుర్తించడానికి నిఘా డ్రోన్‌లు ఉపయోగపడతాయి. యుద్ధరంగానికి అతి దూరం నుంచి జరిగే ఈ యుద్ధానికి కోరల్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్ అండదండగా నిలిచింది. ఇవి నిజానికి సిరియా గగనతల రక్షణ రాడార్ నెట్‌వర్క్‌ని స్తంభింపజేయడమే కాకుండా, డ్రోన్ లను కూల్చివేయడంలో కూడా అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శించాయి.
ఈ రెండు ఘర్షణలు యుద్ధతంత్రానికి చెందిన భవిష్యత్ చిత్రపటాన్ని సూచనామాత్రంగా అందించాయి. అంతేకాకుండా నేటి యుద్ధరంగంలో యుద్ధ ట్యాంకుల అవసరం, వాటి సామర్థ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫోర్స్ డిజైన్ 2030 గురించి అమెరికన్ మెరైన్ కార్ప్స్ ఒక కీలక ప్రకటన చేస్తూ తమవద్ద ఉన్న యుద్ధ ట్యాంకులన్నింటినీ క్రమంగా వదులుకుంటామని తెలిపింది. మెరైన్ కార్ప్స్ అనేది ఒక నిర్దిష్ట దండయాత్రలు చేయడానికి ఉద్దేశించబడినది కాబట్టి దాన్ని తక్కువ బలగంతోనే నడపాల్సి ఉంటుంది. కాబట్టి యుద్ధరంగం నుంచి ట్యాంకులను పూర్తిగా రద్దు చేయడం అంటే అపరిపక్వతే అవుతుంది. అయితే ఈ వాదనకు బలమున్నప్పటికీ, భారీ యుద్ధట్యాంకులు పరస్పరం తలపడి విధ్వంసం చేసుకునే శకం అంతరించిపోయిందనే వాదనకు కూడా తగిన ప్రాతిపదిక ఉందనే చెప్పాలి.
ఇక భారత్, చైనా యుద్ధ ట్యాంకుల విషయానికి వస్తే ఎల్తైన ప్రాంతాల్లో జరిగే సైనిక చర్యలకు తమ తేలికపాటి యుద్ధ ట్యాంక్ కచ్చితంగా సరిపోతుందని చైనా వాదిస్తోంది. కాగా ఒక మీడియా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ట్యాంకులతో ముడిపడిన యుద్ధంలో.. మన టి–90, టి–72 ట్యాంకుల ధాటికి చైనా తేలికపాటి ట్యాంకులు ఏమాత్రం తట్టుకోలేవని కచ్చితంగా చెప్పగలను’ అని భారతీయ శతఘ్ని దళ కమాండర్ పేర్కొన్నారు. ముందే చెప్పినట్లుగా ఈ రెండు వాదనలు ఒక విస్తృత అంశాన్ని దాటవేస్తున్నాయి. ఈరోజు ఒక శతఘ్నికి మరో శత్రు శతఘ్ని ప్రమాదకరం కాదు. గగనతల దాడితోనే వాటికి అసలు ప్రమాదం ఉంది. ప్రత్యేకించి బహిరంగ స్థలాల్లో, బీడు భూముల్లో, మొక్కలు కూడా పెరగని వాస్తవాధీన రేఖ పొడవునా ఉన్న ప్రాంతాల్లో ఇది మరింతగా వర్తిస్తుంది.
చైనా సైన్యం అధునాతనమైన మానవరహిత ఏరియల్ వాహనాలను (యూఏవీ), మానవరహిత కంబాట్ ఏరియల్ వాహనాలను (యూసీఏవీ) పెద్ద సంఖ్యలో కలిగి ఉంది. 2019 చైనా జాతీయ దినోత్సవం పెరేడ్ సందర్భంగా జిజె–11 స్టెల్త్ డ్రోన్‌తో సహా ఎల్తైన ప్రాంతాల్లో దీర్ఘకాలం మనగలిగే మధ్యశ్రేణి యూఏవీలు, యూసీఏవీలను చైనా ప్రదర్శించింది. చైనా ప్రజావిముక్తి సైన్యంకి 20 రకాల సైనిక్ డ్రోన్‌లు అందుబాటులో ఉన్నాయని అంచనా. అలాగే పీఎల్‌ఏ ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రంలో కూడా భారీగా పెట్టుబడి పెట్టింది. 2016లో స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్‌కి చెందిన నెట్‌వర్క్ సిస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఒకే సంస్థాగత ఛత్రం కింద సైబర్, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాన్ని మిళితం చేసింది. గగనతలాన్ని రక్షించే రాడార్లతోసహా ఫైర్ సపోర్ట్ నెట్‌వర్క్ కమాండ్, కంట్రోల్‌ని సైబర్, ఎలక్ట్రానిక్ దాడులు నిర్వీర్యం చేస్తాయి.
ఈ తరహా యుద్ధపరిస్థితుల్లో, శతఘ్నుల వంటి ఆయుధ వ్యవస్థలు మరింతగా మనగలిగే పద్ధతులకు అలవడాలి. దీనికి ఎత్తుగడల్లో మార్పు, వివిధ సామర్థ్యతా రకాలతో గొప్పగా మిళితం కావడం అవసరం. నేటి యుద్ధ రంగంలో సెన్సర్ల ఉనికి భారీగా ఉండటంతో ఏ ఆయుధ వ్యవస్థను కూడా దాచి ఉంచడం అసాధ్యం. శతఘ్నులు ఇప్పుడు ఎలక్ట్రానికి వార్‌ఫేర్ విభాగాలతో కూడి నిత్యం స్థానం మార్చుకుంటూ ఉండాలి. అప్పుడే అవి స్వల్పకాలిక గగన తల రక్షణ విభాగాలను, ఏరియల్ ప్లాట్‌ఫామ్‌లను అడ్డుకోగలవు. ఈ తరహా యుద్ధాలలో మనం ఆత్మరక్షణ ధోరణితో పోరాడలేం. కాబట్టే మానవరహిత గగనతల దాడుల వ్యవస్థలను తప్పక పొందగలగాలి. డ్రోన్ లపై దాడిచేయడానికి పరిమితులు, ఈ తరహా వ్యవస్థలకు అయ్యే భారీ వ్యయం గురించి భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇటీవలే ఒక ఇంట ర్వ్యూలో తెలిపారు కూడా. దాదాపు 3 బిలియన్ డాలర్ల వ్యయంతో అమెరికా నుంచి 20 అధునాతన ఎమ్‌క్యూ–9 యూఏవీల కొనుగోలుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
ప్రతి సైనిక సామగ్రికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇప్పుడు సాయుధ వ్యవస్థల సమ్మేళనం కారణంగా ప్రత్యేకించి కొన్ని ఆయుధాల కంటే సైనిక సామగ్రి మొత్తానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఖర్చుకు సంబంధించి చూస్తే మనం తెలివిగా ఎంచుకోవలసి ఉంది. అమెరికా వాయుసేనతో కలిసి ఇప్పుడు క్రాటోస్ ఎక్స్‌క్యూ–58ఎ వల్క్రియే స్టెల్త్ డ్రోన్ అభివృద్ధికి భారత సైన్యం ప్రయత్నిస్తో్తంది. 4 వేల కిలోమీటర్ల దూర శ్రేణిని కలిగి 250 కేజీల వెపన్ పేలోడ్ కలిగిన ఈ వల్క్రియే డ్రోన్‌కు 2 మిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వస్తోంది. అంటే ఒక రఫేల్ యుద్ధవిమానానికి అయ్యే ఖర్చుతో 50 డ్రోన్లను కొనుగోలు చేయవచ్చన్నమాట. గార్నో–కరబాక్ ప్రాంతంలో జరిగిన సైనిక ఘర్షణ తక్కువ విస్తృతి కలిగిందే కావచ్చు కానీ అది భవిష్యత్తు యుద్ధ పౌరాటాలకు సంకేతాలు వెలువరిస్తోంది. గగనతల శక్తి వ్యవస్థలను మోహరించడంలో జర్మనీ సైన్యానికి స్పానిష్ అంతర్యుద్దం (1936–39) అనేక పాఠాలు నేర్పించింది. వీటినే జర్మనీ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రదర్శించింది. భారత సైన్యం ప్రస్తుతానికి సాంప్రదాయిక మైన శతఘ్నులు, విమానాలు వంటి ఆయుధాలపై అధికంగా వెచ్చిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు ఇక అంతరించిపోతాయని నేను చెప్పడం లేదు. కానీ ఇప్పుడు మనకు అత్యాధునిక టెక్నాలజీలను తప్పక స్వీకరించాల్సి ఉంది.
లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా
వ్యాసకర్త మాజీ నార్తర్న్ ఆర్మీ కమాండర్ రిటైర్డ్
Comments
Please login to add a commentAdd a comment