
సైన్యంలో అగ్నిపథ్ నియామకాలకు సోమవారం(నేడు) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప చెప్పారు. మొదటి బ్యాచ్‌లో 25,000 మందికి డిసెంబర్ మొదటి, రెండో వారాల్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పొన్నప్ప తెలియజేశారు. రెండో బ్యాచ్ అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దాదాపు 40,000 మందిని నియమించడానికి దేశవ్యాప్తంగా 83 రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు.
నేవీలో మొదటి బ్యాచ్‌కు ఐఎన్‌ఎస్ చిల్కాలో శిక్షణ
అగ్నిపథ్ కింద నావికా దళంలో త్వరలో చేపట్టనున్న నియామకాల ప్రణాళిక గురించి వైస్ అడ్మిరల్ (పర్సనల్) దినేష్ త్రిపాఠి ప్రకటించారు. ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందన్నారు. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన మొదటి బ్యాచ్‌కు ఈ ఏడాది నవంబర్ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని తెలియజేశారు. అగ్నివీరులుగా యువకులను, యువతులను ఎంపిక చేస్తామని దినేష్ త్రిపాఠి ఉద్ఘాటించారు.
ఐఏఎఫ్‌లో డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభం
భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లో రిక్రూట్‌మెంట్ల గురించి ఎయిర్ మార్షల్ ఎస్.కె.ఝా వివరించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభమవుతుందని, మొదటి దశ ఆన్‌లైన్ పరీక్ష ప్రక్రియ జూలై 24 నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. ఐఏఎఫ్‌లో అగ్నిపథ్ కింద మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు.