
సాక్షి, హైదరాబాద్: అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ ర్యాలీని డిసెంబర్ 8 నుంచి 16 వరకు జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు రిక్రూట్‌మెంట్ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 33 జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులు ర్యాలీలో పాల్గొంటారని పేర్కొంది. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ విభాగాలకు.. పదో తరగతి ఉత్తీర్ణత, ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కేటగిరీలుగా ర్యాలీ నిర్వహిస్తారని వివరించింది.
మహిళా మిలిటరీ పోలీసు(డబ్ల్యూఎంపీ) పోస్టులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (కరైకల్–యానాం) నుంచి వచ్చే అభ్యర్థులు ర్యాలీ సైట్‌కు అన్ని పత్రాలు తీసుకురావాలని సూచించింది. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఉత్తీర్ణత లేదా నమోదు చేసుకోవడానికి సహాయం చేస్తామని ఎవరైనా పంపే ట్వీట్లు లేదా మోసగాళ్లతో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సందేహాలకు రిక్రూట్‌మెంట్ కార్యాలయం ఫోన్ నంబర్లు 040–27740059, 27740205ను సంప్రదించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment