Recruitment rally
-
8 నుంచి 16 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: అగ్నివీర్ల రిక్రూట్మెంట్ ర్యాలీని డిసెంబర్ 8 నుంచి 16 వరకు జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు రిక్రూట్మెంట్ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 33 జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులు ర్యాలీలో పాల్గొంటారని పేర్కొంది. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ విభాగాలకు.. పదో తరగతి ఉత్తీర్ణత, ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కేటగిరీలుగా ర్యాలీ నిర్వహిస్తారని వివరించింది. మహిళా మిలిటరీ పోలీసు(డబ్ల్యూఎంపీ) పోస్టులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (కరైకల్–యానాం) నుంచి వచ్చే అభ్యర్థులు ర్యాలీ సైట్‌కు అన్ని పత్రాలు తీసుకురావాలని సూచించింది. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఉత్తీర్ణత లేదా నమోదు చేసుకోవడానికి సహాయం చేస్తామని ఎవరైనా పంపే ట్వీట్లు లేదా మోసగాళ్లతో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సందేహాలకు రిక్రూట్మెంట్ కార్యాలయం ఫోన్ నంబర్లు 040–27740059, 27740205ను సంప్రదించాలని సూచించింది. -
జూలైలో ఆర్మీ బీఎస్సీ రిక్రూట్మెంట్ ర్యాలీ
కంటోన్మెంట్: ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ(బీఎస్సీ)లో క్రీడాకారుల ఎంపిక కోసం తిరుమలగిరిలోని 1ఈఎంఈ సెంటర్ ఆధ్వర్యంలో జూలైలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. జూలై 3 నుంచి 15 వరకు నిర్వహించే ఈ ర్యాలీలో వాలీబాల్, కయాకింగ్, కనోయింగ్ విభాగాల్లో ఎనిమిది నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు ఆర్మీ పీఆర్ఓ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ర్యాలీలో పాల్గొనే వారు 2009 జూలై 3 నుంచి 2015 జూలై 15 మధ్య జన్మించిన వారై కనీసం మూడో తరగతి పూర్తి చేసిన వారై, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కనీస పరిజ్ఞానం ఉండాలి. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ మెడికల్ ఆఫీసర్, ఆర్మీ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ స్పెషలిస్ట్‌ల ధ్రువీకరణ కలిగి ఉండాలి. ఏదేనీ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలిచిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. శరీరంపై ఎక్కడైనా శాశ్వత టాటూ వేయించుకున్న వారు అనర్హులు. ఎంపికైన అభ్యర్థులను స్పోర్ట్స్ క్యాడెట్లుగా పరిగణిస్తారు. వీరికి ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటు పదోతరగతి వరకు ఉచిత విద్య అవకాశాలు కల్పిస్తారు. శిక్షణా కాలంలో ఉచిత బీమా, వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తారు. వివరాలకు వాట్సాప్ ద్వారా 9398543351 నంబర్లో లేదా తిరుమలగిరిలోని 1 ఈఎంఈ సెంటర్ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ట్రెయినింగ్ బెటాలియన్‌లో సంప్రదించవచ్చు. -
15 నుంచి ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్ ర్యాలీ
సాక్షి, అమరావతి: అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని నవంబర్ 15 నుంచి 29వ తేదీ వరకు చెన్నైలో నిర్వహించనున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ర్యాలీలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు యువత పాల్గొనవచ్చు. అగ్నివీర్(మెన్), అగ్నివీర్ (మహిళా మిలటరీ పోలీస్), సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ (వెటర్నరీ), జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు www.joinindianarmy. nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులు తీసుకువెళ్లాల్సిన ధ్రువీకరణపత్రాలు, ఇతర సమాచారం మొత్తం వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్లో ఉంటుంది. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, యువత దళారుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఆర్మీ వర్గాలు స్పష్టంచేశాయి. -
Agnipath Scheme: దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు
సైన్యంలో అగ్నిపథ్ నియామకాలకు సోమవారం(నేడు) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప చెప్పారు. మొదటి బ్యాచ్‌లో 25,000 మందికి డిసెంబర్ మొదటి, రెండో వారాల్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పొన్నప్ప తెలియజేశారు. రెండో బ్యాచ్ అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దాదాపు 40,000 మందిని నియమించడానికి దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. నేవీలో మొదటి బ్యాచ్‌కు ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ అగ్నిపథ్ కింద నావికా దళంలో త్వరలో చేపట్టనున్న నియామకాల ప్రణాళిక గురించి వైస్ అడ్మిరల్ (పర్సనల్) దినేష్ త్రిపాఠి ప్రకటించారు. ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందన్నారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్లో ఎంపికైన మొదటి బ్యాచ్‌కు ఈ ఏడాది నవంబర్ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని తెలియజేశారు. అగ్నివీరులుగా యువకులను, యువతులను ఎంపిక చేస్తామని దినేష్ త్రిపాఠి ఉద్ఘాటించారు. ఐఏఎఫ్‌లో డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభం భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లో రిక్రూట్మెంట్ల గురించి ఎయిర్ మార్షల్ ఎస్.కె.ఝా వివరించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభమవుతుందని, మొదటి దశ ఆన్లైన్ పరీక్ష ప్రక్రియ జూలై 24 నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. ఐఏఎఫ్‌లో అగ్నిపథ్ కింద మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. -
సైన్యంలో తెగువ చూపనున్న మగువ
సాక్షి, న్యూఢిల్లీ : సైన్యంలోకి జవాన్లుగా మహిళలను ఆహ్వానిస్తూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు నోటిఫికేషన్ జారీ చేస్తూ గురువారం భారత ఆర్మీ చరిత్ర సృష్టించింది. సైన్యంలో 100 మంది మహిళా సైనికుల (సాధారణ విధులు) నియామకం కోసం దరఖాస్తులను సైన్యం ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈనెల 25 నుంచి జూన్ 8లోగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని సైన్యం జారీ చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది. మహిళా సైనికులకు గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలు కాగా, కనీస వయస్సు 17.5 సంవత్సరాలుగా నిర్ధారించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన రక్షణ సిబ్బంది జీవిత భాగస్వాములకు గరిష్ట వయోపరిమితిని 30 సంవత్సరాల వరకూ సడలించారు. కాగా రిక్రూట్మెంట్కు సంబంధించి అడ్మిట్ కార్డులు ఈమెయిల్ ద్వారా అభ్యర్ధులకు పంపనున్నారు. దేశవ్యాప్తంగా అంబలా, లక్నో, జబల్పూర్, బెంగళూర్, షిల్లాంగ్‌ల్లో రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహిస్తారు. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్ధులు రిక్రూట్మెంట్ ర్యాలీల్లో వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. -
ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
కడప కల్చరల్ : ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ శుక్రవారం ప్రారంభమైంది. అధికారుల పర్యవేక్షణలో ఉదయం స్టెప్ కార్యాలయం వద్దగల ఇండోర్ స్టేడియంలో అభ్యర్థులకు రాత పరీక్ష, అనంతరం రామకృష్ణ మిషన్ వద్దగల బైపాస్‌రోడ్డులో అధికారులు యువకులకు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం ఇండోర్ స్టేడియంలో మెడికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి మరో విడత రాత పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం భోజనానంతరం రాత పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని స్టెప్ సీఈఓ మమత తెలిపారు. ఆదివారం నుంచి ఎయిర్‌ఫోర్స్ సెక్యూరిటీ ఉద్యోగానికి రాత పరీక్షలు, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు ఉంటాయని ఆమె తెలిపారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సర్వం సిద్ధం
కొత్తగూడెం: తెలంగాణలోని 10 జిల్లాల స్థాయి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఈనెల 4వ తేదీ నుంచి మొదలుకొని 10 రోజులపాటు ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ర్యాలీ జరగనుంది. దీనికోసం కొద్ది రోజులుగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మీ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాలను ఆర్మీ ర్యాలీ నిర్వహించేందుకు ఎంపిక చేశారు. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు జారీ చేశారు. ఆర్మీ ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు షామియానాలు, అంబులెన్స్‌లు, తాత్కాలిక మరుగుదొడ్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఎంపికైన అభ్యర్థులకు సికింద్రాబాద్‌లో రాత పరీక్ష నిర్వహించి ఆర్మీకి ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల పరిధిలో ఉచితంగా శిక్షణ శిబిరాలు నిర్వహించారు. -
ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం
-
ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం
మెదక్: మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీని గురువారం ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు 5 జిల్లాల నుంచి సుమారు 15 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. తొలిరోజు సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఇంటర్మీడియట్ లాంగ్ మెమో తప్పని సరి అని ఎయిర్‌ఫోర్స్ అధికారులు అని స్పష్టం చేశారు. దాంతో నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఈ ఏడాది తమకు లాంగ్ మెమోను ప్రభుత్వం ఇవ్వలేదని ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌మెన్ పోస్టులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా గురువారం శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
ఎయిర్‌మెన్ ఉద్యోగాల కోసం.. సన్నద్ధమవ్వండిలా..
8 నుంచి 14వరకు ఎంపిక ప్రక్రియ సంగారెడ్డిలో విస్తృత ఏర్పాట్లు సంగారెడ్డి జోన్: భారత వాయు సేనలో ఎయిర్‌మెన్ ఉద్యోగాల కోసం రాష్ట్రస్థాయి రిక్రూట్మెంట్ ర్యాలీ మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈనెల 8 నుంచి 14 వరకు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ర్యాలీని జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా అభ్యర్థుల నియామకానికి చర్యలు చేపడుతోంది. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఈ ర్యాలీ జరుగనున్నది. ఎయిర్‌మెన్ ఉద్యోగాల్లో రెండు కేటగిరీల్లో అంటే ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ (విద్యా శిక్షకుడు), సెక్యూరిటీ ఉద్యోగాల నియామకానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ ర్యాలీలో తెలంగాణాలోని పది జిల్లాల నుంచి నిరుద్యోగ పురుష అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి డా.రజనిప్రియ, యూత్ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసులు తదితరులతో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయన్న విషయమై వారితో చర్చించారు. విద్యా శిక్షకుల పోస్టుకు (గ్రూప్ ఎక్స్) ఎంపిక ఇలా.. 8వ తేదీ : ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు వుంటాయి. 9వ తేదీ : రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ర్యాలీకి తీసుకురావాల్సినవి.. గ్రూప్ ఎక్స్ అభ్యర్థులు.. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, బీఈడీ లేదా 2 సంవత్సరాల బోధన అనుభవం, ఉత్తీర్ణత సాధించిన ధ్రువపత్రాలు. గ్రూప్ వై అభ్యర్థులు.. 10వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివిన ధ్రువపత్రాలు. వీటికి సంబంధించి నాలుగు సెట్ల జిరాక్స్ కాపీలు. గ్రూప్ ఎక్స్,వై : ఏడు పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు. హెచ్‌బీ పెన్సిల్, రబ్బరు, షార్ప్‌నర్, గమ్, టేప్, స్టాప్లర్, బ్లూ/బ్లాక్ బాల్ పెన్నులు. సెక్యూరిటీ విభాగం (గ్రూప్ వై)పోస్టుకు ఎంపిక ఇలా .. 10వ తేదీ : ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. 2.4 కి.మీ.పరుగు పందెం పోటీలు ఉంటాయి. 11వ తేదీ : ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు, 5కి.మీ.పరుగు, ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 12వ తేదీ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు, 2.4కి.మీ.పరుగు పోటీలు నిర్వహిస్తారు. 13వ తేదీ : ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు, 5కి.మీ. పరుగు, ఉత్తీర్ణులైన వారికి అదేరోజు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 14వ తేదీ : ఫలితాలు వెల్లడిస్తారు. -
దేశ సేవ కోసం ఆర్మీలో చేరండి
- సైనిక ఉన్నతాధికారి రోహిల్లా - కొనసాగుతున్న ఆర్మీ ర్యాలీ.. ఆదిలాబాద్ స్పోర్ట్స్ : యువత దేశ సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలని ఆర్మీ సైనిక ఉన్నతాధికారి ఏకే.రోహిల్లా పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత నిరుత్సాహపడకుండా సాధన చేయాలని, దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉండాలని అన్నారు. ఆర్మీలో చేరిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, సైన్యంలో చేరి దేశ రక్షణ చర్యల్లో పాల్గొనే అదృష్టం కలుగుతుందని చెప్పారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని పేర్కొన్నారు. రన్నింగ్‌లో సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు వివరించారు. 1720 మంది అర్హత ఆర్మీ ర్యాలీకి గురువారం నిజామాబాద్ అభ్యర్థులు 2750 మంది హాజరయ్యూరు. ఎత్తులో 850 మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యూరు. కాగా ధ్రువీకరణ పత్రాలు సంక్రమంగా లేక 180 మంది అభ్యర్థులను రిజక్ట్ చేశారు. మొత్తం 1720 మంది అభ్యర్థులు రన్నింగ్‌కు అర్హత సాధించారు. గురువారం కరీంనగర్ జిల్లా అభ్యర్థులు రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో 343 మంది రన్నింగ్‌లో పాస్ అయ్యారు. 26 మంది ఎత్తు, ఛాతి, భీమ్ ఇతర అంశాల్లో రిజక్ట్ అయ్యూరు. 343 మంది మెడికల్ టెస్ట్‌లకు అర్హత సాధించారు. కాగా, బుధవారం జరిగిన మెడికల్ టెస్ట్‌లో 160 మంది పాసయ్యారు. ఇందులో 81 మంది రాత పరీక్షకు అర్హులుగా గుర్తించారు. 61 మంది పర్మినెంట్ అన్‌ఫిట్‌గా గుర్తించారు. వీరు రూ.600 ఫీజు చెల్లించి సికింద్రాబాద్ ఆస్పత్రిలో మెడికల్ పరీక్ష చేయించుకోని తిరిగి ఆర్మీ అధికారులను సంప్రదించాలని సూచించారు. 18 మంది టెంపరరీ అన్‌ఫిట్‌గా గుర్తించినట్లు తెలిపారు. వారు సైతం ఉచితంగా సికింద్రాబాద్ ఆస్పత్రిలో మెడికల్ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. ఆర్మీ అధికారులు ధార్వీ, జిల్లా అధికారులు డీఎస్డీవో సుధాకర్‌రావు, మెప్మాపీడీ రాజేశ్వర్‌రాథోడ్, రెవెన్యూ అధికారిణి వనజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 9న మెదక్, హైదరాబాద్ అభ్యర్థులకు.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఈ నెల 9వ తేదీన మెదక్, హైదరాబాద్ అభ్యర్థులకు అవకాశం అందిస్తున్నట్లు ఆర్మీ సైనిక ఉన్నతాధికారి ఎకే.రోహిల్లా కోరారు. రెండు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు హాజరుకావాలని, వివిధ జిల్లాల నుంచి వస్తున్న అభ్యర్థులకు వసతి సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సులు సమ్మెలో ఉన్నందున రైలు మార్గంతో వచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. -
రుగ్మతలపై చేద్దాం యుద్ధం
చట్టాల కంటే సామాజిక మార్పుతోనే అభివృద్ధి సాధ్యమని.. అందువల్ల సామాజిక రుగ్మతలపై అందరం కలిసి యుద్ధం చేద్దామని జిల్లా కలెక్టర్ పాటూరి లక్ష్మీనరసింహం పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకా న్ని ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ ప్రసంగిం చారు. జిల్లా ప్రగతిని వివరించారు. వరకట్నం, నిరక్షరాస్యత, మద్యపానం, లంచగొండితనం, అవినీ తి వంటి సామాజిక రుగ్మతలను పారదోలాలని పిలుపునిచ్చారు. అప్పుడే అభివృద్ధి ఫలాలు పూర్తిస్థాయిలో అందుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత పెంపునకు యువత బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. - శ్రీకాకుళం పాతబస్టాండ్ జిల్లాలో రూ.10 కోట్లుతో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు ఫిబ్రవరి 13 నుంచి 24 వరకు జిల్లాలో ఆర్మి రిక్రూట్మెంటు ర్యాలీ నిర్వహిస్తారు. గిరిజన సంప్రదాయాల పరిరక్షణకు ఫిబ్రవరి 6.7 తేదీల్లో గిరిజన ఉత్సవాలు. జిల్లా సామాజిక, ఆర్థిక స్థితిగతులపై సర్వే వివరాలు ఫిబ్రవరి 3న వెల్లడికానున్నాయి. దాని ఆధారంగా తదుపరి చర్యలు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై పూర్తిస్థాయి అధ్యయనం జరగాలి. దాన్ని బాధ్యతగా తీసుకుంటాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పొందూరు ఖాదీలో నకిలీలను అరికట్టి, ఖాదీ కార్మికులను ప్రోత్సహిస్తాం. వారంలో ఒకరోజు అందరూ ఖాదీ వస్త్రాలు ధరించాలి.. నేను కూడా ధరిస్తాను. వ్యవస్థల్లో అవినీతి రూపుమాపి, పొదుపు పాటించాలి. ఫిబ్రవరిలో విద్యుత్ వినియోగదారులకు రూ. 10కే ఎల్ఈడీ బల్బులు అందిస్తాం. జిల్లాలో జన్మభూమి, స్వచ్ఛ భార త్, స్మార్ట్ గ్రామాల కార్యక్రమాలతోపాటు పారిశ్రామికాభివృద్ధికి పునాదులు వేస్తున్నాం. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా అందరికీ ప్రభుత ్వ విద్య అందిస్తాం. రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ధాన్యం కొనుగోలు, ఇసుక అమ్మకాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కార్యక్రమా అమలులో ముందున్నాం. ప్రజలను చైతన్యవంతులను చేసి అందరి సహకారంతో జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తాం. రుణ వితరణ కార్యక్రమంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు, మహిళలకు రూ.60.79 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 3250 స్వయంశక్తి సంఘాలకు రూ. 51 కోట్ల లింకేజీ రుణాలు, ఉన్నతి కార్యక్రమం ద్వారా 504 మంది నిరుపేదలకు రూ.1.23 కోట్లు, 730 మందికి రూ.1.89 కోట్ల బీమా పరిహారం అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 199 మందికి రూ. 2.5 కోట్లు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 106 సంఘాలకు రూ. 8.86 లక్షలు, మరో ఇద్దరికి మూడు లక్షల వ్యక్తిగత రుణాలు అందజేశారు. వికలాంగ సంక్షేమ శాఖ ద్వారా పది మందికి ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఇదే సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించడంతోపాటు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతకుముందు కలెక్టర్ సాయుధదళాల పరేడ్ పరిశీలించి, గౌరవ వందనం తీసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్, మాజీ న్యాయమూర్తి పి.జగన్నాథం, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఏజేసీ పి.రజనీకాంతరావు, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ఎస్ వెంకటరావు, డీఆర్డీఏ పీడీ తనూజారాణి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, డీఎంహెచ్‌వో శ్యామల, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.