కొత్తగూడెం: తెలంగాణలోని 10 జిల్లాల స్థాయి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఈనెల 4వ తేదీ నుంచి మొదలుకొని 10 రోజులపాటు ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ర్యాలీ జరగనుంది. దీనికోసం కొద్ది రోజులుగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మీ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాలను ఆర్మీ ర్యాలీ నిర్వహించేందుకు ఎంపిక చేశారు.
ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు జారీ చేశారు. ఆర్మీ ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు షామియానాలు, అంబులెన్స్‌లు, తాత్కాలిక మరుగుదొడ్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఎంపికైన అభ్యర్థులకు సికింద్రాబాద్‌లో రాత పరీక్ష నిర్వహించి ఆర్మీకి ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల పరిధిలో ఉచితంగా శిక్షణ శిబిరాలు నిర్వహించారు.