సాక్షి, న్యూఢిల్లీ : సైన్యంలోకి జవాన్లుగా మహిళలను ఆహ్వానిస్తూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు నోటిఫికేషన్ జారీ చేస్తూ గురువారం భారత ఆర్మీ చరిత్ర సృష్టించింది. సైన్యంలో 100 మంది మహిళా సైనికుల (సాధారణ విధులు) నియామకం కోసం దరఖాస్తులను సైన్యం ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈనెల 25 నుంచి జూన్ 8లోగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సైన్యం జారీ చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది.
మహిళా సైనికులకు గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలు కాగా, కనీస వయస్సు 17.5 సంవత్సరాలుగా నిర్ధారించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన రక్షణ సిబ్బంది జీవిత భాగస్వాములకు గరిష్ట వయోపరిమితిని 30 సంవత్సరాల వరకూ సడలించారు. కాగా రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అడ్మిట్ కార్డులు ఈమెయిల్ ద్వారా అభ్యర్ధులకు పంపనున్నారు.
దేశవ్యాప్తంగా అంబలా, లక్నో, జబల్‌పూర్, బెంగళూర్, షిల్లాంగ్‌ల్లో రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహిస్తారు. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్ధులు రిక్రూట్‌మెంట్ ర్యాలీల్లో వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment