javan
-
సైన్యంలో తెగువ చూపనున్న మగువ
సాక్షి, న్యూఢిల్లీ : సైన్యంలోకి జవాన్లుగా మహిళలను ఆహ్వానిస్తూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు నోటిఫికేషన్ జారీ చేస్తూ గురువారం భారత ఆర్మీ చరిత్ర సృష్టించింది. సైన్యంలో 100 మంది మహిళా సైనికుల (సాధారణ విధులు) నియామకం కోసం దరఖాస్తులను సైన్యం ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈనెల 25 నుంచి జూన్ 8లోగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని సైన్యం జారీ చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది. మహిళా సైనికులకు గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలు కాగా, కనీస వయస్సు 17.5 సంవత్సరాలుగా నిర్ధారించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన రక్షణ సిబ్బంది జీవిత భాగస్వాములకు గరిష్ట వయోపరిమితిని 30 సంవత్సరాల వరకూ సడలించారు. కాగా రిక్రూట్మెంట్కు సంబంధించి అడ్మిట్ కార్డులు ఈమెయిల్ ద్వారా అభ్యర్ధులకు పంపనున్నారు. దేశవ్యాప్తంగా అంబలా, లక్నో, జబల్పూర్, బెంగళూర్, షిల్లాంగ్ల్లో రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహిస్తారు. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్ధులు రిక్రూట్మెంట్ ర్యాలీల్లో వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. -
అమర జవానుకు అశ్రునివాళి
సాక్షి, రామచంద్రపురం: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత కాంకేర్ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లపై ఈ నెల 3న మావోయిస్టులు జరిపిన దాడిలో రామచంద్రపురం పట్టణానికి చెందిన శీలం రామకృష్ణ (30) వీరమరణం పొందారు. ఆయ న మృతదేహాన్ని బీఎస్ఎఫ్ నేతృత్వంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి పట్టణంలోని శీలంవారి సావరంలో ఉన్న ఆయన ఇంటికి శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో అసువులు బాసిన ఆయన మృతదేహాన్ని పట్టణ వాసులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఇంటి నుంచి శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన సేవలకు గౌరవ సూచకంగా జవాన్లు గాలిలోకి తుపాకులతో కాల్పులు జరిపి, వందనం సమర్పించారు. విశాఖపట్నం, కాకినాడ నుంచి వచ్చిన బీఎస్ఎఫ్ అధికారులు, జవాన్లు రామకృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు వీర జవాను రామకృష్ణ మృతదేహం ఇంటికి చేరుకోగానే భార్య సౌందర్య, ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బీఎస్ఎఫ్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న రామకృష్ణకు 2016లో సౌందర్యతో వివాహం జరిగింది. ఇటీవల ఇంటికి వచ్చిన రామకృష్ణ మాటల సందర్భంగా తన మామయ్యతో ‘‘నేను చనిపోతే ఎంతమంది వస్తారో చూద్దురుగాని’’ అని అన్నారు. రామకృష్ణ అంత్యక్రియల్లో వేలాదిగా పాల్గొన్న ప్రజల్ని చూసి.. ఆ మాటలే గుర్తుకు వచ్చి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ముని గిపోయారు. ఆర్డీఓ ఎన్.రాజశేఖర్, డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్, సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ఎస్సై ఎస్.లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. శ్మశాన వాటికలో రామకృష్ణ మృతదేహానికి వైఎస్సార్ సీపీ రామచంద్రపురం ఎమ్మె ల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణు శ్రద్ధాంజలి ఘటించి, ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఈ జవాను నిత్య పెళ్లికొడుకు!
మైసూరు: విడాకులివ్వకుండానే ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్న ఓ జవాను నాలుగో పెళ్లికి సిద్ధమై కటకటాల పాలయ్యాడు. కర్ణాటకలోని మైసూరు జిల్లా లక్కికుప్పె గ్రామానికి చెందిన శివనంజు (35) భారత సైన్యంలో జవానుగా పనిచేస్తున్నాడు. 2007 మేలో వరలక్ష్మి అనే మహిళను పెళ్లిచేసుకున్నాడు. ఆమె గర్భం దాల్చగానే పుట్టింటికి పంపించి వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో 2009లో ఆయనపై గృహహింస కేసు నమోదైంది. ఇంతలోనే శ్వేత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులకే ఆమె అతడిని వదిలి వెళ్లిపోయింది. తర్వాత ఆశారాణి అనే యువతిని మూడో పెళ్లి చేసుకోగా.. కొద్దిరోజులకే వీరిద్దరూ వేరుపడ్డాడు. ఈ నేపథ్`యంలో నాలుగో పెళ్లికి సిద్ధమైన శివనంజును మొదటి భార్య సోదరుడు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కటకటాల పాలయ్యాడు. -
వెన్నుచూపినందుకు కొరడా
17 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెండ్ న్యూఢిల్లీ: నక్సల్స్ వ్యతిరేక పోరులో తోటి సిబ్బంది ఆపదలో ఉన్నారని తెలిసీ తమ ప్రాణ రక్షణ కోసం ఘటనా ప్రాంతం నుంచి తప్పించుకున్న జవాన్లు, జూనియర్ అధికారులు మొత్తం 17 మందిపై సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు కఠిన చర్యలకు దిగారు. ఈ ఏడాది మార్చి 11న ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో సహచర జవాన్లపై మావోలు కాల్పులు జరుపుతున్న క్రమంలో ఎదిరించి కాల్పులు జరపకుండా.. కొంత మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, అధికారులు తప్పించుకున్నారు. ఈ ఉదంతంలో ఓ పౌరుడు సహా 16 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది చనిపోయారు. సహచర సిబ్బందిగా వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకోవాల్సిన అధికారులు, జవాన్లు తమ ప్రాణ రక్షణే పరమావధిగా మృత వీరులను అక్కడే వదిలేసి పారిపోయారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు శాఖా పరమైన విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో ప్రాథమికంగా అందిన సమాచారం ఆధారంగా మొత్తం 17 మంది జవాన్లు, జూనియర్ అధికారులను సస్పెండ్ చేసినట్టు సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్ దిలీప్ త్రివేదీ తెలిపారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చేందుకు మూడు మాసాలు పడుతుందని, అది వచ్చాక పూర్తిస్థాయి చర్యలు ఉంటాయని ఆయన వివరించారు. విచారణలో.. సదరు సిబ్బంది ఎన్కౌంటర్ సమయంలో విధులను తోసిరాజని తమ ప్రాణాలను కాపాడుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చిన విషయం సుస్పష్టమైనట్టు త్రివేదీ తెలిపారు.