వెన్నుచూపినందుకు కొరడా
17 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సస్పెండ్
న్యూఢిల్లీ: నక్సల్స్ వ్యతిరేక పోరులో తోటి సిబ్బంది ఆపదలో ఉన్నారని తెలిసీ తమ ప్రాణ రక్షణ కోసం ఘటనా ప్రాంతం నుంచి తప్పించుకున్న జవాన్లు, జూనియర్ అధికారులు మొత్తం 17 మందిపై సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు కఠిన చర్యలకు దిగారు. ఈ ఏడాది మార్చి 11న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో సహచర జవాన్లపై మావోలు కాల్పులు జరుపుతున్న క్రమంలో ఎదిరించి కాల్పులు జరపకుండా.. కొంత మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు, అధికారులు తప్పించుకున్నారు. ఈ ఉదంతంలో ఓ పౌరుడు సహా 16 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది చనిపోయారు.
సహచర సిబ్బందిగా వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకోవాల్సిన అధికారులు, జవాన్లు తమ ప్రాణ రక్షణే పరమావధిగా మృత వీరులను అక్కడే వదిలేసి పారిపోయారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు శాఖా పరమైన విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో ప్రాథమికంగా అందిన సమాచారం ఆధారంగా మొత్తం 17 మంది జవాన్లు, జూనియర్ అధికారులను సస్పెండ్ చేసినట్టు సీఆర్‌పీఎఫ్ డెరైక్టర్ జనరల్ దిలీప్ త్రివేదీ తెలిపారు.
పూర్తిస్థాయి నివేదిక వచ్చేందుకు మూడు మాసాలు పడుతుందని, అది వచ్చాక పూర్తిస్థాయి చర్యలు ఉంటాయని ఆయన వివరించారు. విచారణలో.. సదరు సిబ్బంది ఎన్‌కౌంటర్ సమయంలో విధులను తోసిరాజని తమ ప్రాణాలను కాపాడుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చిన విషయం సుస్పష్టమైనట్టు త్రివేదీ తెలిపారు.