ప్రతి మహిళా ఒక సోల్జర్‌ | Every woman is a Soldier‌ Says Lieutenant General Madhuri Kanitkar | Sakshi
Sakshi News home page

ప్రతి మహిళా ఒక సోల్జర్‌

Published Sun, Mar 7 2021 3:13 AM | Last Updated on Sun, Mar 7 2021 7:05 AM

Every woman is a Soldier‌ Says Lieutenant General Madhuri Kanitkar - Sakshi

మాధురీ కణిట్కర్, లెఫ్టినెంట్‌ జనరల్‌

నేషనల్‌ జియోగ్రాఫిక్‌ వాళ్లు ఢిల్లీలో నిన్న ‘ఉమెన్‌ ఆఫ్‌ ఆనర్‌ : డెస్టినేషన్‌ ఆర్మీ’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ను ప్రదర్శించారు. ఆ షో కి ఎన్‌.సి.సి. గర్ల్‌ కెడేట్స్, ఉమెన్‌ ఆఫీసర్స్‌ వచ్చారు. చీఫ్‌ గెస్ట్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మాధురీ కణిట్కర్‌! షో అయ్యాక ‘‘హౌ ఈజ్‌ ది జోష్‌’’ అని అమ్మాయిల్ని అడిగారు. ‘‘ఓ..’’ అని నోటికి రెండు వైపులా చేతులు అడ్డుపెట్టి ఉత్సాహంగా అరిచారు అమ్మాయిలు. ‘‘మనలో ఎక్స్‌ట్రా ఎక్స్‌ క్రోమోజోమ్‌ ఉంది. మల్టీ టాస్కింగ్‌ చేయగలం. ఆర్మీ మిమ్మల్ని ఉమన్‌గా కాదు, ఒక సోల్జర్‌ గా గుర్తిస్తుంది. అదే మనకు కావలసిన గుర్తింపు’’ అంటూ.. వాళ్ల జోష్‌ ను మరింతగా పెంచారు కణిట్కర్‌.

మాధురీ కణిట్కర్‌ ఇండియన్‌ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌. ఢిల్లీ కంటోన్మెంట్‌ ఏరియాలోని ఎన్‌.సి.సి. ఆడిటోరియంలో శుక్రవారంనాడు ఎన్‌.సి.సి. గర్ల్‌ కెడెట్‌లు, ఎన్‌.సి.సి. ఉమెన్‌ ఆఫీసర్స్‌ హాజరైన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ప్రత్యేక అతిథిగా వెళ్లారు. ఆ ప్రత్యేక కార్యక్రమం ఓ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానెల్‌ వాళ్లు ఆర్మీలో చేరాలని అనుకుంటున్న అమ్మాయిల కోసం ఆ చిత్రాన్ని ప్రదర్శించారు. ‘ఉమెన్‌ ఆఫ్‌ ఆనర్‌ : డెస్టినేషన్‌ ఆర్మీ’ అనే ఆ చిత్రం చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. మహిళాశక్తికి ఒక పవర్‌ ప్రెజెంటేషన్‌లా ఉంది. గర్ల్‌ కెడెట్స్‌ లీనమైపోయి చూస్తున్నారు. అప్పటికప్పుడు ఆర్మీలో చేరిపోయి తమ సత్తా ఏంటో చూపించాలన్నంతగా వారిని ఆ చిత్రం బందీని చేసింది. మాధురీ కణిట్కర్‌ కూడా వాళ్లతో కూర్చొని ఆ డాక్యుమెంటరీని చూశారు.
చిత్రం పూర్తవగానే గర్ల్‌ కెడెట్స్‌ అరుపులు, చప్పట్లు!

‘ఉమెన్‌ ఆఫ్‌ ఆనర్‌ : డెస్టినేషన్‌ ఆర్మీ’ స్క్రీనింగ్‌ కార్యక్రమంలో మాధురీ కణిట్కర్‌
అప్పుడు అడిగారు మాధరి.. ‘హవ్వీజ్‌ ద జోష్‌?’ అని! ‘సూపర్బ్‌గా ఉంది మేడమ్‌’ అన్నారు అమ్మాయిలు. ‘‘కానీ ఆర్మీలో ఉద్యోగం బెడ్‌ ఆఫ్‌ రోజెస్‌ కాదు’’ అన్నారు మాధురి. ఆ మాటకు కొంచెం నిరుత్సాహం. ‘‘అయితే ఆర్మీ మిమ్మల్ని ఒక శక్తిగా మలుస్తుంది’’ అని కూడా అన్నారు మాధురి. నిరుత్సాహం స్థానంలో మళ్లీ ఉత్సాహం! అప్పుడిక ఆమె భారత సైన్యంలో తన ప్రయాణం ఎలా ఆరంభమైందీ చెప్పడం మొదలు పెట్టారు. మాధురి ఆర్మీలోకి వచ్చేటప్పటికి మహిళా అధికారులు సంప్రదాయ వస్త్రధారణ అయిన చీరలో కనిపించారు! క్రమంగా యూనిఫామ్‌లోకి మారిపోయారు. 37 ఏళ్లుగా ఆర్మీలో ఉన్నారు మాధురి. ఆర్మీలోని మెడికల్‌ విభాగంలో ఆఫీసర్‌ తను. లెఫ్ట్‌నెంట్‌గా చేరి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ర్యాంకుకు చేరుకున్నారు. ఆర్మీలో పైనుంచి మూడో ర్యాంకే లెఫ్టినెంట్‌ జనరల్‌. (మొదటి ర్యాంక్‌ ఫీల్డ్‌ మార్షరల్‌. రెండో ర్యాక్‌ జనరల్‌). ఆర్మీలో తన వైద్య సేవలకు అతి విశిష్ట సేవామెడల్, విశిష్ట సేవామెడల్‌ కూడా పొందారు.
∙∙


నేషనల్‌ జియోగ్రాఫిక్‌ షోకి ఆమె ఆర్మీ దుస్తుల్లోనే వచ్చారు మాధురీ కణిట్కర్‌. ‘‘ఆర్మీలో చేరాక మీరు స్త్రీనో, పురుషుడో కాదు. ఒక సోల్జర్‌ మాత్రమే. స్త్రీ అనే గుర్తింపు కన్నా, సోల్జర్‌ అనే గుర్తింపే మనకు ముఖ్యం. ఆర్మీలో చేరక ముందు కూడా మనం సోల్జరే. స్త్రీలో సహజంగానే సైనిక శక్తి ఉంటుంది కనుక’’ అని మాధురి చెప్పడం కెడెట్‌ గర్ల్స్‌కి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్‌.సి.సి.లో కొత్తగా జాయిన్‌ అయినవాళ్లే వాళ్లంతా. ‘‘సోల్జర్‌కి జెండర్‌ ఉండదు. అది మన మైండ్‌లో ఉంటుంది. మహిళల జెండర్‌ వారిలో పవర్‌ మాత్రమే’’ అని మాధురి చెప్పడం కూడా ఆ పిల్లల్ని బాగా ఆకట్టుకుంది. ఒక ఆర్మీ పర్సన్‌ మాటలు ఎంతలా పని చేస్తాయంటే.. అది ఆర్మీ గొప్పతనమే అనాలి. ఆర్మీలో చేరిన ప్రతి వ్యక్తినీ అలా తీర్చిదిద్దుతుంది ఆర్మీ. సమాజంలో స్ఫూర్తిని నింపేలా.

‘‘అమ్మాయిలూ మీకొక మాట చెప్తాను వినండి. మనకు అదనంగా ఒక ‘ఎక్స్‌’ క్రోమోజోమ్‌ ఉంది. అది మన చేత మల్టీ టాస్కింగ్‌ చేయిస్తుంది. లక్ష్యం కోసం పరుగులు తీయిస్తుంది. కలల్ని నిజం చేసుకుని శక్తిని ఇస్తుంది. ఏ ఉద్యోగంలోనైనా మనకు ఛాలెంజింగ్‌ ఏమిటంటే.. ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ పోవడం. అది సాధ్యమైతే మనకు ఏదైనా సాధ్యమే. ఉద్యోగానికి ఇల్లు, ఇంటికి ఉద్యోగం అడ్డుపడవు. నన్నే చూడండి. నా భర్త కూడా ఆర్మీలోనే చేసేవారు. ఇద్దరం ఆర్మీలోనే ఉన్నా 24 ఏళ్ల పాటు ఒకేచోట లేము. కానీ ఆర్మీ మాకు సపోర్ట్‌గా ఉంది. ఇద్దరం ఒకచోట లేకున్నా ఇద్దరం ఆర్మీలోనే ఉన్నామన్న భావనను ఆర్మీనే మాకు కలిగించింది. మహిళలకు సురక్షితమైన ఉద్యోగరంగం ఆర్మీ అని చెప్పగలను’’ అని మాధురి తన అనుభవాలు కొన్ని చెప్పారు. ‘‘ఉమన్‌లో ఆర్మీ పవర్‌ ఉంది. ఆర్మీకి ఉమన్‌ పవర్‌ అవసరం ఉంది’’ అని చివర్లో మాధురీ కణిట్కర్‌ అన్నమాట.. అమ్మాయిలకు డాక్యుమెంటరీ ఎంత జోష్‌ని ఇచ్చిందో అంతే జోష్‌ను ఇచ్చి ఉండాలి. వారంతా నోటికి రెండు చేతులూ అడ్టుపెట్టుకుని కోరస్‌గా మళ్లొకసారి ‘ఓ’ అని ఉల్లాసంగా చప్పట్లు చరిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement