డాక్టర్ మాధురికి లెఫ్ట్‌నెంట్ జనరల్‌గా త్రీస్టార్ చిహ్నాలు తొడుగుతున్న డైరెక్టర్ జనరల్ అరూప్ బెనర్జీ. పక్కన మాధురి భర్త రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ కాజీవ్ కణిట్కర్
డాక్టర్ మాధురీ కణిట్కర్ శనివారం న్యూఢిల్లీలో పదోన్నతిపై లెఫ్ట్‌నెంట్ జనరల్ బాధ్యతలు స్వీకరించగానే ఆమె భుజం మీదకు భారత సైన్యంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు నక్షత్రాల గుర్తు వచ్చి వాలింది. రక్షణ దళాల వైద్య సిబ్బందికి కొత్త డిప్యూటీ చీఫ్ ఇప్పుడు ఆమె! భారత రక్షణ దళాల చరిత్రలో ఇంతవరకు ఇద్దరే మహిళా లెఫ్ట్‌నెంట్ జనరల్స్. మాధురి ఇప్పుడు మూడో జనరల్ కాగా.. మాధురి, ఆమె భర్త త్రీస్టార్ ఉన్న తొలి దంపతులుగా ఇక నుంచీ గుర్తింపు పొందుతారు. మిలటరీ రంగు చీర, జాకెట్, పైన ఆర్మీ క్యాంప్ ధరించి ఉన్న మాధురికి సైనిక దళ వైద్య సేవల (ఎ.ఎఫ్.ఎం.ఎస్) డైరెక్టర్ జనరల్ లెఫ్ట్‌నెంట్ అరూప్ బెనర్జీ భుజకీర్తులను తగిలిస్తున్నప్పుడు, పక్కనే ఉన్న మాధురి భర్త రాజీవ్ కణిక్టర్ కూడా ఆమె‘ఎపలెట్స్’ (భుజంపై ప్రతిష్ట చిహ్నాలు)ని ఎంతో గర్వంగా సవరించారు.
ముందు డీజీకి అభివాదం తెలియజేసి, ఆ వెంటనే ‘థ్యాంక్యూ సర్’ అని భర్తతో అన్నారు డాక్టర్ మాధురి. రాజీవ్ కూడా సైనికాధికారే. ‘ఆర్మ్‌డ్ కోర్స్’ లో లెఫ్ట్‌నెంట్‌గా ఉండి, 2017 లో క్వార్టర్‌మాస్టర్ జనరల్‌గా త్రీ–స్టార్ హోదాలో రిటైర్ అయ్యారు. ఇప్పుడు డాక్టర్ మాధురికి కూడా త్రీస్టార్ రావడంతో భారత రక్షణ దళంలోనే తొలి త్రీస్టార్ కపుల్‌గా ఈ భార్యాభర్తలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇందుకు దక్కవలసిన అభినందనలు పూర్తిగా మాధురికే అయినప్పటికీ, ‘‘ఉద్యోగం కష్టంగా అనిపించిన పరిస్థితుల్లో.. ‘ఇలాంటప్పుడు చేసేదే ఉద్యోగం’ అని ధైర్యం చెప్పి ఆర్మీలోంచి నన్ను బయటికి రానివ్వకుండా ఆపిన నా భర్తదే ఈ క్రెడిట్ అంతా’’ అని నవ్వుతూ అన్నారు డాక్టర్ మాధురి.
త్రివిధ దళాల ‘నాడీ’మణి
ఎంబీబిఎస్‌లో గోల్డ్ మెడల్
పెళ్లయిన 36 ఏళ్లలో 12 ఏళ్లు మాత్రమే భార్యాభర్తలుగా ఉన్నారు డాక్టర్ మాధురి, రాజీవ్. మిగతా సమయమంతా భారత సైనికులుగానే ఉన్నారు. రక్షణ దళ ఉద్యోగాల్లో శిక్షణ తీసుకుంటున్నప్పటి నుంచే ఒకరిని మించిన వారొకరిగా ఉన్నారు వీళ్లు! నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి రాష్ట్రపతి గోల్డ్ మెడల్‌తో బయటికి వచ్చారు రాజీవ్. మాధురి కూడా అంతే. పుణెలోని ‘ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్’లో బెస్ట్ ఎం.బి.బి.ఎస్. స్టూడెంట్‌గా రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. తర్వాత అదే ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీకి డీన్, డిప్యూటీ కమాండెంట్ అయ్యారు. అలా అయిన తొలి మహిళా అధికారి కూడా ఆమే! శనివారం నాటి పదోన్నతితో రక్షణ దళాల్లోని లెఫ్ట్‌నెంట్ జనరల్ ర్యాంకుకు చేరిన మూడో మహిళా అధికారి అయ్యారు మాధురి. తొలి మహిళ ఎయిర్ మార్షల్ పద్మావతీ బందోపాధ్యాయ్, రెండో మహిళ వైస్ అడ్మిరల్ పునీతా ఆరోరా. వాళ్లిద్దరూ రిటైర్ అయ్యారు. సైన్యంలోని అన్ని విభాగాలలో స్త్రీ పురుష సమానత్వాన్ని కల్పించడానికి ‘పర్మినెంట్ కమిషన్’లోకి మహిళల్ని కూడా అనుమతించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కానీ.. భారత సైన్యంలోని మెడికల్ వింగ్‌లో మొదటి నుంచీ మహిళలకు పర్మినెంట్ కమిషన్‌లో అవకాశం ఉంది. అందువల్లే డాక్టర్ మాధురి విశిష్ట సేవలకు ఇప్పుడీ ఉన్నతస్థాయి హోదా లభించడం సాధ్యమైంది.
సైకిల్‌పై షికారు
పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్
డాక్టర్ మాధురి 1982లో ‘ఆర్మీ మెడికల్ కోర్స్’ (సైనిక వైద్య దళం)లోకి వచ్చారు. ఎం.డి. చేశాక, ఎయిమ్స్‌లో పీడియాట్రిక్ నెఫ్రాలజీ (చిన్నపిల్లల మూత్రపిండ సమస్యలు)లో శిక్షణ పొందారు. ‘ప్రధానమంత్రి శాస్త్ర సాంకేతిక రంగాల వినూత్న ఆవిష్కరణల సలహా మండలి’లో సభ్యులుగా ఉన్నారు. తాజా విధుల్లోకి రాకముందు వరకు ఆర్మీలోని నార్తర్న్ కమాండ్(జమ్మూకశ్మీర్, లఢక్) వైద్యసేవల విభాగానికి అధికారిగా ఉన్నారు. ‘‘అక్కడ పని చేస్తున్నప్పుడు యుద్ధక్షేత్రంలోని ప్రతికూల పరిస్థితుల్లో వైద్య సంరక్షణ ఎంత కీలకమైన బాధ్యతో తెలిసింది. అక్కడ ఏ రోజుకారోజు స్పష్టమైన అత్యున్నతస్థాయి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా పని చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ అనుభవం ఉపయోపడుతుంది’’ అని డాక్టర్ మాధురి అన్నారు. మాధురి కణిట్కర్ కర్ణాటకలోని ధర్వార్‌లో జన్మించారు. తండ్రి చంద్రకాంత్ గోపాల్రావ్, తల్లి హేమలతా చంద్రకాంత్ ఖోట్. కణిట్కర్ దంపతులకు 1982లో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. నిఖిల్, విభూతి.
Comments
Please login to add a commentAdd a comment