
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్‌లతో సరిహద్దుల్లో సుదీర్ఘ కార్యాచరణ అనుభవమున్న లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 30వ ఆర్మీ చీఫ్‌గా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రిటైరయ్యారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022–2024 సంవత్సరాల మధ్య ఆయన జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ ఆఫ్ నార్తర్న్ కమాండ్‌గా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక స్కూల్ విద్యార్థి అయిన జనరల్ ద్వివేది 1984లో జమ్మూకశీ్మర్ రైఫిల్స్ రెజిమెంట్‌లో చేరారు. పరమ విశిష్ట సేవ, అతి విశిష్ట సేవ పతకాలు పొందారు.
ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ క్లాస్‌మేట్స్
దేశ సైనిక చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆర్మీకి, నేవీకి సారథ్యం వహిస్తున్న ఇద్దరూ క్లాస్‌మేట్స్ కావడం విశేషం. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్ స్కూల్‌లో సహాధ్యాయులు. 1970లలో వీరిద్దరూ అక్కడ ఐదో తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. వీరిద్దరి రోల్ నంబర్లు కూడా దగ్గరదగ్గరగా ఉన్నాయి. జనరల్ ద్వివేది రోల్ నంబర్ 931 కాగా, అడ్మిరల్ త్రిపాఠీ నంబర్ 938. పాఠశాల దశలో మొదలైన వీరి స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. వేర్వేరు బాధ్యతల్లో ఉన్నప్పటికీ వీరి మైత్రి చెక్కుచెదరలేదు. రెండు నెలల వ్యవధిలోనే ఈ ఏడాది మేలో అడ్మిరల్ త్రిపాఠీ నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా, తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ అయ్యారు.