new Army Chief
-
ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్లతో సరిహద్దుల్లో సుదీర్ఘ కార్యాచరణ అనుభవమున్న లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 30వ ఆర్మీ చీఫ్‌గా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రిటైరయ్యారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022–2024 సంవత్సరాల మధ్య ఆయన జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ ఆఫ్ నార్తర్న్ కమాండ్‌గా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక స్కూల్ విద్యార్థి అయిన జనరల్ ద్వివేది 1984లో జమ్మూకశీ్మర్ రైఫిల్స్ రెజిమెంట్‌లో చేరారు. పరమ విశిష్ట సేవ, అతి విశిష్ట సేవ పతకాలు పొందారు.ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ క్లాస్మేట్స్ దేశ సైనిక చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆర్మీకి, నేవీకి సారథ్యం వహిస్తున్న ఇద్దరూ క్లాస్మేట్స్ కావడం విశేషం. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్ స్కూల్లో సహాధ్యాయులు. 1970లలో వీరిద్దరూ అక్కడ ఐదో తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. వీరిద్దరి రోల్ నంబర్లు కూడా దగ్గరదగ్గరగా ఉన్నాయి. జనరల్ ద్వివేది రోల్ నంబర్ 931 కాగా, అడ్మిరల్ త్రిపాఠీ నంబర్ 938. పాఠశాల దశలో మొదలైన వీరి స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. వేర్వేరు బాధ్యతల్లో ఉన్నప్పటికీ వీరి మైత్రి చెక్కుచెదరలేదు. రెండు నెలల వ్యవధిలోనే ఈ ఏడాది మేలో అడ్మిరల్ త్రిపాఠీ నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా, తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ అయ్యారు. -
పాక్ సైన్యానికి కొత్త బాస్
పాకిస్తాన్లో సైనిక దళాల ప్రధానాధికారి పదవి చుట్టూ కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. చివరకు ఆ పదవి లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మునీర్‌కే దక్కింది. ఈ నెల 29న లాంఛనంగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. పాక్ పుట్టుపూర్వోత్తరాలూ, తీరు తెన్నులూ గమనించే వారికి దేశాధ్యక్ష, ప్రధాని పదవులకన్నా సైనిక దళాల ప్రధానాధికారి పదవికి అక్కడుండే ప్రాధాన్యత అసాధారణమైనదని ఇట్టే తెలుస్తుంది. రాజ్యాంగంలో రాసుకున్న దానికి భిన్నంగా అత్యంత శక్తిమంతమైన పదవిగా అదెందుకు మారిందో చెప్పటం అంత సులభం కాదు. కార్యనిర్వాహక వ్యవస్థ చెప్పినట్టు నడుచుకోవటానికి భిన్నంగా దాన్నే శాసించే స్థాయికి సైన్యం రావ టంలో అవినీతి రాజకీయ నేతల బాధ్యతే అధికం. ఆ సంగతలా ఉంచి మూడు దశాబ్దాలుగా సైనిక దళాల ప్రధానాధికారి పదవి ఎంపిక ప్రక్రియ చిన్న చిన్న ఇబ్బందులు మినహా సజావుగానే సాగుతోంది. కానీ ఈసారి మాత్రం పెను వివాదాలు చుట్టుముట్టాయి. లెఫ్టినెంట్ జనరల్ మునీర్‌కు ఆర్మీ చీఫ్ పదవి రాదని కొందరూ, వస్తుందని కొందరూ విశ్లేషణలు చేశారు. ఆయనకు ఆ పదవి దక్కనీయనని ఈమధ్యే మాజీ ప్రధానిగా మారిన ఇమ్రాన్ ఖాన్ ప్రతిజ్ఞలు చేశారు. తమ పార్టీనుంచి ఎన్నికైన దేశాధ్యక్షుడి ద్వారా ఆయన ఎంపికను నిలువరిస్తానన్నారు. కానీ వీటన్నిటినీ దాటుకుని కోటలో పాగా వేయటం లెఫ్టినెంట్ మునీర్‌కి సాధ్యపడిందంటే ఆయనెంత అఖండుడో అర్థం అవుతుంది. పదవీ విరమణ చేయబోతున్న జనరల్ జావేద్ బజ్వా తర్వాత సైన్యంలో అత్యంత సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ మునీరే. ఆ రకంగా ఆ పదవి మునీర్ కే దక్కాలి. కానీ బజ్వా కన్నా రెండు రోజుల ముందు... అంటే ఈ నెల 27తో ఆయన పదవీకాలం ముగియాలి. కానీ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఆర్మీ చట్టం కింద ‘దేశ భద్రత’ను కారణంగా చూపుతూ మునీర్‌ను సర్వీసులో కొనసాగించాలని నిర్ణయించింది. ఒకసారి ఆర్మీ చీఫ్ అయ్యాక ఆయన పదవీకాలం మూడేళ్లు పెరుగుతుంది. అప్పటికున్న ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగితే బజ్వా మాదిరే రెండోసారి పొడిగింపు తెచ్చుకుని మరో మూడేళ్లు ఆర్మీ చీఫ్‌గా కొనసాగవచ్చు. ఇలా జరిగే అవకాశం ఉండబట్టే ఇమ్రాన్ మునీర్‌కు మోకాలడ్డారు. సైన్యం కనుసన్నల్లో నడిచే గూఢచార సంస్థ ఐఎస్ఐకి డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన కాలంలో మునీర్ తన కుటుంబ ఆస్తుల కూపీ లాగటానికి ప్రయత్నించటమే ఇమ్రాన్ ఆగ్రహానికి కారణం. అప్పట్లో బజ్వాతో తన సంబంధాలు బాగుండటంతో మునీర్‌ను ఐఎస్ఐ నుంచి తప్పించగలిగారు. అలాంటి అధికారి ఆర్మీ చీఫ్ కావటం ఇమ్రాన్‌కు కోపం తెప్పించటంలో వింతేమీ లేదు. సాధారణంగా అయితే పొరుగు దేశం ఆంతరంగిక విషయాలు మనల్ని పెద్దగా ప్రభావితం చేయవు. కానీ పాకిస్తాన్ తీరు వేరు. సైన్యంలో ఉండే లుకలుకలూ, సైన్యానికి పౌర ప్రభుత్వంతో ఉండే విభేదాలూ తరచు భారత్‌కు సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ఎన్నికైన ప్రభుత్వం మన దేశంతో మంచి సంబంధాలు కలిగివుండాలని వాంఛిం చిన మరుక్షణం ఆ ప్రయత్నాన్ని వమ్ము చేయటానికి అక్కడి సైన్యం ఎత్తులు వేస్తుంది. ఎల్ఓసీలో అకారణంగా కాల్పులకు దిగుతుంది. దేశంలో భారత్ వ్యతిరేకత ప్రబలేలా చూడటమే ఈ ఎత్తుగడ వెనకున్న లక్ష్యం. దీనికితోడు ఇమ్రాన్‌పై బజ్వా కయ్యానికి కాలుదువ్విన పర్యవసానంగా అక్కడి సైన్యంలో ఇమ్రాన్ వ్యతిరేక, ఇమ్రాన్ అనుకూల వర్గాలు ఏర్పడ్డాయి. అంతకుముందు ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్‌ను చిక్కుల్లో పడేసి, ఇమ్రాన్‌కు అధికారం దక్కటానికి సైన్యం తెరవెనక ఎటువంటి పాత్ర పోషించిందో బహిరంగ రహస్యం. బజ్వా తన వ్యక్తిగత విభేదాలతో ఇమ్రాన్‌ను తొలగించటం వల్ల నవాజ్ షరీఫ్ సోదరుడైన షెహ్‌బాజ్‌ను నెత్తికెక్కించుకోవాల్సి వచ్చిందని సైన్యంలో ఒక వర్గం మండిపడుతోంది. లండన్‌లో మకాం వేసిన నవాజ్ అక్కడినుంచే సలహాలిస్తూ సర్కారును నడిపిస్తున్నారు. బజ్వా మొదటినుంచీ భారత్ వ్యతిరేకి. నవాజ్ మనతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవా లని భావించినప్పుడు దాన్ని వమ్ము చేసిన ఘనుడు బజ్వాయే. ఆ పని కూడా ఇప్పుడు ఆర్మీ చీఫ్ కాబోతున్న మునీర్‌తోనే చేయించారు. పుల్వామాలో మన జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి మునీర్ ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్నప్పుడే చోటుచేసుకుంది. దానికి ప్రతీకారంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై మన దేశం దాడి చేసినప్పుడు మిగ్ యుద్ధ విమానం కూలి పైలెట్ అభినందన్ వర్ధమాన్ అక్కడి సైన్యానికి పట్టుబడ్డారు. ఆ సమయంలో ఆయనకు హాని జరక్కుండా చూడాలని జాతీయ భద్రతా సలహా దారు అజిత్ డోవల్ మాట్లాడింది కూడా మునీర్‌తోనే. అయితే ఆయన రావటంవల్ల మన దేశానికి మరిన్ని సమస్యలొస్తాయని చెప్పలేం. మొదట్లో భారత్ వ్యతిరేకిగా ఉన్న బజ్వా చివరికొచ్చే సరికి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడారు. అందుకు కారణం ఉగ్రవాదులకు సాయం అంది స్తున్న కారణంగా పాక్‌కు రావాల్సిన ఆర్థిక సాయం నిలిచిపోవటం. అది సరిచేసుకుని, అమెరికా మెప్పు పొంది ఎఫ్–16 యుద్ధ విమానాలు రాబట్టడంలో బజ్వా విజయం సాధించారు. అయితే పొరుగున అఫ్గాన్‌లో తాలిబన్ల హవా వచ్చాక తమ ప్రభ వెలిగిపోతుందనుకున్న పాక్ సైన్యం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటంతో అయోమయంలో పడింది. తాలిబన్లతో సరిహద్దు వివాదం తప్పటం లేదు. ఈ స్థితిలో మునీర్ రాకవల్ల మనకు కొత్తగా సమస్యలు రాకపోవచ్చు. ఏదేమైనా తగిన జాగ్రత్తలో ఉండటం తప్పనిసరి. -
Asim Munir: ఇమ్రాన్ ఖాన్ టార్గెట్‌గా పాక్ సర్కార్..
మన పొరుగు దేశం పాక్ ఆర్మీకి కొత్త సైన్యాధ్యక్షుడి నియామకం ఇవాళ(గురువారం) జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను పాకిస్థాన్ సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించింది అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు నియామక ఫైల్‌ను ఆ దేశ అధ్యక్షుడి ఆమోదం కోసం పంపింది. అయితే ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని సర్కార్ మునీర్‌ను ఎంపిక చేయడం, దాని వెనుక నాటకీయ పరిణామాలు ఉండడంతో రాజకీయపరమైన చర్చ నడుస్తోంది అక్కడ. అసీమ్ మునీర్.. ప్రస్తుతం రావల్పిండిలోని పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో క్వార్టర్ మాస్టర్ జనరల్ హోదాలో ఉన్నారు. ఆయనకు పాక్ ఆర్మీలో టూ స్టార్ జనరల్ హోదా దక్కి నాలుగేళ్లు అవుతోంది. సాధారణంగా పాక్ ఆర్మీ చీఫ్ పదవికి అర్హత.. లెఫ్టినెంట్ జనరల్‌గా నాలుగేళ్ల అనుభవం ఉంటే చాలూ. కానీ, నవంబర్ 27వ తేదీన ఆయన లెఫ్టినెంట్ జనరల్‌గా అసీమ్ పదవీకాలం ముగియబోతోంది. అదే సమయంలో నవంబర్ 29వ తేదీతో ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా రిటైర్ అవుతారు. ఈ తరుణంలో ఆగమేఘాల మీద అసీమ్ పేరును పాక్ ఆర్మీ చీఫ్‌గా ప్రకటించడం వెనుక షెహ్బాజ్ సర్కార్ ఉద్దేశం వేరే ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ కారణం.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు.. అసీమ్ మునీర్‌కు అస్సలు పడకపోవడం!. ప్రస్తుతం ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాకు అత్యంత ఆప్తుడు అసీమ్ మునీర్. బ్రిగేడియర్‌గా ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్యా అనుబంధం ఉంది. మునీర్.. 2017లో పాక్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్మహించాడు. ఆపై 2019 ఫిబ్రవరిలో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌కు చీఫ్‌గా ప్రమోషన్ మీద వెళ్లాడు. అయితే.. అప్పటి అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌తో వైరం.. ఆయన్ని ఐఎస్ఐ చీఫ్ బాధ్యతల నుంచి ఎనిమిది నెలలకే తప్పించింది. ఆ స్థానంలో తనకు అనుకూలంగా ఉండే లెఫ్టినెంట్ జనరల్ ఫయిజ్ హమిద్‌ను నియమించింది ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ప్రభుత్వం. ఆపై అసీమ్‌పై ప్రతీకారంతో 30వ కోర్కు కమాండర్‌గా బదిలీ చేశారు. ఐఎస్ఐ చీఫ్ హోదాలో ఉండి ఇమ్రాన్ భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించడమే అసీమ్ మునీర్ తప్పిదం!. తద్వారా పాక్ చరిత్రలో ఐఎస్ఐకి అత్యంత తక్కువ కాలం చీఫ్‌గా పని చేసిన రికార్డు అసీమ్ ఖాతాలో చేరింది. ఇక.. జజ్వాకు, ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. ఆమధ్య పాక్ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మాన సమయంలోనూ తనకు అనుకూలంగా వ్యవహరించకపోవడంపై ఇమ్రాన్ ఖాన్ అసంతృప్తితో రగిలిపోయాడు. పాక్ రాజకీయాల్లో ఆర్మీ జోక్యం ఎక్కువైందంటూ బహిరంగ విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలోనూ ముందస్తు ఎన్నికలు డిమాండ్ చేస్తున్న ఆయన.. దాదాపు ప్రతీ ప్రసంగంలోనూ ఆర్మీ చీఫ్ బజ్వాపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. ఈ తరుణంలో తన ఆప్తుడి(అసీమ్) నియామకానికి బజ్వా మద్దతు ఇచ్చారనే చర్చ నడుస్తోంది అక్కడ. బజ్వా సిఫార్సుతోనే ఆర్మీ చీఫ్ రేసులో అర్హులైన నలుగురు సీనియర్లు ఉన్నా.. ఇమ్రాన్ ఖాన్‌ను కట్టడి చేస్తాడనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్న అసీమ్‌కు కీలక పదవి అప్పజెప్పారనే చర్చ నడుస్తోంది. భారత్‌తో ఎలా ఉంటాడో? భారత్‌పై ఆపరేషన్స్‌లో అసీమ్ మునీర్‌కు అనుభవం ఉంది. ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్నప్పుడు.. పుల్వామా దాడి జరిగింది. ఆ సమయంలో పాక్ ఆర్మీ కీలక నిర్ణయాల్లో, కార్యకలాపాల్లో మునీర్‌దే కీలక పాత్రగా ఉండేది. దీంతో పాక్ కొత్త జనరల్ నియామకం భారత్-పాక్ సంబంధాలపై ప్రభావం చూపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. జనరల్ బజ్వా కిందటి ఏడాది మన దేశంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాడు. ఈ నేపథ్యంలో కొత్త జనరల్ అసీమ మునీర్ విధానం ఎలా ఉండబోతుందనే చర్చ మన ఆర్మీలోనూ మొదలైంది. 2025 వరకు మునీర్ ఈ పదవిలో కొనసాగనున్నారు. -
నేడు అర్మీ ఛీఫ్‌గా దల్బీర్ సింగ్ సుహాగ్
-
దల్బీర్సింగ్కు లైన్ క్లీయర్
న్యూఢిల్లీ: ఆర్మీ కొత్త చీఫ్ నియామకం విషయంలో ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ అంశంలో ముందుకే వెళ్లాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ పదవికి ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ పేరును సిఫారసు చేస్తూ రక్షణశాఖ కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ)కి నివేదించింది. లెఫ్టినెంట్ జనరళ్లలో ఈయనే సీనియర్. ప్రధాని అధ్యక్షతన గల ఏసీసీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల సమయంలో ఆర్మీ కొత్త చీఫ్ నియామకాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో దీనిపై వివాదం నెలకొంది. ఈ నిర్ణయాన్ని ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలివేయాలని బీజేపీ కోరింది. దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. వాస్తవానికి రక్షణ శాఖకు సంబంధించి నియామకాలు, పదోన్నతులు, టెండర్లు, కొనుగోళ్లు అనేవి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకు రావని ఈసీ మార్చి 27నే స్పష్టం చేసింది. అయితే, బీజేపీ అభ్యంతరాల నడుమ ఈ అంశాన్ని కేంద్రం గత వారం ఈసీకి నివేదించింది. ఈసీ అనుమతిస్తేనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత ఆదేశాలకు అనుగుణంగానే ఈ అంశంలో ప్రభుత్వం ముందుకు వెళ్లవచ్చని ఈసీ తాజాగా స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.