లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్
న్యూఢిల్లీ: ఆర్మీ కొత్త చీఫ్ నియామకం విషయంలో ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ అంశంలో ముందుకే వెళ్లాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ పదవికి ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ పేరును సిఫారసు చేస్తూ రక్షణశాఖ కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ)కి నివేదించింది. లెఫ్టినెంట్ జనరళ్లలో ఈయనే సీనియర్. ప్రధాని అధ్యక్షతన గల ఏసీసీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల సమయంలో ఆర్మీ కొత్త చీఫ్ నియామకాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో దీనిపై వివాదం నెలకొంది. ఈ నిర్ణయాన్ని ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలివేయాలని బీజేపీ కోరింది. దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది.
వాస్తవానికి రక్షణ శాఖకు సంబంధించి నియామకాలు, పదోన్నతులు, టెండర్లు, కొనుగోళ్లు అనేవి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకు రావని ఈసీ మార్చి 27నే స్పష్టం చేసింది. అయితే, బీజేపీ అభ్యంతరాల నడుమ ఈ అంశాన్ని కేంద్రం గత వారం ఈసీకి నివేదించింది. ఈసీ అనుమతిస్తేనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత ఆదేశాలకు అనుగుణంగానే ఈ అంశంలో ప్రభుత్వం ముందుకు వెళ్లవచ్చని ఈసీ తాజాగా స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.