శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల అసహనం పెరుగుతోందని 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్(జీవోసీ) లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే అన్నారు. లోయలో ఉగ్రవాదం ఇదివరకటి ఆకర్షణ కోల్పోయిందనీ, ప్రస్తుతం పరిస్థితులు పరివర్తన దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. కశ్మీర్ యువత, ముఖ్యంగా 20–25 ఏళ్ల వారు హింసతో సాధించేదేమీ లేదన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. దీంతో, తాము చేస్తున్నది తప్పో, ఒప్పో తెలియని 16–19 ఏళ్ల టీనేజర్లను ఉగ్రవాదం ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
కొత్త రిక్రూట్‌మెంట్లు 2021లో మూడో వంతుకు అంటే, 142కు తగ్గి పోయాయని చెప్పారు. అక్రమ చొరబాట్లు తగ్గాయి. స్థానికుల సహకారంతో నిఘా వ్యవస్థ బలోపేతమైంది. ఫలితంగా గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 330 మంది ఉగ్రవాదులు హతం కావడమో, లొంగిపోవడమో జరిగిందన్నారు. గత 15 ఏళ్లలో ఇదే అత్యధికమని డీపీ పాండే విశ్లేషించారు. లోయలో మిగతా ఉగ్రవాదులకు కూడా సహకారం అందకుండా పోయే రోజు త్వరలోనే వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
2021లో 151 మంది స్థానికులు, 20 మంది పాకిస్తానీయులు కలిపి మొత్తం 171 మంది ఉగ్రవాదులు హతం కాగా, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 10 మంది పాకిస్తానీయులతో కలిపి 45 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు గణాంకాలను వెల్లడించారు. గత ఏడాది 87 మంది ఉగ్రవాదులు, లొంగిపోవడమో, పట్టుబడటమో జరగ్గా ఈ ఏడాది 27 మంది పట్టుబడ్డారని లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment