బాధితురాలు సమీనా బేగం
సాక్షి, కుల్కచర్ల: బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన ఓ మహిళ తను అక్కడ తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నానని, ఇక్కడి నుంచి తీసుకెళ్లకపోతే చనిపోతానంటూ సోషల్ మీడియా లో పోస్టు చేయడం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. వివరాలు.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన సయ్యద్ మౌలానా కూతురు సయ్యద్ సమీనా బేగంను హైదరాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. భర్త సక్రమంగా చూసుకోకపోవడంతో తిరిగి పుట్టిల్లు కుల్కచర్లకు వచ్చింది. కొడుకు ఆరోగ్యం బాగలేదని, డబ్బులు కావాలని వైద్యులు చెప్పడంతో స్థానికంగా ఉపాధి లేకపోవడంతో ఆమె తన కు మారుడిని సోదరి వద్ద ఉంచింది.
ఓ నకిలీ ఏజెంట్ ద్వారా మూడు నెలల క్రితం దుబాయికి వెళ్లింది. అక్కడ ఓ షేక్ ఇంట్లో పనికి కుదిరింది. కొన్ని రోజులుగా షేక్ కుటుంబీకులు రేయింబవళ్లు పనిచేస్తుండడంతోపాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో ఆమె షేక్ ఇంటి నుంచి పారిపోయి వేరే వారి దగ్గరకు వెళ్లింది. అక్కడి నుంచి వాట్సప్ ద్వారా వీడియో సందేశాన్ని కుటుంబీకులకు పంపింది. తనను ఇక్కడ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమైంది. తాను ఇక్కడ ఉండలేనని, ఇండియాకు తీసుకెళ్లాలని కోరింది. లేదంటే చనిపోతానని చెప్పింది. ఈ విషయం గురువారం కుల్కచర్ల మండలంలో సోషల్ మీడియాలో హల్‌చల్ అయింది.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.సమాచారం అందుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్‌రావు, కుల్కచర్ల సర్పంచ్ సౌమ్యా వెంకట్‌రామిరెడ్డి తదితరులు బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబీకులతో మాట్లాడారు. వారికి భరోసా చెప్పి కొంతమేర ఆర్థికసాయం అందించారు. ఈ విషయమై ఆయన కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరించారు. తప్పనిసరిగా బాధితురాలిని ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని ప్రహ్లాద్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment