నిపుణులు, టెక్నాలజీ పెద్దలు ఊహించినట్టుగానే సోషల్ మీడియా పెద్ద ప్రమాదంగా పరిణమిస్తోంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా జ్ఞానాన్ని, సమాచారాన్ని పంచాల్సిన టెక్ విప్లవం కాస్తా మనుషుల ప్రాణాల్ని బలితీసుకుంటోంది. హద్దూ, పద్దూ లేని సోషల్ మీడియా యూజర్లు విచక్షణా రహితంగా వేధిస్తున్నారు. కేన్సర్‌లా విస్తరిస్తున్న ఈ ట్రోలింగ్ చాలామందిని మానసికవేదన గురిచేస్తోంది. చివరికి తట్టుకోలేక ముఖ్యంగా మహిళలు తమ ఉసురు తీసుకుంటున్నారు. తెనాలికి చెందిన ఇద్దరు బిడ్డల తల్లి గీతాంజలి విషాద గాథ ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు , యూ ట్యూబ్ తదితర ఆన్‌లైన్ ఫార్మాట్‌లో చోటు చేసుకునే ఈ వేధింపులు మహిళలు, పిల్లల పాలిట అత్యంత ప్రమాదకరకరంగా మారుతున్నాయి. మహిళా రాజకీయ నేతలు, సెలబ్రిటీల నుంచి సామాన్య మహిళల దాకా నెట్టింట ట్రోలింగ్ భరించలేని మానసిక క్షోభకు గురి చేస్తోంది. కూచుంటే తప్పు..లేస్తే తప్పు అన్నట్టు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి తమ అభిమాన నాయకుడి మీద అభిమానాన్ని చాటుకోవడం కూడా నేరంగా మారిపోయింది. అల్లరి మూకల దారుణమైన వ్యాఖ్యల్ని తట్టుకోలేక గీతాంజలి తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమే. కానీ ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్త, ముద్దులొలికే ఇద్దరు చిన్నారులను కూడా కాదని ఇంతటి నిర్ణయం తీసుకుందంటే ఈ ట్రోలింగ్ మూకల ఆగడాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
మహిళా సెలబ్రిటీలు, హీరోయిన్ల విషయంలో అయితే మరీ రెచ్చిపోతారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా, నటి అనసూయ, తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ఆఖరికి మహిళా ఉద్యమనేతలు సంధ్య, దేవీ లాంటివాళ్లపై దుర్బాషలాడుతూ, చదవలేని రీతిలో కామెంట్లు పెడుతూ ట్రోల్స్ చేస్తుంటారు.
ఇక సినిమా పరిశ్రమలోని మహిళల పరిస్థితి మరీ దారుణం. లేటుగా పెళ్లి చేసుకుంటే.. తప్పు...లేటుగా గర్భం ధరిస్తే తప్పు.. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడం, కమెంట్లు చేయడం పరి పాటిగా మారిపోయింది. ఇదే వ్యాఖ్యలు ఒక హీరో మీద చేయగలరా? భార్య ఉండగానే మరో మహిళతో బిడ్డనికంటూ, చట్టాలను గౌరవించకుండా వరుస పెళ్లిళ్లతో సమాజానికే సిగ్గు చేటుగా మారుతున్న హీరోల నైజాన్ని ప్రశ్నించగలరా?
చీడపురుగులా వ్యాపిస్తున్న ట్రోలింగ్‌కు ఇకనైనా అడ్డుకట్టపడాలి. దీన్నిపెంచి పోషిస్తున్న వారెంతటివారైనా తగిన శిక్షలు పడాలి. అపుడు మాత్రమే ట్రోలింగ్ భూతం అంతమవుతుంది. అలాగే మనుషులుగా మనం కూడా విచక్షణ కోల్పోకూడదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రాధాన్యతలు వారికి ఉంటాయనే విషయాన్ని మర్చిపోకూడదు. పరస్పరం గౌరవించుకోవాలి. అదే గీతాంజలికి మనం అర్పించే ఘన నివాళి అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment