ప్రతీకాత్మక చిత్రం
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) : సౌదీ అరేబియాలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంతో అక్కడి కంపెనీలు కుదేలయ్యాయి. ఆ ప్రభావం ఇంటి కార్లు నడిపించే డ్రైవర్లపైనా పడింది. షేక్‌లు నష్టాలను చవిచూడటంతో డ్రైవర్లకు వేతనాలు తగ్గించడం, కొంత మందికి కొన్ని నెలల వేతనాలు ఇవ్వకుండా వేధించడం జరిగింది. ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దేశ ప్రభుత్వం మహిళలపై ఉన్న కఠిన చట్టాల్లో మార్పులకు అవకాశం కల్పించింది.
దీనికి తోడు అక్కడి మహిళల్లో చైతన్యం రావడంతో ప్రభుత్వం కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. మహిళలు డ్రైవింగ్ నేర్చుకుని సొంతంగా కార్లు నడుపుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఆడవారికి డ్రైవింగ్‌కు అవకాశం ఉంది. కళాశాలకు వెళ్లే వారు, ఉద్యోగాలు చేసేవారు, ఇతరత్రా పనులు చేసే మహిళలకు సౌదీ ప్రభుత్వం కేటాయించిన సమయం అనుకూలంగా మారింది.
దీంతో అనేక మంది డ్రైవర్లను అరబ్ షేక్‌లు తొలగించారు. ఒక ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది డ్రైవర్లు ఉంటే ఒక్కరినే కొనసాగిస్తూ ఇతరులను తొలగిస్తున్నారు. అంతేగాక గతంలో ఇచ్చిన వేతనాలను ఇప్పుడు ఇవ్వకుండా కోత విధిస్తున్నారు. ఒప్పందం ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా షేక్‌లకు ఎదురు చెప్పే ధైర్యం మనవారికి లేక తక్కువ వేతనాలకే విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇప్పుడున్న పరిస్థితిలో మన కరెన్సీలో రూ.18వేలకు మించి వేతనం లభించడం లేదు. భోజనం ఇతర ఖర్చులకు రూ.8వేలను మినహాయిస్తే మన కార్మికులు తమ ఇంటికి పంపించేది రూ.10వేల మాత్రమే. రోజు రోజుకు ఖర్చులు పెరుగుతుండటంతో సౌదీలో డ్రైవర్ విధుల నిర్వహణ వెట్టి చాకిరే అవుతుంది. ఇప్పటికే వందలాది మంది డ్రైవర్లను సౌదిలోని షేక్‌లు తొలగించారు. ఉపాధి కోల్పోయి ఇంటికి చేరిన వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలనే డిమాండ్ వినిపిస్తోంది.
డ్రైవర్ కొలువులకు పెద్ద పీట వేసిన సౌదీ అరేబియాలో ప్రస్తుతం భిన్నమైన పరిస్థితి నెలకొంది. సౌదీ అరేబియాలోని మహిళలు సొంతంగా డ్రైవింగ్ చేసుకోవచ్చని అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మనవారి డ్రైవర్ కొలువులకు కోత పడింది. ఆ దేశంలో నాలుగు నెలల ముందు వరకు మహిళలు డ్రైవింగ్ చేయడం నిషేధం. ఈ నిషేధం మొదటి నుంచి కొనసాగుతుంది. దీంతో సౌదీలో ఇంటికి, కంపెనీలకు సంబంధించిన కార్లు, ఇతర వాహనాలను పురుషులే నడపాల్సి ఉంది.
ప్రధానంగా ఇళ్లలోని ఆడవారిని బయటకు తీసుకెళ్లి.. మళ్లీ ఇంట్లో దిగబెట్టడానికి మగవారే డ్రైవింగ్ చేస్తారు. అలాగే అరబ్ షేక్‌ల పిల్లలను స్కూళ్లు, కళాశాలలకు తీసుకెళ్లి.. తీసుకరావడానికి కూడా డ్రైవర్లు అవసరం. సౌదీ అరేబియా మినహా మిగిలిన గల్ఫ్ దేశాల్లో ఆడవారికి డ్రైవింగ్‌కు అనుమతి ఉంది. ఒక్క ఈ దేశంలోనే మహిళల స్వేచ్చపై కఠినమైన ఆంక్షలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఇంటి కార్లు నడపడానికి డ్రైవర్లు అవసరం కావడంతో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందిన మన కార్మికులు అనేక మంది సౌదీలో డ్రైవర్లుగా చేరారు.
ఒక్కో ఇంటికి మూడు నుంచి ఐదు కార్లు ఉంటాయి. మరి కొందరు షేక్‌ల ఆర్థిక స్థితి బాగుంటే ఇంకా ఎక్కువ కార్లు ఉంటాయి. ఒక్కో ఇంటికి ఇద్దరు నుంచి ఐదుగురు వరకు డ్రైవర్లను షేక్‌లు పనిలోకి తీసుకున్నారు. పనికి తగిన వేతనం కూడా గతంలో లభించింది. ఒక్కో డ్రైవర్‌కు మన కరెన్సీలో రూ.20వేల నుంచి రూ.25వేల వరకు జీతం వచ్చింది. సీనియర్ డ్రైవర్లకైతే రూ.35వేల వరకు వేతనం లభించిన సందర్భాలు ఉన్నాయి.
వేతనంతో పాటు టిప్పుల రూపంలోనూ డ్రైవర్లకు అదనపు ఆదాయం సమకూరేది. మంచి వేతనంతో పాటు నివాస సదుపాయాన్ని అరబ్ షేక్‌లు కల్పించేవారు. కేవలం భోజనం మాత్రమే డ్రైవర్లు సమకూర్చుకోవాలి. సౌదీలో డ్రైవింగ్ చేయడానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ కార్మికులు ముందుకు వచ్చినా అరబ్ షేక్‌లు ఎక్కువగా తెలంగాణ కార్మికులకే ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడ 80 శాతం మంది డ్రైవర్లు తెలంగాణవారే.
ఆరు నెలల జీతం ఎగ్గొట్టారు..
నా పేరు మహబూబ్. మాది ఏర్గట్ల. నేను ఐదేళ్ల నుంచి సౌదీలో హౌస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాను. నెలకు వేతనం రూ.20వేల వరకు లభించేది. డ్రైవర్‌గా చేరిన రెండేళ్లలో వేతనం సక్రమంగానే ఇచ్చారు. ఆ తరువాత కోత విధించడం మొదలు పెట్టారు. నెలకు రూ.20వేలు ఉన్న వేతనం రూ.18 వేలకు తగ్గించారు. ప్రశ్నిస్తే ఏదైనా నేరం మోపి పోలీసులకు పట్టిస్తారనే భయంతో యజమానిని ఏమీ అడుగలేదు. ఆరు నెలల పాటు వేతనం ఇవ్వలేదు.
ఇంటికి వెళ్లే ముందు ఇస్తామని చెబితే ఓపికతో ఉన్నా. చివరకు విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. చేసేది లేక ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చే ముందు ఆరు నెలల వేతనం చెల్లించాలని కోరితే లేదు పొమ్మన్నారు. లక్షా ఎనిమిది వేల రూపాయల వేతనం ఎగ్గొట్టారు.
వేతనం తగ్గించి ఒప్పందం చేసుకున్నారు
నా పేరు ఇర్ఫాన్. మాది పాలెం గ్రామం. సౌదీలో ఇంటి కారు నడుపడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఏజెంటు మొదట నెలకు రూ.20వేలు అని చెప్పాడు. కానీ ఇప్పుడు సౌదీలో డ్రైవర్లకు డిమాండ్ లేకపోవడంతో వేతనం తగ్గిస్తున్నారు. నెలకు రూ.18వేలకు మించి వేతనం ఇవ్వమన్నారు. తక్కువ వేతనమైనా కొన్ని రోజులు పనిచేయాలనే ఉద్దేశంతో వీసా కోసం డబ్బులు చెల్లించాను. ఒప్పందం ప్రకారం వేతనం ఇస్తే ఇంటికి కొంత సొమ్ము పంపవచ్చు. ఇవ్వకపోతే మాత్రం నష్టపోతాం. అంతా అల్లాపై నమ్మకం ఉంచి సౌదీకి పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment