సాక్షి, రాయచోటి: నిత్యం కరవుతో అల్లాడుతున్న వైఎస్సార్ జిల్లా ప్రజలు జీవనోపాధికోసం వలసలు వెళ‍్లడం సర్వసాధారణం అయ్యింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది దళారులు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు వెళితే మంచి ఉపాధితో పాటు మూడుపూటలా భోజనం వారే ఏర్పాటుచేస్తారని దీంతో మీరు లక్షాధికారులు కావచ్చని ఆశ చూపి, ఇక్కడి మహిళలను విదేశాలకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ‍్లిన మహిళలు అష్ట కష్టాలు పడుతూ కనీసం బతికున్నారా... లేదా అనే సమాచారం కూడా తెలియపర్చలేని దుస్థితిలో అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు.
వైఎస్సార్ జిల్లా రాయచోటి మండలం గరుగుపల్లికి చెందిన లక్ష్మిదేవమ్మ అనే మహిళ తొమ‍్మిది నెలల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లింది. అప‍్పటి నుంచి కుటుంబ సభ్యులకు ఆమె గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆమె ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టి లక్ష్మిదేవమ్మను స్వదేశానికి రప్పించారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూలి పనులు చేసుకుంటూ కాపురాన్ని నెట్టుకొస్తున్న లక్ష్మిదేవమ్మ తన ముగ్గురు బిడ్డలకు మంచి భవిష్యత్తు ఏర్పరచాలనే ఉద్ధేశ్యంతో అప్పోసప్పో చేసి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఓ ఏజెంట్ ను ఆశ్రయించింది. నెలకు 18 వేలు జీతం, మూడు పూటలా భోజనం ఇస్తారని ఒక ఇంట్లో ఇంటి పని చేయాల్సి ఉంటుందని ఏజెంట్ చెప్పడంతో గల్ఫ్ బాట పట్టింది. అక్కడికెళ్ళిన లక్ష్మిదేవమ్మకు ఒక పూట మాత్రమే భోజనం ఇచ్చి, నెలకు 13 వేలు చొప్పున మూడు నెలల పాటు రెండు ఇళ్ళల్లో పనులు చేయించుకున్నారు. కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడించేందుకు అనుమతికూడా ఇవ్వలేదు. 9 నెలలు పనిచేసిన లక్ష్మిదేవమ్మకు 3 నెలలు మాత్రమే జీతం ఇచ్చారు. అధిక ఒత్తిడిని తట్టుకోలేని లక్ష్మిదేవమ్మ తాను స్వదేశానికి వెళ్ళిపోతానని చెప్పడంతో ఏజెంట్ కు పెట్టిన డబ్బులు చెల్లించి వెళ్ళిపోవచ్చని లక్ష్మిదేవమ్మ యజమానులు డిమాండ్ చేశారు. లక్ష్మిదేవమ్మ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇక్కడ స్థానికులు రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి లక్ష్మిదేవమ్మను స్వదేశానికి రప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment