గల్ఫ్‌ జీవితాలపై కరోనా దెబ్బ  | Siddipet District Gulf Labour Problems Faced With Coronavirus | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ జీవితాలపై కరోనా దెబ్బ 

Published Wed, Jul 15 2020 8:45 AM | Last Updated on Wed, Jul 15 2020 8:45 AM

Siddipet District Gulf Labour Problems Faced With Coronavirus - Sakshi

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): పొట్ట నింపుకోవడానికి పని చేస్తున్నామా.. పని చేయడానికే తింటున్నామా..అని తెలియని గల్ఫ్‌ బతుకులు ఆందోళనలో పడ్డాయి. తల్లిదండ్రుల గోస తీర్చడానికి కాసుల వేటకు వెళ్లిన జీవితాలు ఆగమయ్యాయి. ఖర్చు పేట్టే ప్రతీ పైసా విలువ తెలిసిన గల్ఫ్‌ బతుకుల్లో కరోనా మహమ్మరి నీళ్లు చల్లింది. ఉన్న ఊరిని, అయిన వారిని వదిలి పెట్టి ఎడారి దేశాలకు ప్రయాణమైన బిడ్డలకు గల్ఫ్‌లో తిండి తిప్పలు లేక కంటి మీద కునుకులేకుండా పోయింది. క్షణ క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. నాలుగు నెలల నుంచి తినడానికి తిండిలేక పస్తులుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఉన్న ఊరికి వచ్చి కన్నోళ్లను, కట్టుకున్న వారిని చూడాలని కళ్లు కాయలు కాసేలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎడారి దేశంలో ప్రతి రోజు కరోనాతో యుద్ధం చేస్తున్న గల్ఫ్‌ అన్నలు  పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం..

పేదరికం, ఆడబిడ్డల పెళ్లి కోసం అప్పులు చేసి కొందరు.. ఇల్లు కట్టి అప్పు అయిందని మరికొందరు.. ఎంత చదివినా సరిపడా వేతనం వచ్చే ఉద్యోగం రాక విద్యార్థులు ఇలా చాలా మంది వివిధ  కారణాలతో నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబ కష్టాలు తిరుద్దామని అప్పులు చేసి అరబ్‌ దేశాలకు వెళ్లిన బతుకుల ఆశలు కరోనా సమాధి చేసింది. అప్పటికే అందరిని వదిలి పరాయి దేశాలకు వెళ్లిన వలస జీవుల బతుకులను కరోనా రూపంలో కష్టాలు చుట్టుముట్టాయి. చేతిలో చిల్లి గవ్వ లేక ఆకలితో అల్లాడుతూ..ఇరుకు గదుల్లో బిక్కుబిక్కుమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు స్థానికులను తప్ప ప్రవాసులను పట్టించుకోకపోవడంతో భయం గుప్పిట్లో వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు.  

ఉమ్మడి జిల్లాలో 80 వేల మంది.. 
ఉమ్మడి మెదక్, కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 80 వేల మంది వలస కార్మికులు విదేశాల్లో ఉన్నారు. దీంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇక్కడి ప్రాంతం నుంచి ఎక్కువగా సౌది, ఓమన్, కత్తర్, కువైట్, మస్కట్, బెహరన్‌ దేశాలకు ఉపాధి కోసం ఎంతో మంది వెళ్లారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో ఇక్కడి కుటుంబాల్లో ఆందోళన నిండింది. తమ వారు ఎలా ఉన్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. మా బతుకుల్లో వెలుగు నింపడానికి వెళ్లిన బతుకులు ఎలా ఉన్నాయో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ వారు అక్కడ ఎలా ఉన్నారో అని ఫోన్లలో వీడియే కాల్‌ చేసి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. తినడానికి డబ్బులు లేకపోతే చెప్పు బిడ్డ అప్పోసప్పో చేసి పంపిస్తా అని ఓతల్లి తన బిడ్డకు చేప్తూ గుండెలు పగిలేలా రోధించింది. ఇక్కడికి నువ్వు మంచిగా వస్తే కూలీనాలి చేసి బతుకుదాం రా బిడ్డ అని కూమారుడికి ధైర్యం చెప్పింది. 

గల్ఫ్‌లో పరిస్థితి ఇలా... 
గల్ఫ్‌లో ఉన్న వలస కార్మికుల పరిస్థితి  దయనీయంగా ఉంది. చేయడానికి పని లేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. సుమారు 3నెలల నుంచి పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో పనులు లేక తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడుతున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి లేక తాత్కాలిక వీసాలపై విదేశాలకు వెళ్లినవారు అక్కడ బిల్డింగ్‌ వర్క్, ప్లంబర్, లేబర్‌ కూలీ, డ్రైవర్, హోటళ్లు, ఐటీపరిశ్రమ, చమురు, గ్యాస్‌ స్టేషన్లు తదితర రంగాల్లో పనులు చేస్తున్నారు. కరోనా వైరస్‌తో అక్కడ అన్ని కంపేనీలు మూసి వేశారు. దీంతో అక్కడ ఉపాధి పొందుతున్న భారతీయులు భారీగా నష్టపోతున్నారు. అలాగే ఇరుకు గదుల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో ఉంచుతున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ దేశాలకు వద్దామంటే విమానాలు లేవని ఆందోళన చెందుతున్నారు.  ఇటీవల  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో మరణించగా ఐన వారు తోడు లేక కుటుంబ సభ్యుల చివరి చూపుకు నోచుకోక గల్ఫ్‌ కారి్మకుల రక్షణ సమితి సభ్యులు కుటుంబ సభ్యులుగా అండగా నిలబడి అంత్యక్రియలు నిర్వహించారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన వ్యక్తి 2 సంవత్సరాల క్రితం దూబాయ్‌ వెళ్లాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నెల రోజుల క్రితం మరణించాడు. కరోనా నేపథ్యంలో విమానాలు లేకపోవడంతో మృతదేహాన్ని స్వదేశానికి పంపలేక దూబాయ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. 

భయం భయంగా బతుకుతున్నాం... 
ప్రతీ క్షణం భయం భయంగా బతుకుతున్నాం. ఫిబ్రవరి నుంచి ఇక్కడ పనులు లేక కంపెనీలు మూత పడ్డాయి. మేము పని చేసిన చివరి నెల జీతం కూడా కంపెనీ చెల్లించలేదు. ఒక్క గదిలో పరిమితికి మించి ఉంటున్నాం. ఇక్కడ ఉండటానికి ఇంటి నుంచే పైసలు పంపుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు కొంచెం ఆదుకుంటున్నాయి. ప్రభుత్వం స్పందించి దేశానికి రప్పించాలి. – నాయిని అనిల్, దుబాయ్‌లో ఉన్న యువకుడు 

స్వదేశానికి రప్పించండి... 
కరోనాతో పని లేక ఇబ్బంది పడుతున్న గల్ఫ్‌ కార్మికులను స్వదేశానికి రప్పించాలి. గల్ఫ్‌ కారి్మకులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశం కాని దేశంలో కార్మికులు తిండిలేక పరిగడుపున నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఇండియాకు రప్పించాలి. ఉన్నత కుటుంబాలకు చెందిన వారిని ప్రత్యేక విమానాల ద్వారా రప్పిస్తున్న మోదీ వలస కారి్మకులను పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కార్మికులను రప్పించాలి. – మంద పవన్, సీపీఐ జల్లా కార్యదర్శి, సిద్దిపేట  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement