
మాట్లాడుతున్న వలస కార్మిక సంఘ నాయకులు మంద భీంరెడ్డి
కోరుట్ల: వలస కార్మికుల రిక్రూట్‌మెంట్ చార్జీలు గల్ఫ్‌లో ఉండే యాజమాన్యాలే భరించాలని వలస కార్మిక సంఘాల నాయకులు మంద భీంరెడ్డి కోరారు. బుధ, గురువారాల్లో థాయిలాండ్ రాజ«ధాని బ్యాంకాక్‌లో నిర్వహించిన ‘ది గ్లోబల్ ఫోరం ఫర్ రెస్పాన్సిబుల్ రిక్రూట్‌మెంట్’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సదస్సులో చర్చించిన అంశాలను ఈ సందర్భంగా వెల్లడించారు. ఆసియా దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు అధికంగా ఉన్నాయని, రిక్రూట్‌మెంట్ చార్జీలను కంపెనీలు భరించాలని సదస్సులో తీర్మానించినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వాలను సమీకరించడం–ఆకాంక్షలు అవకాశాలు అన్న అంశంపై చర్చాగోష్టి జరిగినట్లు వెల్లడించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్‌రైట్స్ అండ్ బిజినెస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, మైగ్రేషన్ ఫోరం ఇన్ ఆసియా, హ్యుమానిటీ యునైటెడ్ సంస్థలు సంయుక్తంగా బ్యాంకాక్‌లో నిర్వహించిన ఈ సదస్సులో సుమారు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నట్లు చెప్పారు.
ప్రఖ్యాత బ్రాండెడ్ కంపెనీల ప్రతినిధులు, కార్మిక సంఘాలు, పౌరసమాజ సంస్థలు, ప్రభుత్వాలు, ఎంబసీలు, అంతర్జాతీయసంస్థల ప్రతినిధులు గల్ఫ్ వలస కార్మికుల చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను చెప్పినట్లు వివరిం చారు. విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్న వలస కార్మికులకు సంక్షేమ పథకాలు దేశంలో అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. గల్ఫ్ రిక్రూట్‌మెంట్ వ్యవస్థ, గల్ఫ్ వలసలకు ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి మెడికల్, టికెట్, నైపుణ్య శిక్షణ ఇస్తూ వాటికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. గల్ఫ్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కోసం ఏజెన్సీలకు ఒక్కొక్కరికి రూ.30–40వేలు ఫీజుగా తీసుకోవాలని భారత ప్రభుత్వం అనుమతిచ్చిందని దీనికి బదులుగా ఫీజులేని విధానం అవసరమన్నారు. వలస కార్మికులకు అవగాహన కల్పించి సమగ్ర సంక్షేమానికి పథకాలు రూపొందించాలని కోరామన్నారు.