ఎడారి దేశాల్లోనూ మహిళా వికాసం.. | Indian Women Power In Gulf Countries | Sakshi
Sakshi News home page

ఎడారి దేశాల్లోనూ మహిళా వికాసం..

Published Fri, Mar 8 2019 1:10 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Indian Women Power In Gulf Countries - Sakshi

గల్ఫ్‌ దేశాల్లోనూ తెలుగు మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతిభను కనబరుస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారు. డిపెండెంట్‌ వీసాలపై గల్ఫ్‌ దేశానికి వెళ్లిన ఎంతో మంది మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఎంతో మంది విద్యావంతులైన మహిళలు డిపెండెంట్‌ వీసాలపైనే గల్ఫ్‌ దేశాలకు వెళ్లినా తమ విద్యార్హతలకు సరిపడే ఉద్యోగ అవకాశాలను ఆయా దేశాల్లో దక్కించుకున్నారు. మన దేశ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌ కార్యాలయాల్లో ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నారు. జర్నలిజం, వైద్యం, విద్య, వ్యాపారం, బ్యాంకింగ్, న్యాయ రంగాల్లో ఎంతో మంది మహిళలు రాణిస్తున్నారు. అంతేకాకుండా రేడియో జాకీలుగా, టీవీ యాంకర్లుగా కార్పొరేట్‌ సంస్థల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా గల్ఫ్‌లో ఉపాధి కోసం వచ్చిన తమ వారికి అండగా ఉంటూ ఆర్థికంగా చేయూతనిస్తున్నారు.

సంస్కతి,సంప్రదాయాలపరిరక్షణలో..
ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన మహిళలు మన సంస్కతి, సంప్రదాయాలను పాటిస్తూనే సేవా కార్యక్రమాల్లోనూ తరిస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగను ప్రతి ఏటా గల్ఫ్‌ దేశాల్లో నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి, దసరా, దీపావళి, వరలక్ష్మి వ్రతం, సంక్రాంతి, ఉగాది ఇతరత్రా పండుగలను నిర్వహిస్తూ సంప్రదాయాలను పరిరక్షిస్తున్నారు. వీటితో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గల్ఫ్‌ దేశాల్లో క్షమాభిక్ష అమలు చేసిన సమయంలో స్వదేశానికి వెళ్లే కార్మికులకు విదేశాంగ కార్యాలయాల్లో అవసరమైన కౌన్సిల్‌ సేవలను అందిస్తున్నారు. వివిధ కారణాల వల్ల జైలుపాలైన వారికి న్యాయ సహాయం అందించడంలో మహిళల పాత్ర అమోఘం.

ఇంజనీరింగ్‌ చదివి..
ఆమె చదివింది సివిల్‌ ఇంజనీరింగ్‌ అయినప్పటికీ కార్పొరేట్‌ రంగంలో ఉన్నత ఉద్యోగం చేయాలనుకున్నారు. తాను ఆశించినట్లుగానే యూఏఈలోని ఒక ప్రముఖ బీమా సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించి తన ప్రతిభతో రాణిస్తున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన సుందర ఉపాసనకు పాల్వంచకు చెందిన రాబర్ట్‌తో వివాహమైంది. అప్పటికే రాబర్ట్‌ దుబాయ్‌లో ఒక ప్రముఖ కంపెనీలో చార్టర్‌ అకౌంటెంట్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వివాహం తరువాత దుబాయ్‌ వెళ్లిన సుందర ఉపాసనకు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. అయితే ఆమెకు ఆ రంగంలో ఉద్యోగం ఇష్టం లేదు. బీమా సంస్థలో ఉద్యోగం సంపాదించి సీనియర్‌ మేనేజర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సాంస్కతిక కార్యక్రమాలపై మక్కువ చూపే సుందర ఉపాసన.. తెలంగాణ గల్ఫ్‌ సాంస్కృతిక సంస్థలో సభ్యత్వం తీసుకున్నారు. పదేళ్ల నుంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సాంస్కతిక, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

కువైట్‌లో రేడియో జాకీగా అభిలాష
కువైట్‌ ఎఫ్‌ఎం రేడియో జాకీగా రాణిస్తున్న అభిలాష గొడిషాల ఖమ్మం జిల్లా వాసి. హ్యూమన్‌ రిసోర్స్‌లో ఎంబీఏ పూర్తి చేసిన ఆమెకు వరంగల్‌కు చెందిన సురేష్‌ గొడిషాలతో వివాహమైంది. సురేష్‌ కువైట్‌లో స్థిరపడటంతో అభిలాష కూడా కువైట్‌కు పయనమయ్యారు. అక్కడ ఒక ప్రముఖ కంపెనీలో అకౌంటెంట్‌గా రెండేళ్ల పాటు విధులు నిర్వహించిన అభిలాష దృష్టి కమ్యూనికేషన్‌ రంగంవైపు మళ్లింది. దీంతో ఆమె కువైట్‌ ఎఫ్‌ఎం రేడియోలో జాకీగా చేరి టాలీవుడ్‌ టాక్స్‌ కార్యక్రమానికి వక్తగా వ్యవహరిస్తున్నారు. అలాగే తెలంగాణలోని ఒక న్యూస్‌ చానల్‌కు, ఆ చానల్‌ అనుబంధ పత్రికకు కువైట్‌ నుంచి జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. బతుకమ్మ సంబరాల నిర్వహణ బాధ్యతను ఆమెనే చూస్తున్నారు. అభిలాష ప్రతిభను మెచ్చి 2016లో ప్రవాసీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు కూడా అందించారు.

‘తెలంగాణ ప్రజా సమితి’ ద్వారా విదేశాంగ సేవలు
జనగామ జిల్లాకు చెందిన అనుపమ సంగిశెట్టి ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయంలో కాన్సులేట్‌ సేవలు అందించే ఉద్యోగిగా కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. బీటెక్‌(కంప్యూటర్స్‌) పూర్తి చేశారు. భర్త క్రాంతికుమార్‌తో కలిసి ఆమె తొమ్మిదేళ్లుగా ఖతార్‌లో నివాసం ఉంటున్నారు. అనుపమ మూడేళ్ల పాటు మన రాయబార కార్యాలయంలో కాన్సులేట్‌ ఉద్యోగిగా విధులు నిర్వహించారు. కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేశారు.  ఖతార్‌లోని తెలంగాణ ప్రజా సమితిలో సభ్యురాలిగా ఉంటూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. మన వారికి అవసరమైన విదేశాంగ సేవలపై సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

బహ్రెయిన్‌లో వైద్యురాలిగా భ్రమర
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మద్దూరి భ్రమర దాదాపు 23 ఏళ్ల నుంచి బహ్రెయిన్‌లో పిల్లల వైద్యురాలిగా సేవలందిస్తున్నారు.  భ్రమర భర్త ప్రేమ్‌సాగర్‌ బహ్రెయిన్‌లోని ఓ బీమా కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తుండడంతో ఆమె కూడా బహ్రెయిన్‌కు పయనమయ్యారు. హైదరాబాద్‌లో ఎంబీబీఎస్, ఎండీ (పీడియాట్రిక్‌) చదివిన ఆమె బహ్రెయిన్‌కు వెళ్లిన తరువాత ఎంఆర్‌సీపీ ఇన్‌ చైల్డ్‌ హెల్త్‌ కోర్సును పూర్తిచేశారు. బహ్రెయిన్‌లో నివాసం ఉంటున్న తెలుగువారికి డాక్టర్‌ భ్రమర సుపరిచితురాలు. వైద్యురాలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే చిన్మయి సొసైటీ, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ద్వారా యోగ, ధ్యాన శిబిరాలను కొనసాగిస్తున్నారు. చిన్న పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక కోర్సులను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ద్వారా చిన్నారులకు అంది స్తున్నారు. అలాగే యోగా ద్వారా యువత సన్మార్గంలో నడవడంతో పాటు వారి జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటా యని అవగాహన కల్పిస్తున్నారు. తెలుగు ప్రజలకు తన వంతు సేవలు చేస్తూ అందరి మన్నలను అందుకుంటున్నారు డాక్టర్‌ భ్రమర.

సౌదీలో జర్నలిస్టుగా రాణిస్తున్న అమ్రినా ఖైసర్‌
గల్ఫ్‌లోని మిగతా దేశాల కంటే కొంత కఠిన నిబంధనలు ఉండే  సౌదీ అరేబియాలో జర్నలిస్టుగా, కళాకారిణిగా రాణిస్తున్నారు అమ్రినా ఖైసర్‌. హైదరాబాద్‌కు చెందిన అమ్రినా ఖైసర్‌ పదహారేళ్ల నుంచి సౌదీ అరేబియాలోని జెద్దాలో అరబ్బి టైమ్స్‌ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. పలు సామాజిక ఆంశాలపై కథనాలు రాస్తున్నారు. కళారంగంపై ఉన్న మక్కువతో కళాకారులను ప్రోత్సహించే విధంగా వ్యాసాలను రాస్తూ ప్రశంసలను అందుకుంటున్నారు. సౌదీ అరేబియాలోని మహిళలు, భారతీయ మహిళల జీవన విధానంలో ఉన్న తేడాలపై పరిశీలనాత్మక కథనాలను అందించారు. పేయింటింగ్, రైటింగ్‌ స్కిల్స్, డ్రాయింగ్, మ్యూజిక్, కవిత్వం అంటే ఎంతో ఇష్టం అని ఆమె చెబుతున్నారు. గాయనిగా కూడా ఆమె తన ప్రతిభను కనబరుస్తున్నారు. సౌదీలో పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించిన అమ్రినా ఖైసర్‌.. హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్‌లలో ఎంబీఏ పూర్తిచేశారు. జర్నలిజంలో డిగ్రీ కూడా చేశారు. ఉత్తమ జర్నలిస్టుగా అవార్డు అందుకున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీలో పర్యటించిన సందర్బంలో కవరేజీ బాధ్యతలను నిర్వహించిన ఏకైక మహిళా జర్నలిస్టు అమ్రినా ఖైసర్‌ కావడం విశేషం.

‘వేవ్‌’ ద్వారాసేవా కార్యక్రమాలు
చిత్తూరు జిల్లాకు చెందిన గీతారమేష్‌ దుబాయిలో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. గీత భర్త రమేష్‌ ఓ కంపెనీలో ఉన్నత ఉద్యోగంలో ఉన్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్న గీత ‘వేవ్‌’ సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి పలు విధాల సేవలు అందిస్తున్నారు. అలాగే దుబాయిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో తన వంతు పాత్రను పోషిస్తున్నారు.

గల్ఫ్‌కు వెళ్లే మహిళలకు శిక్షణ ఇవ్వాలి
గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లే మహిళలకు వివిధ రంగాల్లో ప్రభుత్వం శిక్షణ ఇవ్వాలి. కొందరు మహిళలను ఏజెంట్లు వంచించి ఇంటి పని కోసం షేక్‌ల ఇళ్లల్లో ఉంచుతున్నారు. పని సక్రమంగా చేసినా మహిళలపై భౌతికదాడులకు దిగుతున్నారు. దీంతో ఎంతో మంది మహిళలు అవస్థలు పడుతున్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలను గౌరవించడం కాదు.. మహిళలకు ఎప్పటికీ గౌరవం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గల్ఫ్‌ దేశాల్లో పనిచేసి సొంత గడ్డకు చేరుకునే మహిళలకు ప్రభుత్వం రాయితీ పథకాలను అందించాలి.     – స్వప్నారెడ్డి కల్లెం, కువైట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement