నైపుణ్యం ఉంటేనే మెరుగైన ఉపాధి | Gulf Employement And Skills Special Story | Sakshi
Sakshi News home page

నైపుణ్యం ఉంటేనే మెరుగైన ఉపాధి

Published Fri, Jul 5 2019 12:09 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Gulf Employement And Skills Special Story - Sakshi

గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందాలనుకునేవారు వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యతసంపాదిస్తేనే మెరుగైన ఉపాధికి అవకాశం ఉందని తెలంగాణ గల్ఫ్‌ కల్చరల్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జువ్వాడి శ్రీనివాస్‌రావు చెప్పారు. రిక్రూటింగ్‌ ఏజెన్సీల ద్వారా వస్తేనే ఉద్యోగ రక్షణ ఉంటుందన్నారు. దుబాయిలోని మల్టీనేషనల్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న జువ్వాడి శ్రీనివాస్‌రావు ‘తెలంగాణ గల్ఫ్‌ కల్చరల్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగువారిని జాగృతం చేస్తున్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గల్ఫ్‌కు వచ్చే కార్మికులకు పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

గల్ఫ్‌ డెస్క్‌:  గల్ఫ్‌లో ఉద్యోగం, ఉపాధి అనగానే.. కార్మికులు కంపెనీ గురించి, వేతన ఒప్పందాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే వీసాల కోసం రూ.వేలు కుమ్మరిస్తున్నారు. చేసే పనిలో నైపుణ్యం ఉన్నా లేకపోయినా వీసా దొరికిందనే భావనతో వస్తున్నారు. పనిలో కుదిరిన తరువాత పని విధానం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. తమను ఏజెంట్‌ మోసం చేశాడని, ఒక పనిచెప్పి మరోపని ఇచ్చారని కార్మికులు అంటుంటారు. జీతం కూడా ఏజెంట్‌ చెప్పినంత ఇవ్వడం లేదని చెబుతుంటారు. ముందే పని అగ్రిమెంట్‌ చూసుకుంటే ఈ కష్టాలు ఉండవు. చదువు రాకున్నా.. ఎవరితోనైనా అగ్రిమెంట్‌ చదివించుకోవాలి. మన తెలంగాణ జిల్లాల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే గల్ఫ్‌లో పనిచేస్తున్న వారు ఉన్నారు. తెలిసిన వారితో తాము వెళ్లే కంపెనీ గురించి ఆరాతీయాలి.  యూఏఈలో ఒక్కో కార్మికునికి 950 ధరమ్స్‌ చెల్లిస్తారు. మన కరెన్సీలో సుమారు రూ.20వేలు. రూమ్‌ అద్దె, తిండి ఖర్చులు పోతే మిగిలేది తక్కువే. కానీ, మన కార్మికులకు వీసాను ఎలాగైనా అంటగట్టాలనే ఉద్దేశంతో ఏజెంట్లు నెలకు రూ.30వేలు సంపాదించుకోవచ్చని నమ్మిస్తుంటారు. నిర్మాణ రంగంలో ఇప్పుడు పనులు చాలా వరకు తగ్గిపోయాయి. 

అన్ని గల్ఫ్‌ దేశాల్లో నిర్మాణ రంగం మందగించింది. కేవలం మెయింటెనెన్స్‌ వర్క్‌ మాత్రమే ఉంది. క్లీనింగ్, గార్డెనింగ్‌ తదితర పనులు మాత్రమే ఉన్నాయి. విజిట్‌ వీసాలపై వచ్చి.. ఏదో ఒక పనిలో కుదిరిపోవచ్చని భావిస్తుంటారు. కానీ, వీసా గడువు తీరిపోయే సమయానికి పని దొరకకపోతే అక్రమంగా నివాసం ఉండాల్సి వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఇక్కడి అధికారులకు దొరికితే జైలు శిక్షకు గురికావాల్సి ఉంటుంది. కొందరు కార్మికుల రహస్యంగా పనులు చేస్తుంటారు. వారితో పనిచేయించుకున్న కంపెనీలు జీతాలు ఇవ్వకపోవడంతో మోసపోతున్నారు. అక్రమంగా నివాసం ఉంటున్న కార్మికులు పనుల్లో గాయపడితే.. చికిత్స చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటి వారిని ఆస్పత్రులలో చేర్చుకోరు. అలా అస్వస్థతకు గురైన కార్మికులు చికిత్స చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా ఉన్నాయి. గల్ఫ్‌ వీసాలు పొందేవారు సోషల్‌ ఏజెన్సీల ద్వారా లేదా రిక్రూటింగ్‌ ఏజెన్సీల ద్వారానే తమ ఉద్యోగ ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే సురక్షితం. గల్ఫ్‌ దేశాల్లో నిర్మాణ రంగంలో పనులు లేని దష్ట్యా.. కార్యాలయాల్లో ఆఫీస్‌ బాయ్స్‌గా వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఇంగ్లిష్‌ భాషపై పట్టు ఉంటే పదోన్నతులకు అవకాశం ఉంది. అలాగే, చేసే పనిలో సక్సెస్‌ కావచ్చు.

సాంస్కృతిక కార్యక్రమాలకైనా అనుమతి తప్పనిసరి
గల్ఫ్‌ దేశాల్లో ఎలాంటి నిరసన కార్యక్రమాలనూ నిర్వహించే హక్కు లేదు. అలాగే సోషల్‌ మీడియాలో కూడా రెచ్చగొట్టే పదాలను వినియోగించడం నేరం. మంచిపని కోసమైనా బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదు. మన సాంస్కతిక కార్యక్రమాలు అంటే.. బతుకమ్మ ఇతర కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. దానికి కూడా ఇక్కడి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంది. దుబాయిలో సాంస్కతిక కార్యక్రమాలకు కమ్యునిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సీడీఏ) అనుమతి తీసుకోవాల్సి ఉంది. సాంస్కతిక కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవల పేరిట చందాలు వసూలు చేయడం నేరం. ఎలాంటి వసూళ్లకు పాల్పడినా గల్ఫ్‌ చట్టాల ద్వారా కఠిన శిక్షలకు గురవుతారు.

దుబాయ్‌లో మల్టీనేషనల్‌ కంపెనీలో 16 ఏళ్ల నుంచి మేనేజర్‌గా పనిచేస్తున్నా. 2007లో తెలంగాణగల్ఫ్‌ కల్చరల్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మద్దతుగా దుబాయిలో ధూంధాంనిర్వహించాం. మా అసోసియేషన్‌ ద్వారా పలు స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.– జువ్వాడి శ్రీనివాసరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement