గొల్ల నవీన్
చిన్నశంకరంపేట (మెదక్ జిల్లా) : ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుదామని దుబాయ్‌కి పోతే అక్కడ కష్టాలే ఎదురయ్యాయని, సాటి తెలుగువారు ఆదుకోకపోతే తాను ఏమయ్యేవాడినోనని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చిల్లిగవ్వ కూడా లేకుండా ఇంటికి తిరిగి వస్తున్నానని తెలిసి తన తండ్రి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కన్నీటిపర్యంతమయ్యాడు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామానికి చెందిన గొల్ల నవీన్ ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాలని, అక్కడ డబ్బులు సంపాదించి అప్పులు తీర్చాలని అనుకున్నాడు. ఆ మేరకు కామారెడ్డికి చెందిన ఓ ఏజెంట్‌ను కలిశాడు. అతను దుబాయ్‌కి పంపిస్తానని చెప్పాడు. అప్పు చేసి వీసా కోసం ఏజెంట్‌కు రూ.75 వేలు ఇచ్చాడు. నవీన్ అక్టోబర్‌లో దుబాయ్‌కి పయనమయ్యాడు. అయితే విమానం దగ్గరికి పోయే వరకు కూడా తనకు ఎలాంటి వీసా ఇప్పించింది చెప్పలేదు.
విమానం ఎక్కేటప్పుడు మాత్రం తాను తెలిసినవారి వద్దకు వెళ్తున్నానని చెప్పాలని.. అక్కడికి వెళ్లగానే తాను చెప్పిన వ్యక్తి వచ్చి తీసుకుపోతాడని ఏజెంట్ నమ్మించాడు. దుబాయ్‌లో విమానం దిగాక తాను మోసపోయిన విషయం అర్థమైందని, అక్కడికి ఎవరూ రాకపోగా, తనకు ఇచ్చిన నంబర్‌కు ఫోన్‌చేస్తే సరైన సమాధానం రాలేదని నవీన్ చెప్పాడు. తనను గమనించిన టాక్సీడ్రైవర్ తన వద్ద ఉన్న పత్రాలను చూసి కిరాయి చెల్లిస్తే అక్కడికి చేరుస్తానని చెప్పి తనను షార్జాలోని అడ్రస్‌కు తీసుకువెళ్లాడని చెప్పాడు.
అక్కడ తనను ఓ రూంలో ఉంచారని, తనను పంపిన ఏజెంట్ డబ్బులు వేసే వరకు పనులు చెప్పలేదని, తరువాత కేహెచ్‌కే కంపెనీలో పనిచేయించారని తెలిపాడు. తనకు డబ్బులు ఇవ్వలేదని, అక్కడే తినడంతో పాటు కంపెనీలో పనిచేస్తూ గడిపానని చెప్పాడు. తన వీసా టైం అయిపోగా, మళ్లీ వీసా టైం పెంచారని, తనకు పర్మినెంట్ వీసా కావాలంటే రూ.50 వేలు ఇవ్వాలని చెప్పారని నవీన్ తెలిపాడు. తాను ఇక్కడ ఉండలేనని, వెళ్లిపోతానని చెప్పగా.. తనకు ఒక్కపైసా కూడా ఇవ్వకుండా పంపించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నానని చెప్పడంతో మా నాన్నకు అప్పుల బెంగ పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడని నవీన్ తెలిపాడు. తమకు అర ఎకరం భూమి ఉందని, అందులో వ్యవసాయం చేస్తే కడుపునింపుకునేందుకే సరిపోయేదని చెప్పాడు. ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిల్లు చేసేందుకు తమ తండ్రి అప్పులు చేశాడని, తాను దుబాయ్‌కి పోయి సంపాదిస్తే అప్పుతీర్చవచ్చని తన తండ్రి ఆశపడ్డాడని, కానీ చివరకు ఇలా జరిగిందని నవీన్ తన దీనస్థితిని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment