హైదరాబాద్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న మోహన్, రాకే శ్
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ‘గల్ఫ్ నుంచి స్వదేశానికి వచ్చే వారికి ఉచితంగా క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తామన్న ప్రభుత్వం.. తీర ఇక్కడికొచ్చాక డబ్బులు చెల్లించమంటుంది’ అని ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మోహన్, అబ్బ రాకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వీరు కువైట్ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే ప్రభుత్వం బేగంపేటలోని ఓ హోటల్‌లో క్వారంటైన్ చేసింది. వీరిద్దరితోపాటు నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన పలువురు గల్ఫ్ వాపసీలు అక్కడే క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయితే వీరందరినీ అధికారులు క్వారంటైన్‌లో ఉన్నందుకు ఒక్కొక్కరు రూ.15 వేలు చెల్లించాలంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు చేసి గల్ఫ్ బాట
ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్ దేశాల బాట పట్టిన వారు రూ.4లక్షల నుంచి రూ.4.50 లక్షల వరకు అప్పు చేశారు. అయితే కరోనా ప్రభావంతో అక్కడ కంపెనీల్లో పనులు సరిగ్గా లేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్‌లో ఉంచేందుకు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని తాము తిరిగి వచ్చినట్లు వారంత పేర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన అబ్బ రాకేశ్, మండలంలోని వేములకుర్తికి చెందిన మోహన్‌తోపాటు నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన ముగ్గురు, కమ్మర్‌పల్లి మండలం ఆశకొత్తూర్‌కు చెందిన ఇద్దరు, భీంగల్‌కు చెందిన ముగ్గురు, కోనసముందర్ గ్రామానికి చెందిన ఒకరు, వెల్పూర్‌కు చెందిన ఒకరు కువైట్ నుంచి ఈ నెల 10న హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరందరినీ బేగంపేటలోని కామత్ హోటల్‌లోని క్వారంటైన్‌కు తరలించారు.
ప్యాకేజీలతో బెంబేలు
కువైట్ నుంచి బయలుదేరే సమయంలో హైదరాబాద్‌లో హోటల్‌లో ఉండేందుకు రూ.5 వేలు, రూ.15 వేలు, రూ.30 వేలు ప్యాకేజీ చూపించారని, ఇక్కడికొచ్చాక రూ.15 వేలు, రూ.30 వేలు ప్యాకేజీలు అని చెప్పి ఒక్కొక్కరు రూ.15 వేలు చెల్లించాలని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద డబ్బులు లేవని, అప్పు చేసి కువైట్ పోయామని, ఎక్కడి నుంచి కట్టాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. క్వారంటైన్‌లో మంచిగానే చూసుకుంటున్నారని, నిత్యం వైద్యులు వచ్చి పరీక్షిస్తున్నారని వారు తెలిపారు. ఉదయం టీ, టిఫిన్‌తోపాటు రెండు పూటల భోజనం పెడుతున్నారని తెలిపారు. అయితే డబ్బుల విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment