
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని జమ్మికుంటలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళను ఇంట్లోకి రానివ్వలేదు యజమాని. దాంతో మార్కెట్ యార్డ్‌లో తలదాచుకున్నది. ఈ విషయం తెలిసిన మార్కెట్ యార్డు అధికారులు ఆ మహిళను అక్కడి నుంచి వెళ్లగొట్టడంతో ఆదిరించేవారు లేక.. ఎక్కడికి వెళ్లాలో తెలియక.. రోడ్డుపై ఉన్న తోపుడు బండిపై సేదతీరే దుస్థితి ఏర్పడింది. ఈ విషాధకర ఘటన వివరాలు.. జమ్మికుంట అంబేడ్కర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కూరగాయలు విక్రయించి జీవనం సాగించే మహిళ కరోనా బారిన పడింది. విషయం తెలిసిన ఇంటి యజమాని ఆమెను ఇంట్లోకి రానివ్వకపోవడంతో స్థానిక మార్కెట్ యార్డులో రాత్రంతా జాగరణ చేసింది.
సదరు మహిళ కోవిడ్ బాధితురాలు అని తేలడంతో మార్కెట్ అధికారులు ఆమెను ఉదయం అక్కడి నుంచి బయటకు పంపేశారు. ఇక ఉండటానికి స్థలం లేక పాత అంబేడ్కర్ చౌరస్తా ప్రాంతంలో సులబ్ కాంప్లెక్స్ ముందు తోపుడు బండి మీద నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. బాధితురాలి గురించి తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు దిలీప్ ఆమె గురించి వైద్యాధికారులకు సమాచారం అందించడంతో.. వైద్య సిబ్బంది అంబులెన్సులో కరీంనగర్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.
రెండు రోజులుగా రోడ్డుపై అవస్థ పడిన మహిళను చూసి చలించిపోయిన స్థానికులు, స్థానికంగా ఐసోలేషన్ హోం క్వారంటైన్ ఏర్పాటు చేయకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment